కేసీఆర్ అభినవ అంబేద్కర్ అయ్యింది ఇందుకేనా? సంగారెడ్డి కలెక్టర్ కు కాంగ్రెస్ సూటిప్రశ్నలు!!

సంగారెడ్డి కలెక్టర్ శరత్ వ్యవహారం తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. సీఎం కేసీఆర్ ను అభినవ అంబేద్కర్ అంటూ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్ చేసిన వ్యాఖ్యల దుమారం తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుంది. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ చేసిన తాజా వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. రాజ్యాంగాన్ని మార్చాలన్న సీఎం కేసీఆర్ అభినవ అంబేద్కర్ ఎలా అవుతారంటూ టిపిసిసి ఉపాధ్యక్షులు మల్లురవి టార్గెట్ చేశారు. ఒక ఉన్నతాధికారిగా ఉండి ఈ తరహా వ్యాఖ్యలు చేయడం అంబేద్కర్ ను అవమానించడమే అని మల్లు రవి వ్యాఖ్యలు చేశారు.

సంగారెడ్డి కలెక్టర్Collector_SRD శరత్ కేసీఆర్ను అభినవ అంబేద్కర్ అనడం,బాబా సాహెబ్ను సీఎంలో చూస్తున్న అనడం తీవ్ర అభ్యంతరకరం DrMalluRavi1

ఒక IasTelangana అధికారి అయ్యుండి ఈ రకంగా మాట్లాడడం అంబేద్కర్ను అవమానించడమే.స్వయంగా పత్రిక సమావేశాలలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చాలని pic.twitter.com/Ymtl7VlLPL

సంగారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్ పై కాంగ్రెస్ పార్టీ నాయకుడు మల్లు రవి పలు ప్రశ్నలు సంధించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పినందుకే ఇలా పొగిడారా అంటూ ప్రశ్నించారు. అంతేకాదు రాజ్యాంగం ప్రకారం జనాభా ప్రాతిపదికన ఇవ్వాల్సిన గిరిజన రిజర్వేషన్లను ఎనిమిది సంవత్సరాలుగా ఇవ్వకుండా ఆపి గిరిజనులకు తీవ్ర నష్టం చేసిన కెసిఆర్ ఏ విధంగా అభినవ అంబేద్కర్ అవుతారో చెప్పాలని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎన్నికల ముందు దళితులకు, గిరిజనులకు కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పిన కేసీఆర్, ఇప్పటివరకు ఇవ్వని కారణంగా అభినవ అంబేద్కర్ అయ్యారా అంటూ కలెక్టర్ ను కాంగ్రెస్ నాయకుడు మల్లు రవి నిలదీశారు.

ఎందుకు కేసీఆర్ అభినవ అంబేత్కర్ అయ్యాడో ఐఏఎస్ చదువుకున్న శరత్ Collector_SRD చెప్పాలి?

రాజకీయ నాయకుల్లాగా ఉన్నత పదవులలో ఉండే వారు కూడా ఇలా మాట్లాడితే ఇక ప్రజలకు ఏమి సేవలు చేస్తారు?

కలెక్టర్ వెంటనే తన మాటలను ఉపసంవరించుకోవాలి, బహిరంగ క్షమాపణ చెప్పాలి. DrMalluRavi1

దళితున్ని సిఎం చేస్తానని, చేయకపోతే తల నరుక్కుంటా అని హామీ ఇచ్చి మోసం చేసినందుకు కేసీఆర్ అభినవ అంబేద్కర్ అయ్యారా అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పేరును మార్చి ఆ మహానుభావుని అవమానించినందుకు అభినవ అంబేద్కర్ అయ్యారా అంటూ మల్లు రవి ప్రశ్నాస్త్రాలు సంధించారు. సీఎం కేసీఆర్ ఏ విధంగా అభినవ అంబేద్కర్ అయ్యారో చెప్పాలని కలెక్టర్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు మల్లురవి.

ఉన్నత పదవుల్లో ఉన్నటువంటి అధికారులు రాజకీయ నాయకులలాగా నోటికొచ్చినట్టు మాట్లాడితే ప్రజలకు సేవ ఏమి చేస్తారని ప్రశ్నించారు. కలెక్టర్ వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని మల్లు రవి డిమాండ్ చేశారు. తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు ముగింపు కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పై సంగారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్ అభినవ అంబేద్కర్ అంటూ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్రంలో దుమారం రేపాయి.

రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ని తాము చూడలేదని, సీఎం కెసిఆర్ లో ఇప్పుడు చూస్తున్నాము అంటూ పేర్కొన్న సంగారెడ్డి జిల్లా కలెక్టర్ తనదైన శైలిలో సీఎం కేసీఆర్ కు కితాబిచ్చారు. కెసిఆర్ ను ఓ రేంజ్ లో పొగడ్తలతో ముంచెత్తారు. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ కల్పించడంపై సంతోషంగా ఉందని, కెసిఆర్ తీసుకున్న నిర్ణయానికి ధన్యవాదాలు తెలిపిన ఆయన కేసీఆర్ పై ప్రశంసల జల్లు కురిపించారు. దీంతో కలెక్టర్ తీరుపై తెలంగాణ రాష్ట్రంలో చర్చ జరుగుతుంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ నాయకులు కలెక్టర్ వ్యాఖ్యలపై నిప్పులు చెరుగుతున్నారు.