రైతుకు నష్టం వస్తే ఆత్మహత్యే.. సినిమా ఫ్లాప్ అయితే మా పరిస్థితి అదే.. నాగశౌర్య ఎమోషనల్

యువ హీరో నాగశౌర్య నటించిన కృష్ణ వ్రింద విహారి చిత్రం సెప్టెంబర్ 23న రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా నాగశౌర్య మాట్లాడుతూ.. కృష్ణా వ్రిందా విహారి చిత్రాన్ని తీయడానికి రెండున్నర ఏళ్లు పట్టింది. కరోనా కారణంగా సినిమాకు చాలా అడ్డంకులు వచ్చాయి. ఈ సినిమా నిర్మాణంలో చాలా బాధలు ఉన్నాయి. సినిమా నిర్మాతలు డబ్బు తీస్తే తప్ప సినిమా పూర్తవ్వదు. నా తల్లిదండ్రులు ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. నా కోసం, నా మిత్రుడి కోసం డబ్బును లెక్క చేయలేదు. ఆలస్యమైనందుకు వడ్డీలు నా తల్లిదండ్రులు కట్టారు. సినిమా మీద ప్రేమతో కాదు. కేవలం నా కోసం మాత్రమే నా తల్లిదండ్రులు రిస్క్ చేశారు. నా కొడుకు భవిష్యత్ బాగుండాలని మాత్రమే ఈ సినిమాను చేశారు. ఇలాంటి తల్లిదండ్రులు ఎవరికి ఉండరు అని ఎమోషనల్ అయ్యారు. ఇంకా నాగశౌర్య ఏం మాట్లాడారంటే..

సినిమా విషయానికి వస్తే.. దర్శకుడు అనీష్ కృష్ణతో ట్రావెల్ చేయడం వల్ల నేను చాలా మారాను. ఆయనకు చాలా ఓపిక ఎక్కువ. నా వద్దకు మంచి స్క్రిప్టు తీసుకొచ్చారు. మనం చాలా కష్టపడ్డాం. ఇక ప్రేక్షకుల తీర్పుకే వదిలివేద్దాం. ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ వర్క్ స్పెషల్ ఎట్రాక్షన్. ఈ సినిమాలో కీలక సన్నివేశం ఉంది. సినిమా లైఫ్‌ను డిసైడ్ చేసే సీన్ కోసం లక్ష్మీ భూపాల రాశారు. ఆయనకు నా థ్యాంక్స్. మహతి సాగర్ మ్యూజిక్ డైరెక్టర్ కాదు.. నాకు బెస్ట్ ఫ్రెండ్. నాకు అన్ని సందర్భాల్లో నాకు అండగా ఉన్నారు. సాగర్ పాటలకు డ్యాన్స్ వేయాలంటే కష్టం. కొరియోగ్రాఫర్ డిజైన్ చేసిన స్టెప్పులు బాగా వచ్చాయి అని నాగశౌర్య తెలిపారు.

హీరోయిన్ షెర్లీ మంచి యాక్టర్. మంచి అమ్మాయి. అందంతో అభినయం ఉన్న యాక్టర్. ఈ సినిమా కోసం రాధిక లేకపోతే ఈ సినిమా చేయనని ఆమెతో చెప్పాను. ఈ సినిమాలో రాధిక మేడమ్ తప్ప మరోకరు ఈ క్యారెక్టర్ చేయలేరు. ఈ సినిమాకు సపోర్ట్ చేసిన రాధిక మేడమ్ థ్యాంక్స్. మంచి సినిమా ఉంటే బ్రహ్మాజీ వదులుకొరు. ఈ సినిమా జర్నీలో చాలా రకాలుగా సలహాలు ఇచ్చారు.ఈ సినిమాలో నటించిన ప్రతీ ఒక్కరికి థ్యాంక్స్ అని నాగశౌర్య అన్నారు.

కృష్ణ వ్రింద విహారి సినిమాకు అన్నివేళలా అనిల్ రావిపూడి అండగా ఉన్నారు. సినిమా ప్రారంభానికి, టీజర్ రిలీజ్‌కు, ప్రీ రిలీజ్‌కు వచ్చారు. మా సినిమాకు ఆశీస్సులు అందించారు. ఈ సినిమా బాగుంది. మీరు బ్లాక్ బస్టర్ చేసినా..డిజాస్టర్ చేసినా తలవంచి నమస్కరిస్తాను. ఓవరాల్‌గా మంచి సినిమా చేశాం. తుది తీర్పు ప్రేక్షకులే అని నాగశౌర్య ఎమోషనల్ అయ్యారు.

కృష్ణ వ్రింద విహారి కోసం పాదయాత్ర చేశాను. ఆ సమయంలో భీమవరంలో ఓ వ్యక్తి కలిసి నాకు ఇండస్ట్రీకి రావాలని ఉంది. మీ మాదిరిగా మాకు కార్లు, బంగ్లా లేవు అని అన్నారు. నేను సినిమా ఇండస్ట్రీకి రాకముందు.. మిడిల్ క్లాస్ ఫ్యామిలీనే, నాతో ఉన్నవారంతా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలే. సక్సెస్ వచ్చిన తర్వాతే ఇల్లు, కార్లు కొన్నాం. అలాంటి ఇండస్ట్రీలో ఉన్నందుకు గర్వంగా ఉంది. సినిమా పరిశ్రమలో పనిచేసే వారికి జీతంతోపాటు భోజనం పెడుతారు. మిగితా ఏ ఇండస్ట్రీలో కూడా ఇలా ఉండదు. ఇలాంటి ఇండస్ట్రీలో ఉన్నందుకు గర్వంగా ఉంది అని అన్నారు.

పాదయాత్రలో రైతుల గురించి ఎక్కువగా తెలుసుకొన్నాను. పచ్చటి పొలాలు, పంటలు చూశాను. పంట బాగుంటే రైతులు హ్యాపీగా ఉంటారు. మేము కూడా రైతుల మాదిరిగానే ఉంటాం. వరదలు, విపత్తు వస్తే పంట దెబ్బతిని రైతు ఆత్మహత్య చేసుకొంటారు. పంట చేతికి వస్తే రాజులా ఉంటాడు. మా పరిస్థితి కూడా అంతే.. సినిమా హిట్ అయితే రాజులా ఉంటాం. లేకపోతే కష్టాల్లో మునిగి తేలుతాం. లాభమైనా, నష్టమైనా రైతు పంటనే పండించాలి.. మేము సినిమానే చేయాలి. కాబట్టి సినిమాను ఎంకరేజ్ చేయండి అంటూ నాగశౌర్య ఎమోషనల్ అయ్యారు.