క్వీన్ ఎలిజబెత్ 2 శకానికి తెర పడింది

బ్రిటన్‌ను సోమవారం రెండు నిమిషాల పాటు నిశ్శబ్దం ఆవరించింది. డ్రమ్స్ మోతలు, ట్రంపెట్ల శబ్దాలు ఆగిపోయాయి. ఈ నిశ్శబ్ద వాతావరణంలో మహారాణి క్వీన్ ఎలిజబెత్ 2 అంతిమ యాత్ర కొనసాగింది.

వెస్ట్‌మినిస్టర్ అబేలో రాణి అంత్యక్రియలకు సంబంధించిన కార్యక్రమం ముగింపు సమయంలో ఈ రెండు నిమిషాలు అందరూ మౌనం పాటించారు.

దీంతో ఒక ఘన చరిత్రకు తెరపడినట్లు అయింది.

ఏడు దశాబ్దాల రాణి పాలన ముగిసింది. దిగ్భ్రాంతికరమైన గత 10 రోజుల్లో రాణి గురించి చాలా మాట్లాడుకున్నాం.

ఈరోజుతో ఆ మాటలన్నింటికీ తెర పడనుంది.

ఆమె పాలన తొలినాళ్లలో… ‘ఒక సరికొత్త ఎలిజబెతన్ శక ప్రారంభం’ అని కొంతమంది వ్యాఖ్యానించారు.

రెండో ప్రపంచ యుద్ధ త్యాగాలు, యుద్ధం కారణంగా ఏళ్లపాటు ఏర్పడిన మాంద్యం అనుభవించిన ప్రజలకు.. ఆ తర్వాత చిన్న వయస్సులోనే ఎలిజబెత్ రాణి అవ్వడం, టెక్నాలజీలో ఆశ్చర్యపోయే మార్పులు రావడం, కొత్త పాలన.. ఇదంతా వారికి చాలా కొత్తగా అనిపించింది. దీంతో నవశకం ఆరంభమైనట్లుగా భావించారు.

అయితే, ఇలాంటి మాటలను ఆమె కొట్టిపారేశారు. ఆ కానీ అది ఒక కొత్త శకం, ‘ది ఎలిజబెతన్ ఎరా’.

దశాబ్దాలుగా ప్రపంచంలో ఎన్నో మార్పులు రాగా, బ్రిటన్ రాణిగా ఆమె స్థిరంగా ఉన్నారు. అనేక సామాజిక మార్పులకు సాక్షిగా నిలిచారు.

స్టాంపులపై ఆమె ముఖచిత్రం, క్రిస్మస్ వేడుకల్లో ఆమె గొంతు, రిమంబ్రన్స్ సండే వేడుకల్లో ఆమె కాస్త తలదించుకొని నిలబడే తీరు ఇవన్నీ ఇన్నేళ్లుగా స్థిరంగానే ఉన్నాయి.

కానీ, ఈరోజు నుంచి ఈ జ్ఞాపకాలకు తెర పడనుంది.

అంతేకాకుండా, దశాబ్దాల కాలంగా ప్రిన్స్ ఆఫ్ వేల్స్‌గా ఉన్న ప్రిన్స్ చార్లెస్ కూడా ఇకనుంచి కొత్తగా కనిపించనున్నారు.

రాచనివాళులు ముగిసిన తర్వాత చక్రవర్తిగా తన పాత్రను ఆస్వాదించడం ఇప్పుడు కింగ్ చార్లెస్ 3 ముందున్న సవాలు.

ప్రజల మనసులతో కలిసి ప్రయాణించడం కూడా రాణి నిర్వర్తించే విధుల్లో ఒక భాగమని ఆయన తల్లి ఎలిజబెత్ 2 అర్థం చేసుకున్నారు. ప్రజల కష్టనష్టాల్లో అండగా ఉండటం, వారికి సంతోషాన్ని కలిగించడం, ఆందోళనల నుంచి వారి ఆలోచనలను మళ్లించడం ఇలాంటివన్నీ రాజ విధులుగానే ఆమె భావించారు.

ప్రిన్స్‌గా చార్లెస్ కూడా ఇలాంటి మంచి పనులు చేశారు. చాలామంది జీవితాలను మెరుగ్గా మార్చారు. ఇందులో అసలు సందేహమే లేదు. కానీ, ఈ ఇమేజ్‌తో పాటు ఆయనపై ఫిర్యాదుకు ఆస్కారముండే చాలా విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి.

ఇప్పుడు ఈ పరిస్థితి కూడా మారాలి. కొత్త చక్రవర్తి పాలనలో తమ జీవితాలు మరింత ఉన్నతంగా మారాలని బ్రిటన్ ప్రజలు ఆశిస్తున్నారు.

వెస్ట్‌మినిస్టర్ అంతటా, యునైటెడ్ కింగ్‌డమ్ వ్యాప్తంగా నిశ్శబ్ధం అలుముకున్న సమయంలో అందరికీ బాగా సుపరిచితురాలైన ఎలిజబెత్ తెరమరుగయ్యారు. క్వీన్ ఎలిజబెత్ 2 గురించి అందరికీ, అంతా తెలుసు అనుకుంటారు. కానీ, నిజానికి ఆమెను లిలిబెట్‌గా ఎవరూ చూడలేదు. తన తాతయ్య, ఎలిజబెత్‌ను లిలిబెట్ అని పిలిచేవారు.

‘ది అన్‌సీన్ క్వీన్’ పేరుతో బీబీసీ చిత్రీకరించిన అందమైన డాక్యుమెంటరీలో క్వీన్‌ను చిన్నతనంలో లిలిబెట్‌గా చూడొచ్చు. ఆ ఫుటేజీలో లిలిబెట్ దూకుతూ, డ్యాన్స్ చేస్తూ, చిలిపిపనులు చేస్తూ, నవ్వుతూ కనిపిస్తారు. నవ్వుతున్నప్పుడు ఆమె కళ్లలో మెరుపు కనిపిస్తుంది. తండ్రి కోసం, సుదీర్ఘ కాలం తన వెన్నంటే ఉన్న భర్త కోసం ఆమె కళ్లు మెరుస్తుంటాయి.

నవ్వుతూ, తుళ్లుతూ, డ్యాన్స్ చేసే ఆ చిలిపి లిలిబెట్… క్వీన్‌గా బాధ్యతలు స్వీకరించాక దశాబ్దాలుగా కనిపించకుండా పోయారు.

అయితే, క్వీన్ అయ్యాక కూడా లిలిబెట్ ఎప్పుడూ ఆమెలో అలాగే ఉందని ఒక డాక్యుమెంటరీ ద్వారా ప్రజలకు తెలిసిపోయింది.

క్వీన్, ఆ డాక్యుమెంటరీని పరిచయం చేశారు.

క్వీన్ ఎలిజబెత్ తన జీవితపు చివరి నెలల్లో ఈ డాక్యుమెంటరీలో నటించారు. అప్పుడు ఆమె కళ్లలో కనిపించిన మెరుపుతో ప్రజలకు మరోసారి ఆమెలో లిలిబెట్ కనిపించారు.

ఆ డాక్యుమెంటరీలో పాడింగ్టన్ బేర్‌తో టీ తాగుతున్నట్లుగా రాణి నటించారు. పాడింగ్టన్ బేర్ అనేది నిజమైన జంతువు కాదు. అది పాడింగ్టన్ సినిమాలోని ఒక పాత్ర.

అనుకోకుండా టేబుల్ మీద ఉన్న ఫుడ్‌ను పాడింగ్టన్ బేర్ తొక్కేస్తుంది. ‘అత్యవసరమైనప్పుడు కావాల్సొస్తుందని ఒకటి దాస్తాను’ అంటూ తన తల మీద ఉన్న టోపీ తీసి అందులోని శాండ్‌విచ్‌ను రాణికి ఆఫర్ చేస్తుంది పాడింగ్టన్ బేర్.

అప్పుడు రాణి, ‘నేను కూడా అంతే’ అంటూ తన హ్యాండ్ బ్యాగ్‌లోని శాండ్‌విచ్‌ను బయటకు తీస్తారు.

ఇప్పుడు ఆ హ్యాండ్‌బ్యాగ్ మూసి ఉంది. ఆమె కళ్లలో ఆ మెరుపు ఒక జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఈరోజు ఈ జ్ఞాపకాలకు కూడా తెరపడింది.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)