వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యేలపై కేసుల విత్ డ్రా- వెనక్కి తగ్గిన సర్కార్- జీవోల రద్దు

ఏపీలో వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా గతంలో టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాల్లో నమోదైన కేసుల్ని ఉపసంహరిస్తూ వైసీపీ సర్కార్ ఇచ్చిన ఉత్తర్వుల్ని వెనక్కి తీసుకుంది. ఈ మేరకు హైకోర్టుకు ప్రభుత్వం వివరాలు అందజేసింది. దీంతో సదరు వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు గట్టి ఎదురుదెబ్బ తగినట్లయింది. తమ ప్రభుత్వం రాగానే కేసుల్ని వెనక్కి తీసుకునేలా ఒత్తిడి పెంచి సాధించుకున్న వారంతా ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయంతో షాకవుతున్నారు.

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అధికార పార్టీకి చెందిన పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసుల్ని ఉపసంహరించుకుంటూ జీవోలు ఇచ్చారు. దీనిపై అభ్యంతరాలు వ్యక్తమైనా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇలా కేసుల్ని ఉపసంహరించుకునేందుకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నా వాటిని కూడా లెక్కచేయలేదు. దీంతో ఏకంగా సుప్రీంకోర్టులోనే వాజ్యాలు దాఖలయ్యాయి. చివరికి హైకోర్టు సుమోటోగా ఈ కేసుల వ్యవహారంపై దృష్టిసారించింది. దీంతో ప్రభుత్వం ఇరుకునపడింది.

వైసీపీ ప్రభుత్వం తమ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులపై కేసులు వెనక్కి తీసుకోవడంపై హైకోర్టు సుమోటో విచారణ ప్రారంభించడమే కాకుండా ఈ నిర్ణయాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరు డేంజర్ జోన్ లో ఉన్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతో ప్రభుత్వం తీవ్ర మల్లగుల్లాలు పడింది. చివరికి తమ నిర్ణయాన్ని తాజాగా హైకోర్టుకు తెలియజేసింది. ఈ నేపథ్యంలో కేసుల ఉపసంహరణ వ్యవహారం కొలిక్కి వచ్చేలా కనిపిస్తోంది.

వైసీపీ ప్రజాప్రతినిధుల కేసుల ఉపసంహరణ వ్యవహారంలో ఎట్టకేలకు ప్రభుత్వం వెనక్కితగ్గింది. సుప్రీంకోర్టు ఆదేశాలు ఉల్లంఘించి ప్రజాప్రతినిధులపై కేసుల ఉపసంహరణ కోసం ఇచ్చిన జీవోలను వెనక్కి తీసుకుంది. కేసుల ఉపసంహరణ విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరిస్తామని ప్రభుత్వ న్యాయవాది హైకోర్టుకు తెలిపారు.
హోంశాఖ తరఫు ప్రభుత్వ న్యాయవాది(జీపీ) మహేశ్వరరెడ్డి స్పందిస్తూ.. ప్రజాప్రతినిధులపై కేసుల ఉపసంహరణకు గతంలో ఇచ్చిన తొమ్మిది జీవోలను ఉపసంహరించుకుంటూ తాజాగా జీవో ఇచ్చామన్నారు. ఆ వివరాలను మెమో రూపంలో కోర్టు ముందు ఉంచుతామన్నారు. దీంతో విచారణను హైకోర్టు ధర్మాసనం అక్టోబర్‌ 13కు వాయిదా వేసింది.