అయ్యో తల్లీ.. ఆడపిల్ల పుడుతుందేమోనని నిండుగర్భిణీ షాకింగ్ నిర్ణయం; అనాధలైన ఇద్దరు ఆడపిల్లలు!!

మహబూబ్ నగర్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆడపిల్ల పుడుతుందేమో అన్న భయంతో నిండు గర్భిణీ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా ఉన్న వారి మనసులను కలచివేసింది. తల్లి తీసుకున్న క్షణికావేశ నిర్ణయం ఇద్దరు ఆడపిల్లలను తల్లిలేని అనాధలుగా మార్చింది.

మహబూబ్ నగర్ మండలం గాజులపేటకు చెందిన 25 సంవత్సరాల మౌనిక అదే గ్రామానికి చెందిన మాధవ రెడ్డితో వివాహం జరిగింది. మౌనిక తన మేనత్త కొడుకునే వివాహం చేసుకుంది. వారికి ఇద్దరు ఆడపిల్లలు. అప్పటికే ఇద్దరు ఆడ పిల్లలకు జన్మనిచ్చిన మౌనిక మళ్లీ గర్భం దాల్చింది. ప్రస్తుతం మౌనిక ఏడు నెలల గర్భవతి. అయితే ఆడపిల్ల పడుతుందేమోనని ఆమె కొద్దిరోజులుగా భయపడుతోంది. మళ్లీ ఆడపిల్ల పుడితే భర్త తనను ఏమైనా అంటాడేమో అని తనలో తనే ఆందోళన చెందిన సదరు మహిళ ఊహించని షాకింగ్ నిర్ణయం తీసుకుంది.

ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆ తరువాత గమనించిన కుటుంబ సభ్యులు మృతదేహాన్ని కిందకు దించి పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు మహబూబ్ నగర్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మళ్లీ ఆడపిల్ల పుడుతుందేమో అన్న ఆందోళనలో ఆత్మహత్య చేసుకున్న సదరు మహిళ, అప్పటికే ఆమె ఇద్దరు ఆడపిల్లలకు తల్లి అనే విషయాన్ని మరిచి పోయింది.

ఇద్దరు ఆడపిల్లలను అనాథలను చేసి క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయంతో అనంత లోకాలకు వెళ్లిపోయింది. తల్లి మృతితో ఇద్దరు ఆడపిల్లలు కన్నీరు మున్నీరుగా రోదిస్తున్నారు. భార్య చేసిన పనికి భర్త సైతం షాక్ కు గురయ్యారు. ఆ చిన్నారులను చూసిన గ్రామస్తులు కూడా తీవ్ర మనస్థాపానికి గురవుతున్నారు. అయ్యో తల్లి .. ఆడపిల్ల పుడుతుందని ఇంత పని ఎలా చేశావా అంటూ విలపిస్తున్నారు. ఆడైనా, మగైనా ఒక్కటే అని అని ప్రభుత్వాలు ఎంతగా చెప్తున్నా ఇంకా సమాజంలో ఆడ, మగ విషయంలో తేడా ఉంది అన్నది ఈ ఘటనతో స్పష్టం అవుతుంది.