Varun Tej బాలీవుడ్ ఎంట్రీ.. ఎయిర్‌ ఫోర్స్ అధికారిగా.. సోనితో కలిసి పాన్ ఇండియా మూవీ!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ బాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్దమైంది. తెలుగు, హిందీలో భారీ ప్రాజెక్ట్‌ కోసం ప్రఖ్యాత సినీ నిర్మాణ సంస్థ సోని పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినాయిసేన్స్ పిక్చర్స్‌తో వరుణ్ తేజ్ చేతులు కలిపాడు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ బ్యాక్ డ్రాప్‌తో రూపొందే ఈ సినిమాను భారీ వ్యయంతో రూపొందించేందుకు సోని ప్లాన్ చేసింది. విభిన్నమైన పాత్రలతో ఆకట్టుకొంటున్న వరుణ్ తేజ్‌తో సోని సంస్థ భాగస్వామ్యం కావడం ఆసక్తికరంగా మారింది. ఈ ప్రాజెక్టు వివరాల్లోకి వెళితే..

దేశంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా, దేశభక్తి ప్రధానంగా సాగే చిత్రంగా రూపొందబోతున్నది. సీట్లకు హత్తుకుపోయే యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అధికారిగా నటిస్తున్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అందిస్తున్న సేవలకు గుర్తుగా ఈ సినిమాను అంకితం ఇచ్చే విధంగా రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

సోని పిక్చర్స్ ప్రొడక్షన్స్, రినాయిసెన్స్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు యాడ్ ఫిల్మ్ మేకర్, సినిమాటోగ్రాఫర్, వీఎఫ్ఎక్స్ నిపుణుడు శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఈ సినిమాను తెలుగు, హిందీలో ఏకకాలంలో షూట్ చేసి.. 2023లో రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. వరుణ్ తేజ్ కెరీర్‌లో ఇది 13వ సినిమా కావడం గమనార్హం.

వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్‌గా నటించే అవకాశం రావడం గౌరవంగా భావిస్తున్నాను. సోని పిక్చర్స్, సందీప్ ముడ్డా, దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్‌తో కలిసి పనిచేయడం గర్వంగా ఉంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు ట్రిబ్యూట్‌గా ఉంటుంది. ఇప్పటి వరకు నేను నటించిన పాత్రల కంటే భిన్నంగా ఈ సినిమా ఉంటుంది. ఎయిర్ ఫోర్స్ అధికారిగా నా రోల్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఈ సినిమా కోసం కఠినమైన శిక్షణ తీసుకొంటున్నాను అని వరుణ్ తేజ్ తెలిపారు.

వరుణ్ తేజ్‌తో రూపొందిస్తున్న సినిమా గురించి నిర్మాతలు సందీప్ ముడ్డా మాట్లాడుతూ.. ఈ సినిమాతో భాగస్వామ్యం కావడం చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమాను గొప్పగా ప్రజెంట్ చేయడానికి శ్రమిస్తున్న ప్రతీ ఒక్కరిని చూసి గర్వపడుతున్నాను. ఈ సినిమా కేవలం యాక్షన్ థ్రిల్లరే కాకుండా హృదయాన్ని తట్టి లేపే చిత్రంగా ఉంటుంది. ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ మీద ఎవరూ ప్రజెంట్ చేయని విధంగా సినిమా ఉంటుంది. సోని సంస్థతో భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉంది అని అన్నారు.

సోని పిక్చర్స్ మేనేజర్ లాడా గుర్దీన్ సింగ్ మాట్లాడుతూ.. మేజర్ లాంటి సినిమా తర్వాత మేము ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం ఇది. ఇండియా సాధించిన విజయాలు, రియల్ హీరోల కథలపై దృష్టిపెట్టాం. శక్తి ప్రతాప్ సింగ్, వరుణ్తేజ్, సందీప్ ముడ్డాతో కలిసి అద్భుతమైన సినిమాను రూపొందిస్తున్నాం. ప్రేక్షకులకు ఇంతకు ముందు లేని విధంగా కొత్త అనుభూతిని కలిగించబోతున్నాం అని అన్నారు.