వైసీపీకి 67 సీట్లు – పవన్ లెక్కల వెనుక : సంకేతాలు క్లియర్..!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల్లో వైసీపీ సాధించే సీట్లపైన కొత్త లెక్కలు చెప్పారు. సర్వేలు..క్షేత్ర స్థాయి నివేదికల ప్రకారం వైసీపీ 45 నుంచి 67 సీట్లు మాత్రమే గెలుచుకుంటుందని చెప్పుకొచ్చారు. దీనికి వైసీపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. పవన్ ది చిలక జోస్యమంటూ ఎద్దేవా చేస్తున్నారు. పవన్ చెబుతున్న లెక్కల్లో కేవలం వైసీపీకి సంబంధించిన సీట్ల లెక్కలే ఉంటాయా అని ప్రశ్నిస్తున్నారు. జనసేన పోటీ చేసేవి.. గెలిచేవి..టీడీపీ సీట్ల గురించి ఆ చిలక జోస్యంలో చెప్పరా అంటూ నిలదీస్తున్నారు.

పవన్ కేవలం వైసీపీ గెలిచే సీట్ల అంచనా మాత్రమే వెల్లడించారు. అదే సమయంలో జనసేనకు ఆదరణ పెరగిందని వివరించారు. టీడీపీ ప్రస్తావన మాత్రం తీసుకురాలేదు. ఇప్పుడు ఈ లెక్కల వెనుక వాస్తవాలు ఏంటనే అంశం పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ చెబుతున్న లెక్కల్లో వైసీపీ నేతలు కొత్త కోణంలో విశ్లేషణలు మొదలు పెట్టారు. 2014 ఎన్నికల్లో వైసీపీ గెలిచిన సీట్లు 67. అప్పుడు పవన్ కళ్యాణ్ టీడీపీకి మద్దతుగా నిలిచారు. కానీ, ఎన్నికల్లో పోటీ చేయలేదు. టీడీపీ 102 స్థానాలు గెలవగా..మిత్రపక్షం గా పోటీ చేసిన బీజేపీ 4 స్థానాల్లో గెలిచింది. రెండు స్థానాల్లో స్వతంత్రులుగా పోటీ చేసిన అభ్యర్ధులు గెలిచి..ఆ తరువాత టీడీపీకి మద్దతుగా నిలిచారు. ఇప్పుడు పదేళ్ల తరువాత..అందునా ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ తిరిగి 67 సీట్లు గెలుస్తుందని పవన్ చెప్పుకొచ్చారు. దీని ద్వారా పరోక్షంగా 2014 పొత్తులు రిపీట్ కాబోతున్నాయనే సంకేతాలు క్లియర్ గా ఇచ్చారనే విశ్లేషణలు మొదలయ్యాయి.

తాజాగా జాతీయ మీడియా సంస్థలు వెల్లడించిన మూడు రకాల సర్వేల్లో వైసీపీకి 19-23 వరకు లోక్ సభ స్థానాలు దక్కుతాయని చెప్పుకొచ్చాయి. దీని ద్వారా అసెంబ్లీ స్థానాల్లో వైసీపీకి దాదాపుగా 140 వరకు బలంగా ఉందనే విధంగా ఆ సర్వే ఫలితాలు ఉన్నట్లుగా కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో వైసీపీ చేయిస్తున్న సర్వేల్లోనూ గతం కంటే కొంత మేర సీట్లు తగ్గే అవకాశం ఉన్నా…120 కు పైగా గెలుస్తామనే రిపోర్టులు స్పష్టం చేసాయని పార్టీ ముఖ్య నేతలు వెల్లడిస్తున్నారు. వైసీపీ 45-67 వరకు గెలిచినా..మిగిలిన 108 సీట్లు ఎవరికి దక్కుతాయనేది పవన్ ఎందుకు బయట పెట్టలేదనేది ఇప్పుడు చర్చకు కారణమైంది. టీడీపీకి ఆ సీట్లు వస్తాయా.. లేక జనసేన – టీడీపీ పొత్తుతో పోటీ చేస్తే దక్కే సీట్ల సంఖ్యా అనేది బయటకు చెప్పలేదు. ఇవన్నీ కాకుండా.. 2014 తరహాలోనే తిరిగి టీడీపీ- బీజేపీ -జనసేన ఉమ్మడిగా జగన్ లక్ష్యంగా పోటీ చేస్తే తిరిగి 108 సీట్లు దక్కించుకుంటారా అనే దాని పైన ఎవరి అంచనాలు వారికి ఉన్నాయి. వైసీపీ నేతలు ఈ లెక్కల వెనుక కొత్త సమీకరణం గురించి చర్చిస్తున్నారు.

జనసేన అధినేత చెప్పిన లెక్కలతో వైసీపీ నేతలు విభేదిస్తున్నారు. ఇదే సమయంలో పవన్ సర్వే లెక్కల గురించి టీడీపీ కూడా స్పందించ లేదు. పవన్ లెక్కల వెనుక తిరిగి పొత్తుల సమీకరణం ఉందనే సంకేతాలు స్పష్టంగా ఉన్నాయనే విశ్లేషణలు మొదలయ్యాయి. పవన్ కళ్యాణ్ దసరా నుంచి బస్సు యాత్ర ప్రారంభించాలని నిర్ణయించారు. ఇప్పుడు వాయిదా వేసారు. దీని పైన ప్రత్యర్ధి పార్టీల నుంచి విమర్శలు రాకుండానే పక్క దోవ పట్టించేందుకే ఈ లలెక్కలు చెబుతున్నారని మాజీ మంత్రులు ఫైర్ అవుతున్నారు. కనీసం పవన్ తన పార్టీ 175 సీట్లలో పోటీ చేస్తుందా..లేక, చంద్రబాబు ఇచ్చిన సీట్లతో సర్దుకుంటుందా చెప్పాలని మాజీ మంత్రి పేర్ని నాని డిమాండ్ చేసారు. టీడీపీ – జనసేన పొత్తు ఖాయమనే అంచనాల్లో వైసీపీ ఉంది. బీజేపీ వైఖరి పైన స్పష్టత రావాల్సి ఉంది. ఆ క్లారిటీ వచ్చిన తరువాతనే ఈ రెండు పార్టీల పొత్తు పైన అధికారికంగా స్పష్టత ఇస్తారనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి.