శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తిరుమల ముస్తాబు: 27న వెంకన్న సేవలో జగన్

తిరుపతి: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవెంకటేశ్వర స్వామివారికి ఏటా నిర్వహించే సాలకట్ల బ్రహ్మోత్సవాల కోసం తిరుమల ముస్తాబవుతోంది. ఈ నెల 27వ తేదీ నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. దీనికోసం తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తోన్నారు. లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి రానున్న నేపథ్యంలో- అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటోన్నారు.

సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ముందుగా తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీ. సంవత్సర కాలంలో నాలుగుసార్లు తిరుమంజనం సేవను చేపడతారు. ఉగాది, ఆణివారి ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం నాడు ఆలయశుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు అధికారులు. సాలకట్ల బ్రహ్మోత్సవాల ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని ఇవ్వాళ టీటీడీ అధికారులు, అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.

శుద్ధిలో భాగంగా మూలవిరాట్‌కు వస్త్రం కప్పడంతో ఈ కార్యక్రమం ఆరంభమౌతుంది. గర్భాలయాన్ని ఆలయ అర్చకులు శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ మహాద్వారం వరకూ ఈ శుద్ధిని అధికారులు, అర్చకులు పూర్తి చేశారు. ఆనంద నిలయం బంగారువాకిలి, విమాన వేంకటేశ్వరుడు, శ్రీవారి ఆలయం లోపల ఉన్న ఉపాలయాలు, రంగనాయకుల మండపం, ఆలయప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుభ్రం చేశారు.

శుద్ధి పూర్తి అయిన అనంతరం నామపుకోపు, శ్రీచూర్ణం, కస్తూరిపసుపు, పచ్చకర్పూరం, గంధంపొడి, కుంకుమ, కిచిలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పరిమళ ద్రవ్యాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం స్వామి వారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులను నిర్వహించిన అనంతరం అనంతరం ఉదయం 11 గంటల నుంచి భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు.

ఈ సందర్భంగా టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడారు. పలు రకాల ఔషదాలు, మూలికలతో తిరుమంజనాన్ని తయారు చేస్తారని పేర్కొన్నారు. అధర్వణ వేదం, ఆయుర్వేదంలో తిరుమంజనం ప్రస్తావన ఉందని, అందులో ఉన్న వివరాల ఆధారంగా దీన్ని తయారు చేస్తామని చెప్పారు. తిరుమంజనంలో కలిపే మూలికలు, ఔషధాల వల్ల గోడలు ధృడంగా ఉంటాయని వివరించారు. ఆ సుగంధం రోజుల తరబడి ఉంటుందని చెప్పారు.

కాగా- సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 27వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమలను సందర్శించనున్నారు. రాష్ట్ర ప్రజల తరఫున స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించనున్నారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి బయలుదేరి, ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం రోడ్డు మార్గంలో తిరుమలకు చేరుకుంటారు. సాయంత్రం స్వామివారి సేవలో పాల్గొంటారు. పట్టువస్త్రాలను సమర్పిస్తారు.