హీరోగా VV వినాయక్ మరో సినిమా.. ఆ సీనియర్ రైటర్ తో బిగ్ ప్లాన్!

ఆది సినిమాతో దర్శకుడిగా తెలుగు చిత్రపరిశ్రమ లోకి అడుగుపెట్టిన వివి వినాయక్ ఆ తర్వాత దిల్, లక్ష్మి, ఠాగూర్, కృష్ణ, బన్నీ, అదుర్స్.. ఇలా ఎన్నో విభిన్నమైన సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవితో తీసిన ఠాగూర్ సినిమా అయితే అప్పట్లో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఇక ఆ తర్వాత మెగాస్టార్ మూవీ ఖైదీ నెంబర్ 150 కూడా ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక అలాంటి టాలెంటెడ్ దర్శకుడు ప్రస్తుతం ఒకవైపు డైరెక్షన్ చేస్తూనే మరొకవైపు నటుడిగా కూడా కొనసాగేందుకు సరికొత్తగా అడుగులు వేస్తున్నాడు.

గతంలోనే వినాయక్ కొన్ని సినిమాల్లో చిన్న పాత్రల్లో కనిపించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మాత్రం పూర్తిస్థాయిలో కథానాయకుడుగా కనిపించడానికి రెడీ అవుతున్నాడు. అసలైతే దిల్ రాజు ప్రొడక్షన్ లోనే గతంలో ఒక కొత్త సినిమాను కూడా మొదలుపెట్టారు. దానికి శీనయ్య అనే టైటిల్ కూడా ఫిక్స్ అయింది. కానీ సినిమా షూటింగ్ సగం పూర్తయిన తర్వాత ఎందుకో సరిగ్గా రావడం లేదు అని మళ్ళీ ఆ ప్రాజెక్ట్ మధ్యలోనే క్యాన్సిల్ చేసేసారు.

ఇక ఇప్పుడు దర్శకుడు వినాయక్ తన సొంతంగా సొంత డైరెక్షన్ లోనే ఒక సినిమాను తెరపైకి తీసుకురాబోతున్నాడు. ఇక ఆ సినిమాకు కథ మాటలు ఆకుల శివ అందించబోతూ ఉండడం విశేషం. ఇంతకుముందు వీరి కలయికలు వచ్చిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. లక్ష్మీ కృష్ణ నాయక్ సినిమాలకు శివ కథలు అందించగా వివి వినాయక ఆ సినిమాలను డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే. వీరిద్దరికీ మంచి అనుబంధం ఉంది అందుకే వినాయక్ మళ్లీ చాలా కాలం తర్వాత ఆ రచయితతో కలిసి స్వీయ దర్శకత్వంలో ఒక డిఫరెంట్ ప్రాజెక్టును తెరపైకి తీసుకురావాలని ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక వచ్చే నెల రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలు పెట్టబోతున్నట్లు సమాచారం. ఇక సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు కూడా త్వరలోనే ప్రకటించనున్నారు.