కొడాలి నాని ఎంత అమాయకుడు కాకపోతే..: గుడివాడ గడ్డపై తేల్చుకుందాం: రేణుక చౌదరి

అమరావతి: తెలంగాణ కాంగ్రెస్ నాయకురాలు, కేంద్ర మాజీమంత్రి రేణుకా చౌదరి.. ఇక ఏపీ రాజకీయాల్లోకి ప్రవేశించడానికి రంగం సిద్ధం చేసుకుంటోన్నట్టే. ఇప్పటికే ఆమె అమరావతి ప్రాంత రైతుల ఆందోళనలకు మద్దతు పలికారు. అమరావతి నుంచి అరసవల్లి వరకు సాగుతున్న రైతుల పాదయాత్రలో పాల్గొన్నారు కూడా. ఇప్పుడిక పూర్తిస్థాయిగా ఏపీ రాజకీయాల్లోనూ అడుగు పెట్టే ప్రయత్నాల్లో ఉన్నారు. 2024 నాటి ఎన్నికల్లో కృష్ణా జిల్లా గుడివాడ నుంచి పోటీ చేస్తాననీ చెప్పారు.

రేణుక చౌదరి అమరావతి పాదయాత్రలో పాల్గొనడాన్ని గుడివాడ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని తప్పుపట్టిన విషయం తెలిసిందే. అసెంబ్లీలో ఆమెపై విమర్శలు చేశారు. ఖమ్మంలో ఇకపై కార్పొరేటర్‌గా కూడా గెలవలేని రేణుక చౌదరికి ఏపీ రాజకీయాలతో ఏం సంబంధం అంటూ ప్రశ్నించారు. అమ‌రావ‌తిలో రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోన్న వాళ్లే పాదయాత్ర పేరుతో రోడ్డెక్కారని విమర్శించారు. అమరావతిని చంద్రబాబు రియల్‌ ఎస్టేట్‌ కంపెనీగా మార్చారంటూ ఆరోపించారు.

ఈ విమర్శలపై తాజాగా రేణుక చౌదరి స్పందించారు. ఈ విమర్శలను ఆమె తిప్పికొట్టారు. ఓ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. కొడాలి నానిని బుజ్జీ అని సంబోధించారు. కొడాలి నాని లారీలు కడుక్కునే సమయంలోనే తాను కార్పొరేటర్‌గా ఎన్నికయ్యానని ఎదురుదాడికి దిగారు. కొడాలికి తన చరిత్ర తెలియదని ఎద్దేవా చేశారు. గూగుల్‌లో సెర్చ్ చేస్తే- తానేమిటో తెలుస్తుందని అన్నారు. ఏపీ అసెంబ్లీలో తన పేరును ప్రస్తావించినందుకు రేణుకా చౌదరి థ్యాంక్స్ చెప్పారు. కొడాలి నాని ఎంత అమాయకుడు కాకపోతే..అంటూ చురకలు అంటించారు.

ఏపీ అసెంబ్లీలో తన పేరును తీసుకుని రావడం ద్వారా మంచి పబ్లిసిటీ ఇచ్చాడని రేణుకా చౌదరి చెప్పారు. పబ్లిసిటీ రావాలంటే ఎంతో ఖర్చు పెట్టాల్సి ఉంటుందని, అలాంటిది.. కొడాలి నాని వల్ల తనకు ఫ్రీ పబ్లిసిటీ వచ్చిందని పేర్కొన్నారు. తాను తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వట్లేదని, అమరావతి రైతుల పాదయాత్రలో పాల్గొంటే టీడీపీకి సపోర్ట్ చేసినట్టేనా అని ప్రశ్నించారామె. ఖమ్మంలోనే గెలవలేనంటూ కొడాలి నాని సవాల్ చేశారని, అందుకే తాను ఆయన నియోజకవర్గం గుడివాడ నుంచే పోటీ చేస్తానని తేల్చేశారు.

కాంగ్రెస్ అభ్యర్థిగానే గుడివాడ నుంచి ఏపీ అసెంబ్లీకి పోటీ చేస్తానని, తెలుగుదేశం పార్టీ మద్దతు తనకు అవసరం లేదని స్పష్టం చేశారు. తన కేరీర్‌లో ఇప్పటివరకు ఎమ్మెల్యేగా పోటీ చేయలేదని, ఇప్పుడా కొరతను గుడివాడతో తీర్చుకుంటాననీ చెప్పారు. కార్పొరేటర్, ఎంపీ, కేంద్ర మంత్రిగా పని చేశానే తప్ప ఎమ్మెల్యేగా లేనని అన్నారు. గుడివాడలో తాను గెలిచి చూపిస్తానని, ఆ తరువాత కొడాలి నానిని మళ్లీ ఓటర్లు ఎన్నుకోరని చెప్పారు.

రాజకీయాల్లో తనకు ఓటమి లేని రోజులే ఎక్కువగా ఉన్నాయని, తన గత చరిత్రే గెలిపిస్తుందనే ధీమాను రేణుకా చౌదరి వ్యక్తం చేశారు. ఖమ్మం ఎంపీగా తాను అత్యధిక సార్లు గెలిచానని గుర్తు చేశారు. జిల్లా అభివృద్ధి కోసం తాను చేసినంత కృషి మరెవరూ చేయలేదని చెప్పారు. కొడాలి నాని వచ్చి ఖమ్మం జిల్లా గల్లీల్లో తిరిగి చూస్తే తానేంటో, తన శక్తి సామర్థ్యాలేమిటో ఆయనకు బోధపడుతుందని రేణుకా చౌదరి అన్నారు.