మహేష్ బాబు కంటే చంద్రబాబు అందగాడు: వైసీపీ ఎమ్మెల్యే

అమరావతి: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల నాలుగోరోజు సభలో ఆసక్తికరమైన చర్చ సాగింది. ప్రజారోగ్యంపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వుద్ధం నడిచింది. ఈ క్రమంలో దోమలపై దండయాత్ర కార్యక్రమం ప్రస్తావనకు తీసుకొచ్చారు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు. ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, నంద్యాల సభ్యుడు శిల్పా రవిచంద్రా రెడ్డి సహా పలువురు ఈ అంశంపై మాట్లాడారు. టీడీపీ వైఖరిని ఎండగట్టారు.

దోమలపై దండయాత్ర పేరుతో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ప్రచార హాడావుడి తప్ప..సమస్యను పరిష్కరించడానికి ఎలాంటి ప్రయత్నాలు జరగలేదని రవిచంద్రా రెడ్డి అన్నారు. ప్రచారంలో భాగంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో చంద్రబాబుకు చెందిన భారీ కటౌట్లు ఏర్పాటు చేసుకున్నారని గుర్తు చేశారు. ప్రచారం కోసం కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని, మంచినీళ్లలా ఖర్చు పెట్టారని విమర్శించారు.

ఈ ఉదయం అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. దోమలపై దండయాత్ర పేరుతో వారం రోజుల పాటు బహిరంగ సభలను నిర్వహించుకుని, ప్రచారం చేసుకున్నారని అన్నారు. చంద్రబాబుకు చెందిన 50 అడుగుల ఎత్తు ఉన్న భారీ కటౌట్‌ను జిల్లాలో ఏర్పాటు చేశారని శిల్పా రవిచంద్రారెడ్డి చెప్పారు. ఆ కటౌట్లల్లో చంద్రబాబు.. మహేష్ బాబు కంటే అందంగా కనిపించారని ఎద్దేవా చేశారు.

చంద్రబాబు చేతిలో ఒక కత్తి, ఆ కత్తిపై ఒక దోమను పెట్టారని, కటౌట్ కింద ఓ భారీ యాక్షన్ సినిమాను తలపించేలా దోమలపై దండయాత్ర అనే టైటిల్‌ను పెట్టారని అన్నారు. దోమలన్నింటినీ సంహరించామని, వాటిని నిర్మూలించామని చెప్పుకొన్న తెలుగుదేశం పార్టీ నాయకులు- అదే చేత్తో దోమతెరలను పంచారని చురకలు అంటించారు. దోమతెరలను పంచి, దోమలను నిర్మూలించామని చెప్పుకొన్న ఘనత తెలుగుదేశం పార్టీదేనని ధ్వజమెత్తారు.

ఇలా ప్రచారం కోసమే కోట్ల రూపాయలను ఇష్టారాజ్యంగా ఖర్చు పెట్టారని అన్నారు. దోమలపై దండయాత్ర పేరుతో ప్రజాధనాన్ని లూటీ చేశారని ఆరోపించారు. అంతకుముందు- ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని ఇదే అంశం మీద మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం దోమలపై దండయాత్ర కార్యక్రమాన్ని వారం రోజుల పాటు నిర్వహించిన తరువాత రాష్ట్రంలో లక్షకు పైగా డెంగ్యూ కేసులు నమోదయ్యాయని చెప్పారు.

ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రజలకు ఏమైనా సందేశాన్ని ఇచ్చారంటే అదీ లేదని విడదల రజిని అన్నారు. దీనికి సంబంధించిన కొన్ని పేపర్ క్లిప్పింగులను చదివి వినిపించారు. కేంద్రం కంటే తానే తెలివైన వాడినని, అందుకే ప్రత్యేక హోదాను వద్దని, ప్యాకేజీకి అంగీకరించానని చంద్రబాబు ఈ సభల్లో చెప్పుకొన్నారని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం చేయలేకనే పోలవరం ప్రాజెక్టు‌ను తన చేతికి అప్పగించిందంటూ చంద్రబాబు చేసిన ప్రకటనను చదివి వినిపించారు.