రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు?

ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ సీట్ల పెంపుపై దాఖలైన రిట్‌ పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. పర్యావరణ నిపుణులు ప్రొఫెసర్‌ కె.పురుషోత్తం రెడ్డి ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఏపీ అసెంబ్లీ సీట్లను 175 నుంచి 225కు, తెలంగాణలో 119 నుంచి 153కు పెంచాలనిపిటిషనర్ పేర్కొన్నారు. విభజన చట్టం నిబంధనలు అమలు చేసేలా కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేయాలని కోరారు. కేంద్రం, ఈసీ, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణను ప్రతివాదులుగా చేర్చారు. జస్టిస్‌ జోసెఫ్‌, జస్టిస్‌ హృషికేశ్‌ రాయ్‌ ధర్మాసనం విచారణ చేపట్టి ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఈ రిట్‌ పిటిషన్‌ను జమ్ముకశ్మీర్‌ నియోజకవర్గాల పిటిషన్‌కు జతచేయాలని ధర్మాసనం రిజిస్ట్రీని ఆదేశించింది.

ఉమ్మడి ఏపీని విభజించిన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాలను పెంచాల్సి ఉంది. అయితే సీట్లు పెంచాలంటే పార్లమెంటులో ప్రత్యేక చట్టం చేయాలని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. సీట్ల పెంపునకు సంబంధించి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నాయి. జనాభా లెక్కల సేకరణ పూర్తికాకపోవడం, రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య ఉండే సయోధ్య, ఇతర రాజకీయ పరమైన అంశాలు పెంపు వాయిదా పడటానికి కారణాలవుతున్నాయి. తెలంగాణ, ఏపీలో సీట్లు పెంచాలంటూ ఇక్కడిప్రభుత్వాలు కోరుతున్నాయి. ప్రత్యేక హోదాతోపాటు విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి ఏపీ అభివృద్ధికి బాటలు వేయాలని కోరుతున్నాయి. ఇటీవలే పార్లమెంటులో సంబంధిత మంత్రిత్వశాఖ స్పందిస్తూ 2026లో రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు ఉంటుందని స్పష్టం చేసింది.