జగన్ తలపెట్టిన ఆ కార్యక్రమం రెండ్రోజుల్లో రెండోసారి వాయిదా..ఎందుకిలా?

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించ తలపెట్టిన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఎంపీల వర్క్‌షాప్ మళ్లీ వాయిదా పడింది. ఇలా వాయిదా పడటం ఇది రెండోసారి. నిజానికి సోమవారమే ఈ వర్క్‌షాప్‌ను షెడ్యూల్ అయింది. ఈ మేరకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీకు సమాచారం వెళ్లింది. అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనడానికి అమరావతికి వచ్చినందువల్ల వారందరూ అందుబాటులోనే ఉన్నారు. షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన ఈ భేటీ వాయిదా పడింది.

ఇవ్వాళ ఈ వర్క్‌షాప్‌ను నిర్వహించాలని వైఎస్ జగన్ నిర్ణయించారు. చివరి క్షణంలో ఇది కూడా వాయిదా పడింది. ఇవ్వాళ కూడా ఈ సమావేశం ఏర్పాటుకాలేదు. అసెంబ్లీ సమావేశాల్లో కొన్ని కీలక అంశాలు చర్చకు రానున్నందున ఇవ్వాళ్టి భేటీని కూడా వాయిదా వేసినట్లు చెబుతున్నారు. అసెంబ్లీ సమావేశాల చివరి రోజున దీన్ని నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావనకు వచ్చిన అంశాలు, బిల్లుల గురించి చర్చించడానికి వీలుగా చివరి రోజు ఈ వర్క్‌షాప్ నిర్వహిస్తారని సమాచారం.

వచ్చే సార్వత్రిక ఎన్నికలు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్ఠాత్మకంగా మారిన నేపథ్యంలో- వైఎస్ జగన్ రాజకీయంగా కీలక అడుగులు వేస్తోన్నారు. అభ్యర్ధుల ఎంపికలో ఆచితూచి నిర్ణయాలను తీసుకుంటోన్నారు. 175 నియోజకవర్గాల్లో గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నందున అభ్యర్థుల ఎంపిక కోసం ఆయన ఇప్పటి నుంచే కసరత్తు చేస్తోన్నారు. ఇందులో భాగమే ఈ వర్క్‌షాప్‌. ఇదివరకు దీన్ని ఏర్పాటు చేశారు. మలి విడత సోమవారం జరగాల్సి ఉన్నప్పటికీ.. వాయిదా పడింది.

ఎమ్మెల్యేల పనితీరును బేరీజు వేయడానికి ఈ వర్క్‌షాప్ ఉపయోగపడుతోందని వైఎస్ఆర్సీపీ వర్గాలు చెబుతున్నాయి. నియోజకవర్గాల ఇన్‌ఛార్జీలు, కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షుల మధ్య సమన్వయం వంటి అంశాలను వైఎస్ జగన్ నేరుగా పర్యవేక్షించగలుగుతున్నారని వివరిస్తోన్నాయి. క్షేత్రస్థాయిలో రాజకీయ ప్రత్యర్థుల బలబలాలపై ఓ అవగాహన రావడానికీ ఇది ఉపయోగపడుతోందని, వాటినికి ధీటుగా ఎదుర్కొనడానికి అనుసరించాల్సి వ్యూహాలను రూపొందించుకోవడానికి వీలు కలుగుతోందని పేర్కొంటోన్నాయి.