మార్గదర్శి కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..!!

అమరావతి: మార్గదర్శి ఛిట్‌ఫండ్ కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో దేశ అత్యున్నత న్యాయస్థానం నోటీసులను జారీ చేసింది. ఏపీ ప్రభుత్వంతో పాటు రామోజీ రావుకు ఈ నోటీసులను ఇచ్చింది. ఈ నోటీసులకు నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. మార్గదర్శి ఛిట్‌ఫండ్ కేసులో సుప్రీంకోర్టులో దాఖలైన పిటీషన్లన్నీ ఇవ్వాళ విచారణకు వచ్చాయి. ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం వాటిని విచారించింది.

ఈ కేసులో ఏపీ ప్రభుత్వం ఇంప్లీడ్ అయిన విషయం తెలిసిందే. కొద్దిరోజుల కిందటే స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంతోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని అప్పట్లో లోక్‌సభ మాజీ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ స్వాగతించారు. ప్రభుత్వాన్ని ఆయన అభినందించారు. దీన్ని శుభపరిణామంగా చెప్పుకొచ్చారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డనని జగన్ అనిపించుకున్నారని ప్రశంసించారు.

వైఎస్ జగన్ తీసుకున్న ఈ నిర్ణయంతో మార్గదర్శి ఛిట్‌ఫండ్ బాధితులకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నానంటూ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఈ కేసు ఉమ్మడి రాష్ట్రంలో వెలుగులోకి వచ్చినందు వల్ల అటు తెలంగాణ ప్రభుత్వం కూడా అఫిడవిట్‌ దాఖలు చేయాలని అప్పట్లో ఆయన కోరారు. ఈ కేసులో ఏపీ ప్రభుత్వం ఇంప్లీడ్ కావడంతో మళ్లీ కదలిక వచ్చింది. నాలుగు వారాల్లోగా రామోజీ రావు, ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టు నోటీసులకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది.

ఇవ్వాళ సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ అడ్వొకేట్ వికాస్ సింగ్ తన వాదనలను వినిపించారు. వాదనలు ముగిసిన అనంతరం ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీంకోర్టు ఆవరణలో విలేకరులతో మాట్లాడారు. వాదనలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. పిటీషన్‌లో పొందుపరిచిన అంశాలన్నింటినీ ధర్మాసనం ఆలకించిందని, వాటన్నింటికీ నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని నోటీసులు ఇచ్చిందని చెప్పారు.

రామోజీ రావు వేసిన స్పెషల్ లీవ్ పిటీషన్‌ విషయంలో సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చిందని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. తాను వేసిన ఎస్ఎల్పీ విషయంలో ఇంప్లీడ్ కావడానికి తెలంగాణ ప్రభుత్వం ఇష్టపడలేదని తాను భావిస్తున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఇంప్లీడ్ వేయమన్నప్పటికీ.. ఎందుకో జాప్యం జరిగిందని అన్నారు. ఇప్పుడు రామోజీ రావు వేసిన ఎస్‌ఎల్పీ విషయంలోనైనా తెలంగాణ ప్రభుత్వం సమాధానం ఇవ్వక తప్పదని స్పష్టం చేశారాయన.

రూల్ ప్రకారం.. ఏది న్యాయమనిపిస్తుందో.. అదే చేస్తుందని తాను ఆశిస్తున్నట్లు ఉండవల్లి వ్యాఖ్యానించారు. మార్గదర్శి ఛిట్‌ఫండ్ కేసు విషయంలో ఏపీ ప్రభుత్వం ఇదివరకే స్పెషల్ లీవ్ పిటీషన్ వేసిందని గుర్తు చేశారు. ఈ కేసును లాజికల్‌గా ముగింపు పలికే ప్రయత్నాలు మొదలైనట్టేనని ఆయన చెప్పారు. మార్గదర్శి తరహా ఛిట్‌ఫండ్ వ్యాపారాలు ఈ దేశంలో ప్రతి ఒక్కరూ చేయడానికి అవకాశం ఉందని, డిపాజిట్లు సేకరించిన తరువాత వాటిని ఎంతమంది ఎగ్గొట్టేస్తోన్నారనేది మనం రోజూ చూస్తూనే ఉన్నామని ఉండవల్లి అన్నారు.

రామోజీ రావును ఒక్కిరనే అతీతుడిగా చేయొద్దని ఉండవల్లి అరుణ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. అలా ఆయనను అతీతుడిని చేయడం వల్ల సమాజానికి, మనకు ఉన్న చట్టాలకు చాలా హాని జరుగుతుందని తాను భావిస్తున్నానని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు ముందు వినిపించానని అన్నారు. ఇక మార్గదర్శి ఛిట్‌ఫండ్ కేసు విచారణ ప్రక్రియ ఇక ఆరంభమైందని వ్యాఖ్యానించారు. డిపాజిటర్లకు ఇవ్వాల్సిన మొత్తం సొమ్మును చెల్లించారా? అంటూ సుప్రీంకోర్టు స్పష్టంగా ప్రశ్నించిందని అన్నారు.