ఎమ్మెల్యే అనుచరుడు మహిళ గొంతుకోసిన కేసులో మహిళే మహానటి.. అసలు ఏం జరిగిందంటే!!

విజయ సింహ అనే ఒక ఎమ్మెల్యే అనుచరుడు తనపై కత్తితో దాడి చేశాడని, తనను లైంగికంగా వేధిస్తున్నాడని నిషా అనే మహిళ పెట్టిన కేసులో ఊహించని ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఈ వ్యవహారంలో నిషానే నిందితురాలిగా గుర్తించడం అందర్నీ ఒక్క సారిగా షాక్ కు గురిచేసింది.

మహిళ చెప్పిన కథనం ప్రకారం జూబ్లీహిల్స్ కు చెందిన ఒక ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకుడు విజయ్ సింహా ఆదివారం అర్ధరాత్రి బేగంపేటలోని బీఎస్‌మక్తా వద్ద ఉన్న ఆమె ఇంట్లో ఓ మహిళను లైంగికంగా వేధించి, ఆమె ఇంట్లోకి చొరబడి, బెదిరించి, చివరకు బాధితురాలిపై దాడి చేశాడని చెప్పింది. ఈవెంట్స్ చేసుకుంటూ జీవనం సాగించే సదరు మహిళ ఫేస్‌బుక్ స్నేహితుడైన నిందితుడు విజయ్ సింహా, వాట్సాప్ వీడియో కాల్‌లో ఆమెకు కాల్ చేసి నగ్నంగా కనిపించి, నగ్నంగా ఉండమని అడిగాడని, అయితే ఆమె అతని అభ్యర్థనను తిరస్కరించానని, కాల్ కట్ చేసి అతని ఫోన్ నంబర్‌ను బ్లాక్ చేశానని పేర్కొంది. కొంతసేపటికి నేరుగా ఆమె ఇంటికి వెళ్లి లైంగిక దాడి చేసి, తన గొంతు కోశాడని మహిళ ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు.

విజయ్ సింహా తనకు రాజకీయ నేపథ్యం ఉందని, అతను ఏదైనా చేయగలడని పేర్కొన్నాడని తెలిపింది. ఆపై మెడపై, ఎడమ చేతి మణికట్టు మీద కోశాడని పేర్కొంది. అతను అక్కడ నుండి పారిపోయిన తర్వాత మహిళ తన కుటుంబ సభ్యులకు, పోలీసులకు జరిగిన దాడి గురించి ఫిర్యాదు చేశానని చెప్పింది. మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు ఐపీసీ 448,354ఏ, 324, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసులకు ఊహించని ట్విస్ట్ ఎదురైంది. ఇదంతా మహిళ అయిన డ్రామాగా పోలీసులు నిగ్గు తేల్చారు. విజయ సింహా పై కోపంతో ఉన్న మహిళ అతన్ని ఏదోవిధంగా కేసులో ఇరికించాలన్న ఉద్దేశంతో ఈ డ్రామా ఆడినట్టుగా తెలుస్తుంది.

ఇక అసలు ఏం జరిగిందంటే విజయ్ సింహాకు నిషా తో ఫేస్బుక్లో పరిచయం ఏర్పడింది. అది కాస్త వారిద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇక విజయసింహ అప్పుడప్పుడు ఆమె ఇంటికి వెళ్లి రావడం ఇద్దరు కలిసి చెట్టాపట్టాలేసుకొని తిరగడం జరిగింది. అయితే ఈమధ్య విజయసింహ నిషా ను దూరం పెట్టాడు. ఎన్నిసార్లు పిలిచినా ఆమె వద్దకు వెళ్లడం లేదు. దీంతో అతనిపై కోపం పెంచుకుని ప్రతీకారం తీర్చుకోవాలని భావించిన మహిళ ఈ దాడి నాటకానికి తెరతీసింది.

తనను లైంగికంగా వేధించాడని, తన గొంతు కోశాడు అని అబద్ధం చెప్పి కేసు పెట్టిన నిషా మెడపై ఎటువంటి గాయం లేదని వైద్యులు తేల్చారు. అంతేకాదు నిషా చెబుతున్న మాటల్లో వాస్తవం లేదని ఆయన తన ఇంట్లోనే ఉన్నారని విజయసింహ ఆధారాలతో సహా మీడియా ముందుకు వచ్చాడు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు నిషా ని విచారించగా తనను దూరం పెడుతున్నాడు అన్న కోపంతోనే, ఈ పని చేసినట్లు గా పేర్కొంది. విజయ్ సింహ ను ఇరికించాలన్న ఉద్దేశంతోనే డ్రామా ఆడినట్టుగా ఒప్పుకుంది. దీంతో పోలీసులు ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు. ఈ వ్యవహారంపై విజయసింహ ఇంతవరకు ఫిర్యాదు చేయకపోవడంతో పోలీసులు మహిళపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది. అయితే కేసును, పోలీసులను తప్పుదారి పట్టించినందుకు పోలీసులు నిషాపై కేసు నమోదు చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది.