లండన్ సమీపంలోని లెస్టర్‌లో హిందూ, ముస్లింల మధ్య ఉద్రిక్తతలు.

లండన్ సమీపంలోని లెస్టర్‌లో శనివారం హిందూ, ముస్లింల మధ్య తీవ్రమైన ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ప్రజలు సంయమనం పాటించాలని పోలీసులు, స్థానిక నాయకులు కోరారు.

ఇరు వర్గాల యువత మధ్య ఉద్రిక్తతలు చెలరేగడంతో పోలీసులు జనాన్ని అదుపు చేసేందుకు ప్రయత్నించారు.

ఈ సందర్భంగా ఇద్దరిని అరెస్ట్ చేశారని, ఒక “అనూహ్యంగా మొదలైన నిరసన ప్రదర్శన” తరువాత అక్కడ అగ్గి రాజుకుందని పోలీసులు తెలిపారు.

ఆగస్టు 28న భారత, పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ తరువాత చెలరేగిన హింస సహా ఇక్కడ ఇలాంటి పలు ఘటనలు చోటుచేసుకున్నాయి. మరి కొన్ని రోజుల పాటు ఈ ప్రాంతంలో గట్టి బందోబస్తు ఉంటుంది.

“వీధుల్లో మేం చూసిన సంఘటనలు చాలా ఆందోళనకరంగా ఉన్నాయి” అని లెస్టర్ ముస్లిం సంస్థల ఫెడరేషన్‌కు చెందిన సులేమాన్ నగ్డీ అన్నారు.

“భారత, పాకిస్తాన్‌ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరిగినప్పటి నుంచి ఇక్కడ సమస్యలు మొదలయ్యాయి. సాధారణంగా ఇరు దేశాల మ్యాచ్ జరిగినప్పుడు ప్రజలు గుమిగూడతారు కానీ, గతంలో ఎన్నడూ ఇంత దారుణమైన పరిస్థితి తలెత్తలేదు” అని ఆయన అన్నారు.

“శాంతియుత పరిస్థితులు నెలకొనాలి. ఇలాంటి ఉద్రిక్తతలకు స్వస్తి పలకాలి. తీవ్ర అసంతృప్తితో ఉన్న కొందరు యువకులు విధ్వంసం సృష్టిస్తున్నారు. దీనికి ముగింపు పలకాలి. వారి పెద్దలతో మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నాం. వారే వీరికి నచ్చజెప్పాలి” అని సులేమాన్ నగ్డీ అన్నారు.

శనివారం రాత్రి జరిగిన సంఘటనలు చాలా దిగ్భ్రాంతిని, విచారాన్ని కలిగించాయని హిందూ, జైన్ దేవాలయాల ప్రతినిధి సంజీవ్ పటేల్ అన్నారు.

“దశాబ్దాలుగా ఈ నగరంలో మేం శాంతియుతంగా, సామరస్యంతో నివసిస్తున్నాం. కానీ, గత కొన్ని వారాలుగా జరుగుతున్నది చూస్తుంటే, వాళ్లకి ఎందుకు అసంతృప్తి, దేని మీద కోపమో తెలుసుకోవాల్సిన అవసరం ఉందనిపిస్తోంది. దీని గురించి కూర్చుని మాట్లాడుకోవాలి. హింసామార్గం పట్టడం సరికాదు’’ అన్నారు పటేల్

” గత రెండు వారాల్లో, మొన్న శనివారం జరిగింది చూసి భయభ్రాంతులకు గురయ్యాం. మనం శాంతియుతంగా వ్యవహరించాలని హిందూ, జైన, ముస్లిం వర్గాల వారికి, సంఘాల నేతలకు పదే పదే చెబుతున్నాం. హింస దేనికీ పరిష్కారం కాదు. శాంతి, సంయమనంతో చర్చలకు ఇది సమయం” అని ఆయన సూచించారు.

ఈ ఘటనలో కుట్ర పన్నారనే అనుమానంతో ఒకరిని, పదునైన ఆయుధాలు కలిగి ఉన్నారనే అనుమానంతో మరొకరిని శనివారం అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వాళ్లు ఇంకా పోలీసు కస్టడీలోనే ఉన్నారు. ఆదివారం నాటికి మొత్తం 15మంది అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

లెస్టర్ నగర మేయరు సర్ పీటర్ సోల్స్‌బై మాట్లాడుతూ, “శనివారంనాడు పరిస్థితులు ఉద్రిక్తంగా మారతాయని ఎవరూ ఊహించలేదు. గత రెండు వారాలుగా అక్కడ పరిస్థితులు అదుపులోకి వచ్చాయని పోలీసులు చెబుతూ వచ్చారు. కానీ, శనివారం పరిస్థితులు చాలా దారుణంగా మారాయి. ఈ ఘర్షణల్లో చిక్కుకున్న వ్యక్తుల గురించి నాకు ఆందోళనగా. పోలీసులు వెంటనే స్పందించి చర్యలు తీసుకున్నందుకు సంతోషం” అని అన్నారు.

“టీనేజీలో ఉన్న పిల్లలు, ఇప్పుడే 20లలోకి అడుగుపెట్టిన యువకులు వీళ్లంతా. ఇది చాలా బాధాకరం. ఆ ప్రాంతాల్లో నివసిస్తున్నవారికి ఇది భయానకంగా ఉంటుంది” అని మేయర్ అన్నారు.

సంఘాల నాయకులు పూనుకుని పరిస్థితిని చక్కదిద్దాలని, అయితే, యువతకు నచ్చజెప్పడం అంత సులువు కాదని సర్ పీటర్ అన్నారు.

“తూర్పు లెస్టర్ ప్రాంతంలో పలు ఘర్షణలు చోటుచేసుకున్నట్టు రిపోర్టులు వచ్చాయి. అక్కడికి మా బలగాలను పంపించాం. పరిస్థితిని అదుపులోకి తెచ్చాం. అదనపు అధికారులను కూడా పంపిస్తున్నాం. అందరూ సంయమనం పాటించండి” అని లెస్టర్‌షైర్ పోలీస్ తాత్కాలిక చీఫ్ కానిస్టేబుల్ రాబ్ నిక్సన్ అన్నారు.

ఆదివారం ఉదయానికి పరిస్థితి అదుపులోకి వచ్చిందని, భారీ స్థాయిలో సోదాలు నిర్వహించామని పోలీసులు తెలిపారు.

“పలు హింసాత్మక ఘటనలు, నష్టం జరిగినట్టు పోలీసులకు ఫిర్యాదులు వచ్చాయి. వాటిపై దర్యాప్తు చేస్తున్నాం” అని పోలీసుల ప్రతినిధి ఒకరు తెలిపారు.

“మెల్టన్ రోడ్డులో ఒక వ్యక్తి ఒక మతపరమైన భవనం వెలుపల జెండా తొలగించడానికి ప్రయత్నిస్తున్న వీడియో వైరల్ అయిన సంగతి మా దృష్టిలోకొచ్చింది. పోలీసులు అక్కడ జనాన్ని అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. దీనిపై దర్యాప్తు చేస్తాం” అని ప్రతినిధి చెప్పారు.

శనివారం జరిగిన ఘటనలను ప్రత్యక్షంగా చూసిన ఒక మహిళ బీబీసీతో మాట్లాడారు.

“మొహానికి గుడ్దలు చుట్టుకుని లేదా మాస్కులు తగిలించుకుని, హుడ్స్ వేసుకున్న వారు అక్కడ కనిపించారు. అన్నిచోట్లా విపరీతంగా జనం.. ఏదో ఫుట్‌బాల్ మ్యాచ్ చూసి బయటికొస్తున్నట్లుగా కనిపించింది. పోలీసులు రోడ్లు బ్లాక్ చేశారు. ఉప్పింగ్‌హామ్ రోడ్డులో చాలామంది పోలీసులు ఉన్నారు” అని చెప్పారు.

ఆన్‌లైన్‌లో ఉన్న ఫుటేజీలో జనం సీసాలు సహా పలు వస్తువులు విసురుతున్నారు. పోలీసులు వారిని అదుపు చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.

ఆరోజు పరిస్థితి మొత్తం చేయి దాటిపోయినట్టు అనిపించింది. పోలీసులు ఉన్నారు కానీ, వారు సరిగ్గా అదుపు చేయలేకపోయారు. ప్రజల్లో అనిశ్చితి, భయం నెలకొంది. గత కొద్ది వారాలుగా ఉద్రిక్తతలు పెరుగుతూ వచ్చాయి. ఇప్పుడు ఇది జరిగింది” అని మరొక సాక్షి చెప్పారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)