గ్రేట‌ర్ హైద‌రాబాద్ పాలక మండలి స‌మావేశం ర‌సాభాస‌

గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ పాల‌క‌మండ‌లి స‌మావేశం ర‌సాభాస‌గా మారింది. తెలంగాణ రాష్ట్ర స‌మితి కార్పొరేట‌ర్ల‌కు, భార‌తీయ జ‌న‌తాపార్టీ కార్పొరేట‌ర్ల మ‌ధ్య వాదోప‌వాదాలు జ‌రిగాయి. మేయ‌ర్ గ‌ద్వాల విజ‌య‌ల‌క్ష్మి అధ్య‌క్ష‌త వ‌హించారు. స‌మావేశం ప్రారంభ‌మైన వెంట‌నే తెలంగాణ సాయుధ పోరాట యోధుల‌కు నివాళుల‌ర్పించారు.

ఇందులో బీజేపీ కార్పొరేట‌ర్లు నినాదాలు చేశారు. స‌మైక్య‌తా దినోత్స‌వం కాద‌ని, విమోచ‌న దినోత్స‌వ‌మంటూ వారుఅభ్యంత‌రం తెలిపారు.ఎస్‌ఎన్‌డీపీ కింద నగరంలో చేపట్టిన పనులపై సమావేశంలో రగడ మొదలైంది. పనులు నత్తనడకన సాగుతున్నాయని.. బకాయిలు వెంటనే విడుదల చేయాలంటూ కార్పొరేటర్లు డిమాండ్‌ చేశారు.

హైదరాబాద్‌లో వర్షం వస్తే ప్రజలకు నరకమేనని.. మీరేం అభివృద్ధి చేశారో వర్షం వస్తే తెలుస్తోందంటూ కాంగ్రెస్‌కు చెందిన ఉప్పల్‌ కార్పొరేటర్‌ రజిత ఎద్దేవా చేశారు. బంజారా, కొమురంభీమ్‌ భవనాల నిర్మాణంపై టీఆర్తెఎస్ కార్పొరేటర్‌ మన్నె కవితా రెడ్డి ముఖ్య‌మంత్రికి కృతజ్ఞతలు తెలియ‌జేశారు. బీజేపీకి చెందిన కార్పొరేట‌ర్లు టీఆర్ఎస్ లో చేరి అంశంపై కొంచెం సేపు గొడ‌వ జ‌రిగింది.

ఈ సంద‌ర్భంగా బీజేపీ కార్పొరేట‌ర్లు మేయ‌ర్ పోడియాన్నిచుట్టుముట్టారు. టీఆర్ఎస్ సిద్ధాంతాలు న‌చ్చే వారంతా త‌మ పార్టీలో చేరార‌ని బోరబండ కార్పొరేట‌ర్ బాబా ఫ‌సియుద్ధీన్ అన్నారు. దీనిపై బీజేపీ కార్పొరేట‌ర్లు అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. ర‌గ‌డ జ‌రుగుతున్న స‌మ‌యంలోనే మేయ‌ర్ స‌భ‌ను వాయిదా వేశారు.