పంజాబ్ సీఎంను విమానం నుంచి దించివేశారట, లుప్తాన్సాను వివరాలు అడిగిన సింధియా

పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఫుటుగా మద్యం తాగి.. నిలబడలేని స్టేజీలో ఉండటంతో లుప్తాన్సా ఎయిర్ లైన్స్ సిబ్బంది విమానం నుంచి దించి వేశారనే కథనాలు వస్తోన్నాయి. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. విచారణకు ఆదేశించామని పౌర విమానయాన శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

జర్మనీ ఫ్రాంక్‌ఫర్ట్ విమానాశ్రయంలో విమానం ఎక్కిన మాన్‌ను లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్‌ సిబ్బంది విమానం నుంచి దించివేశారట. దీనికి సంబంధించి వాస్తవాలను పరిశీలిస్తామని కేంద్ర పౌర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. విచారణ జరపాలని కాంగ్రెస్ సహా పలు పార్టీలు సింధియాను డిమాండ్ చేయగా.. విచారణ చేయిస్తామని చెప్పారు. విదేశంలో ఇన్సిడెంట్ జరగగా పూర్తి వివరాలు అందించాలని లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్‌‌ను కోరారు.

భగవంత్‌ మాన్‌ ఈ నెల 11వ తేదీ నుంచి 18 వరకు జర్మనీలో ఉన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ వ్యాపారవేత్తలను కోరేందుకు జర్మనీ వెళ్లారు. షెడ్యూల్ ప్రకారం రావాల్సిన రోజు కాకుండా ఒక రోజు ఆలస్యంగా భారత్ వచ్చారు. మాన్ ఆలస్యానికి అసలు కారణం ఫుల్లుగా మద్యం తాగి జర్మనీ ఫ్రాంక్‌ఫర్ట్ విమానాశ్రయంలో విమానం ఎక్కడమేనని వార్తలు బయటకు వచ్చాయి. కంట్రోల్ తప్పడంతో మాన్‌ను లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్‌ సిబ్బంది విమానం నుంచి దించివేశారని శిరోమణి అకాలీదళ్ నేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్ ట్వీట్ చేశారు. మాన్ వల్ల విమానం నాలుగు గంటలు ఆలస్యంగా బయలుదేరిందట. ఆప్ జాతీయ సదస్సుకు కూడా మాన్ హాజరు కాలేకపోయారని సుఖ్‌బీర్ ఆరోపించారు.

సుఖ్‌బీర్‌ ట్వీట్ తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా ఆప్‌పై విరుచుకుపడింది. పంజాబ్ అసెంబ్లీలో కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత ప్రతాప్ సింగ్ బాజ్వా కేంద్ర విమానాయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు లేఖ రాశారు. తమను బద్నాం చేసేందుకు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ అంటోంది. ఈ అంశంపై లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్‌ వివరణ ఇచ్చింది. విమానం ఆలస్యమైన మాట నిజమేనని, అనుబంధ విమానం ఆలస్యం కావడమే ఇందుకు కారణమని పేర్కొంది. ప్రయాణికుల వ్యక్తిగత డేటాను పంచుకోలేమని తెలిపింది. దీంతో మాన్ మద్యం సేవించారని అనుకోవచ్చు. సింధియా వివరాలు కోరడంతో.. విషయం బయటకు తెలిసే అవకాశం ఉంది.