నిరంకుశపాలన చేస్తున్న కేసీఆర్.. ఖాసిం చంద్రశేఖర్ రజ్వీ; గద్దె దింపి తీరుతాం: బండి సంజయ్

నిరంకుశ పాలన చేస్తున్న సీఎం కేసీఆర్ ను గద్దె దింపి తీరుతామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కెసిఆర్ ను టార్గెట్ చేశారు. కెసిఆర్ అంటే ఖాసిం చంద్రశేఖర్ రజ్వీ అని పేర్కొన్న బండి సంజయ్ నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా మల్కాజ్ గిరి లో నిర్వహించిన బహిరంగ సభలో కెసిఆర్ ను టార్గెట్ చేశారు.

మల్కాజ్ గిరి చౌరస్తాలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన బండి సంజయ్ తెలంగాణ ఉద్యమంలో 1450 మంది ప్రాణత్యాగం చేశారని గుర్తు చేశారు. కానిస్టేబుల్ కృష్ణయ్య, శ్రీకాంతాచారి లాంటి పేదవాళ్ళు ప్రాణత్యాగం చేస్తే వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని పెద్దోళ్ళు ఏలుతున్నారని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. నాడు తెలంగాణ సాయుధ పోరాటంలో 4,500 మంది ప్రాణత్యాగం చేస్తే తెలంగాణాకు నిజాం నుంచి విముక్తి లభించిందని పేర్కొన్న బండి సంజయ్, తెలంగాణ మహిళలను వివస్త్రలను చేసి బతుకమ్మ ఆటాడించిన రజాకార్లకు, నిజాం కు వత్తాసు పలుకుతున్న కేసీఆర్ కు సిగ్గు లేదని వ్యాఖ్యలు చేశారు. దీనికి కెసిఆర్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీలకు ఓట్లు వేస్తే మజ్లిస్ పార్టీకి ఓటు వేసినట్టే అని బండి సంజయ్ తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రజలు టిడిపి, కాంగ్రెస్, టిఆర్ఎస్ లకు అవకాశం ఇచ్చారని, ఒకసారి బీజేపీకి అవకాశం ఇస్తే మోడీ నాయకత్వంలో నీతివంతమైన పాలన అందిస్తామని బండి సంజయ్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం 2.4 లక్షల ఇళ్లు కేటాయిస్తే ఈ ప్రాంతంలో వారికి ఒక ఇల్లయినా వచ్చిందా అని ప్రశ్నించిన బండి సంజయ్, ఎంఎంటీఎస్ కోసం కేంద్రం 600 కోట్ల రూపాయలను కేటాయిస్తే, రాష్ట్ర ప్రభుత్వం తన వంతు నిధులు మంజూరు చేయలేక పోయిందని ఎద్దేవా చేశారు.

మల్కాజ్గిరి లో టిఆర్ఎస్ నాయకులు భూ కబ్జాలకు పాల్పడుతున్నారు అని ఆరోపించిన బండి సంజయ్, అదేమని ప్రశ్నిస్తే టిఆర్ఎస్ నాయకులు దాడులకు పాల్పడుతున్నారని, తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు, గతంలో పాత బస్తీలో పాకిస్తాన్ జెండా పట్టుకున్న చేతులతో, ఈరోజు జాతీయ జెండాలు పట్టుకునేలా చేశామంటే అది బిజెపి వల్లనేనని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. దారుస్సలాం నుంచి ఓవైసీ కెసిఆర్ కు, కేటీఆర్ కు కృతజ్ఞతలు చెబుతున్నారంటే ప్రభుత్వం ఎవరి కనుసన్నల్లో నడుస్తుందో గుర్తించాలని ప్రజలకు బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు.

ఎస్టీ రిజర్వేషన్ పేరుతో మరోమారు ప్రజలను మభ్యపెట్టాలని ప్రయత్నిస్తున్న కెసిఆర్ ఇన్ని రోజులు కేంద్రం అడ్డుకుందని చెప్పి వారిని మోసగించారని తెలిపారు. ఇప్పటివరకు గిరిజనులకు పోడు భూములకు పట్టాలు ఇవ్వని కేసీఆర్ వారు పండించిన పంటను సైతం నాశనం చేసి మహిళలను కూడా అరెస్టు చేశారన్నారు. ఇక ఎస్టి సోదరులు ఈ సంఘటనలను గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.