ట్రాఫిక్ లో చిక్కుకున్న మంత్రులు, ఎమ్మెల్యేలు.. సైరన్ల మోతతో దద్దరిల్లిన రాజధాని గ్రామాలు

రైతుల స‌మ‌స్య‌ల‌పై తెలుగుదేశం పార్టీకి చెందిన తెలుగు రైతు ఆధ్వ‌ర్యంలో అసెంబ్లీ ముట్ట‌డికి ప్ర‌య‌త్నించ‌డం తీవ్ర ఉద్రిక్త‌త‌ల‌కు దారితీసింది. ప్ర‌ధాన స‌చివాల‌యం ద‌గ్గ‌ర ఉన్న విద్యుత్తు స‌బ్ స్టేష‌న్ గోడ‌దూకి అసెంబ్లీ ముట్టడికి రావడంతో ఉద్రిక్త‌త తలెత్తింది. తెలుగు రైతు విభాగం రాష్ట్ర అధ్య‌క్షుడు మ‌ర్రెడ్డి శ్రీ‌నివాస‌రెడ్డితోపాటు త‌ర నేత‌ల‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్ర‌మంలోనే పోలీసుల‌కు, రైతు విభాగం నేతల మ‌ధ్య వాగ్వాదం తోపులాట జ‌రిగాయి. వీరంద‌రినీ పోలీసులు ఈడ్చుకెళ్లి వాహ‌నాల్లో పడేశారు. అనంతరం స్టేష‌న్‌కు తీసుకువెళ్లారు.

ఈ నిర‌స‌న‌ల‌తో స‌చివాల‌యానికి వెళ్లే ర‌హ‌దారుల‌న్నీ ట్రాఫిక్ తో స్తంభించిపోయాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వాహ‌నాలు అందులోనే ఉండిపోయాయి. ఆయా వాహ‌నాల‌కు ముందుగా ఉండే ఎస్కార్ట్ వాహ‌నాల సైర‌న్ల మోత‌తో అసెంబ్లీ ప‌రిస‌ర ప్రాంతాలు ద‌ద్ద‌రిల్లాయి. ట్రాఫిక్ క్లియర్ చేసే వరకూ అసెంబ్లీకి వెళ్లడానికి వేరేమార్గం లేకపోవడంతో ప్రజాప్రతినిధులంతా తమ వాహనాల్లోనే ఉండిపోయారు.

రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, దీన్ని పోలీసులతో అడ్డుకోవడం తగదంటూ టీడీపీ నేతలు ఖండించారు. పోలీసులతో ప్రభుత్వాన్ని ఎన్నాళ్లు నడిపించాలనుకుంటున్నారంటూ ముఖ్యమంత్రి జగన్ ను ఉద్దేశించి ప్రశ్నించారు. నిరసన తెలియజేయడమనేది తమ హక్కని, చేతకానితనంతోనే తమను అరెస్ట్ చేయిస్తున్నారంటూ తెలుగు రైతు నేతలు మండిపడ్డారు. రైతుల సమస్యలు పరిష్కారమయ్యేవరకు ఉద్యమిస్తూనే ఉంటామన్నారు.