పీకలదాకా తాగి విమానమెక్కిన సీఎం?

పంజాబ్ సీఎం భగవంత్‌ మాన్ మ‌రో వివాదంలో ఇరుక్కున్నారు. ఆయ‌న పీకలదాకా తాగి విమానం ఎక్కడంతో జర్మనీ ఎయిర్‌పోర్టులో దించేసినట్లు వార్తలు వచ్చాయి. ఆయన ప్రవర్తన వ‌ల్ల విమానం నాలుగు గంటలు ఆలస్యంగా న‌డిచిన‌ట్లు తెలుస్తోంది. దీనిపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. సీఎంగా ఆయన ప్రవర్తన సిగ్గుచేటని, వెంట‌నే రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేశాయి. అతిగా మద్యం సేవించడంతో భగవంత్‌ మాన్‌ను ఫ్రాంక్‌ఫర్ట్‌ ఎయిర్‌పోర్టులో దించేసినట్లు వచ్చిన వార్తా కథనాన్ని శిరోమణి అకాలీదళ్‌ నేత సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌ ట్విటర్‌లో షేర్‌ చేశారు. దీనివ‌ల్లే ఆయన ఆమ్‌ ఆద్మీ జాతీయ సదస్సుకు హాజరుకాలేద‌ని, పంజాబ్‌ ప్రభుత్వం కూడా అందుకే మౌనంగా ఉందిన్నారు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని నిజానిజాలను బయటపెట్టాల‌న్నారు.

కాంగ్రెస్ పార్టీ కూడా ఈ వార్తా కథనాన్ని షేర్ చేసింది. భగవంత్‌ మాన్‌ అతిగా మద్యం సేవించారని, కనీసం నిలబడే పరిస్థితుల్లో లేని ఆయ‌న్ని భార్య, భద్రతా సిబ్బంది పట్టుకుని నడిపించిన‌ట్లుగా తోటి ప్రయాణికులు చెప్పార‌ని వార్తాక‌థ‌నంలో ఉంది. అయితే ఈ ఆరోప‌ణ‌ల‌ను ఆమ్ ఆద్మీ ఖండించింది. షెడ్యూల్ ప్ర‌కార‌మే ఆయ‌న స్వ‌దేశానికి వ‌చ్చార‌ని, విదేశాల నుంచి పెట్టుబ‌డుల‌ను విజ‌య‌వంతంగా తీసుకురాగ‌లిగార‌ని తెలిపింది. సీఎం ప్ర‌తిష్ట‌ను దెబ్బ‌తీసేందుకు ప్ర‌తిప‌క్షాలు ఇలాంటి త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నాయ‌ని మండిప‌డింది. లుఫ్తాన్సా ఎయిర్ లైన్స్ లో చెక్ చేసుకోవ‌చ్చ‌ని తెలిపింది. ఎయిర్‌క్రాఫ్ట్‌ ఛేంజ్‌, మరో విమానం ఆలస్యమవ్వడం వల్లే డిల్లీ వచ్చిన విమానం ఆలస్యమైందని పేర్కొంది. అయితే ప్ర‌యాణికుల వ్య‌క్తిగ‌త స‌మాచార‌న్ని బ‌య‌ట‌కు ఇవ్వ‌లేమిన తెలిపింది.