మరో గురుకులంలో ఫుడ్ పాయిజన్; పురుగుల భోజనంతో 35మంది విద్యార్థులకు అస్వస్థత; ఆందోళన!!

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ వసతి గృహాలలో, గురుకులాలలో విద్యార్థుల ఆహారంపై, విద్యార్థులకు అక్కడ కల్పిస్తున్న వసతి సౌకర్యాలపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ, నేటికీ తెలంగాణ రాష్ట్రంలోని గురుకుల హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి.

కొమురంభీం జిల్లా కాగజ్ నగర్ మండలం గన్నారం మైనార్టీ గురుకులంలో ఫుడ్ పాయిజన్#Kazagnagar #KomuramBheemDist #OneIndiaTelugu pic.twitter.com/BQh3rfUelZ

వర్ధన్నపేట సాంఘిక సంక్షేమ వసతి గృహంలో చోటుచేసుకున్న ఫుడ్ పాయిజన్ ఘటన తరువాత అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం జిల్లాల వారీగా సంక్షేమ వసతి గృహాలపై ప్రత్యేక అధికారులను నియమించి మరీ , ఎప్పటికప్పుడు హాస్టళ్లను తనిఖీ చేస్తూ చర్యలు చేపట్టింది. అయినప్పటికీ ఇంకా అనేక హాస్టళ్లలో విద్యార్థులు ఇటీవల కాలంలో తీవ్ర అనారోగ్యానికి గురవుతున్న ఘటనలు అనేకం వెలుగుచూస్తున్నాయి. ఇక తాజాగా కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కాగజ్ నగర్ మండలంలోని గన్నారం మైనారిటీ గురుకులం లో 35 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ తో అస్వస్థత పాలయ్యారు.

విపరీతమైన కడుపు నొప్పి, వాంతులతో విద్యార్థులు అస్వస్థతకు గురి కాగా, వారందరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిన్న రాత్రి పురుగుల ఆహారాన్ని తిన్న కారణంగానే విద్యార్థులందరూ అస్వస్థతకు గురయ్యారని తెలుస్తుంది. కడుపునొప్పితో బాధపడుతున్న విద్యార్థులను కాగజ్నగర్ ఆసుపత్రికి తరలించి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. విద్యార్థులు కడుపునొప్పితో బాధపడుతున్న క్రమంలో ఇక భోజనం లో పురుగులు వచ్చాయని విద్యార్థులు గురుకుల ముందు ధర్నా నిర్వహించారు.

విద్యార్థులకు మంచి పౌష్టికాహారం పెట్టాలని, ప్రభుత్వం ఎంతగా చెబుతున్నా, వసతి గృహాలలో మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా ఉంటున్నాయి. విద్యార్థులకు ఇచ్చే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడంతో విద్యార్థులు నిరంతరం ఫుడ్ పాయిజన్ బారిన పడుతున్నారు. విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురైన తర్వాత ప్రభుత్వం విచారణ చేయడానికి అధికారులను నియమించి, ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుని చేతులు జరుపుకుంటోంది.

వసతి గృహాలలో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా మాత్రం చర్యలు తీసుకోలేకపోతోందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంక్షేమ వసతి గృహాలకు చిన్నారులను పంపించాలంటేనే ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయంతో ఉండవలసివస్తుందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. మెరుగైన వసతులు, మంచి భోజన సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.