మునుగోడు వారికి రంగస్థలం.. మెజార్టీ తెచ్చిన కాంగ్రెస్ నేతలకు రేవంత్ రెడ్డి అదిరిపోయే ఆఫర్!!

మునుగోడు ఉపఎన్నిక అధికార, ప్రతిపక్ష పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. ముఖ్యంగా మునుగోడు ఉప ఎన్నికల్లో గెలవాల్సినటువంటి అవసరం కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా ఉంది. ఎందుకంటే మునుగోడు స్థానం ఇంతకు ముందు కాంగ్రెస్ ఖాతాలోనే ఉండటంతో, ఇప్పుడు కూడా అక్కడ విజయం సాధించి కాంగ్రెస్ తన పట్టును నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తుంది. ఒకవేళ ఇప్పుడు జరగనున్న ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైతే దాని ప్రభావం భవిష్యత్తు ఎన్నికల పైన కూడా ఉండే అవకాశం ఉండటంతో, కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా ఈ ఎన్నికలలో విజయం సాధించాలని పట్టుదలతో ఉంది.

అయితే కాంగ్రెస్ పార్టీకి అంతర్గత కుమ్ములాటలు, పార్టీ నేతల మధ్య సమన్వయం లేకపోవడం, రేవంత్ రెడ్డి ని వ్యతిరేకించే వర్గం, పాల్వాయి స్రవంతి టికెట్ ఇవ్వడంతో ఆమెకు సహకరించని నేతల తీరు టెన్షన్ పుట్టిస్తుంది. ఇక మునుగోడు ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి తీరుతుందని ఇప్పటికే బల్లగుద్ది చెప్పిన రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని ఓడించి తీరుతామని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మునుగోడు ఉపఎన్నిక అటు కాంగ్రెస్ పార్టీకి మాత్రమే కాకుండా, రేవంత్ రెడ్డి సామర్ధ్యానికి కూడా పరీక్షగా మారింది.

మునుగోడు ఉప ఎన్నికల్లో గెలవడం రేవంత్ రెడ్డికి కూడా కఠిన పరీక్షగా మారడంతో, ఆయన మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో నియోజకవర్గంలో ప్రచారం సాగించడానికి తిరుగుతున్న వివిధ నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులకు బంపర్ ఆఫర్ ప్రకటించినట్టుగా తెలుస్తుంది. మునుగోడు ఉప ఎన్నికను వచ్చే ఎన్నికలలో పోటీ చేయాలనుకునేవారు రంగస్థలం గా వాడుకోవచ్చని, మునుగోడులో వారు ప్రచారం నిర్వహించిన ప్రాంతంలో మెజారిటీ తీసుకువస్తే వారికి సొంత నియోజకవర్గం టికెట్ కోసం తాను అధిష్టానం వద్ద పోరాటం చేస్తానని, కచ్చితంగా వారికి టికెట్ వచ్చేలా చూస్తానని రేవంత్ రెడ్డి హామీ ఇస్తున్నారని సమాచారం.

ఎవరైతే తమకిచ్చిన బాధ్యతలను పక్కాగా నెరవేర్చి వారికి బాధ్యతలు అప్పగించిన చోట మెజారిటీ తీసుకువస్తే, వారికి భవిష్యత్తు ఎన్నికల్లోనూ పోటీ చేయడానికి అవకాశం వచ్చేలా తాను చూస్తానని రేవంత్ రెడ్డి చెబుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మండలానికి ఇద్దరు ముగ్గురు చొప్పున కీలక నేతలకు బాధ్యతలు అప్పగించి రక రకాల వ్యూహాలతో మునుగోడులో ప్రచార పర్వాన్ని కొనసాగిస్తోంది కాంగ్రెస్ పార్టీ. ప్రతి ఒక్కరికి వ్యక్తిగత టార్గెట్ ను ఇచ్చి, ఆ ప్రాంతంలో మెజారిటీ తీసుకురావాలని లక్ష్యంగా పెట్టిమరీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తుంది.

ఇక ఇదే సమయంలో వారిలో జోష్ నింపేలా వచ్చే ఎన్నికల్లో వారు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాలలో టిక్కెట్లు ఇస్తామని ఆశ చూపిస్తున్న రేవంత్ రెడ్డి ఇచ్చిన అదిరిపోయే ఆఫర్ నేపద్యంలో కాంగ్రెస్ శ్రేణులు ఏ విధంగా పని చేస్తారు అనేది తెలియాల్సి ఉంది. ఏమైనప్పటికీ మునుగోడు ఉపఎన్నిక కాంగ్రెస్ పార్టీకి జీవన్మరణ సమస్యగా ఉన్న సమయంలో రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణులు అందరూ సమన్వయంతో పని చేయడం కోసం నానా పాట్లు పడుతున్నారు. మరి ఈ ప్రయత్నం లో రేవంత్ రెడ్డి ఏ మేరకు సక్సెస్ అవుతారో? రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆఫర్ తో కాంగ్రెస్ నాయకులు ఏ విధంగా పని చేస్తారో తెలియాల్సి ఉంది.