బీజేపీలో చేరిన మాజీ సీఎం అమరీందర్ సింగ్, ఆయన పార్టీ కూడా విలీనం

న్యూఢిల్లీ: పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ సోమవారం న్యూఢిల్లీలో కాషాయ పార్టీ సీనియర్ నాయకులు జేపీ నడ్డా, ఇతర నేతల సమక్షంలో బీజేపీలో చేరారు. 80 ఏళ్ల అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడు, గత ఏడాది నవంబర్‌లో అప్పటి పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజోత్ సిద్ధూతో తీవ్రమైన అధికార పోరు మధ్య కాంగ్రెస్‌ను వీడిన విషయం తెలిసిందే.

ఆ తర్వాత కొత్తగా ఏర్పాటు చేసిన పంజాబ్ లోక్ కాంగ్రెస్ (పీఎల్‌సీ)ని కూడా బీజేపీలో విలీనం చేశాడు. అమరీందర్ సింగ్ కుమారుడు రణిందర్ సింగ్, కుమార్తె జై ఇందర్ కౌర్ కూడా ఆయనతో పాటు బీజేపీలో చేరారు. అంతేగాక, రాష్ట్రానికి చెందిన మరికొందరు నాయకులు కూడా కాషాయ పార్టీ కండువా కప్పుకున్నారు.

గత ఏడాది పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అమరీందర్ సింగ్.. పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. అయితే, ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపొందిన ఎన్నికల్లో ఆయన పార్టీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. అమరీందర్ సింగ్ స్వయంగా తన సొంత గడ్డమైన పాటియాలా అర్బన్ నుంచి ఓడిపోయారు.

Former Punjab CM Shri @capt_amarinder merged his party Punjab Lok Congress (PLC) and joined BJP in presence of senior party leaders at BJP headquarters in New Delhi. #JoinBJP pic.twitter.com/5nMFtU1Hm1

అమరీందర్ సింగ్ చివరిసారిగా 1992లో అకాలీదళ్ నుంచి విడిపోయి శిరోమణి అకాలీ దళ్ (పాంథిక్)ని స్థాపించినప్పుడు తన పార్టీని విలీనం చేశారు. చివరకు 1998లో కాంగ్రెస్‌లో చేరారు. తాజాగా, ఆయన బీజేపీలో చేరారు. అమరీందర్ సింగ్ బీజేపీలో చేరడంపై ఆ పార్టీ నేతలు స్వాగతించారు.

అమరీందర్ సింగ్‌ను బీజేపీకి స్వాగతిస్తూ.. కేంద్రమంత్రి తోమర్ మాట్లాడుతూ.. “కెప్టెన్ సాహబ్” ఎల్లప్పుడూ దేశాన్ని అన్నింటికంటే ఉన్నతంగా ఉంచాడు. లక్షలాది మంది బీజేపీ కార్యకర్తల తరపున ఆయనను, ఆయన మద్దతుదారులను బీజేపీ కుటుంబంలో స్వాగతిస్తున్నందుకు సంతోషిస్తున్నాను’ అని మంత్రి అన్నారు.

“దేశంలోని సరైన ఆలోచనాపరులు ఐక్యంగా ఉండాలని మేము భావిస్తున్నాము. పంజాబ్ వంటి సున్నితమైన రాష్ట్రాన్ని జాగ్రత్తగా నిర్వహించాలి. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో.. అతను ఎప్పుడూ దేశ భద్రతకు ముందు రాజకీయాలను ఉంచలేదు’ అని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వ్యాఖ్యానించారు.