Latest Posts

దేవాలయానికి వచ్చి రాజకీయాలా? కేటీఆర్‌పై విమర్శలా? రఘునందన్‌కు ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ కౌంటర్!!

దుబ్బాక బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మునుగోడు తరహాలోనే వేములవాడలోని ఉప ఎన్నిక ఖాయమని రఘునందన్ రావు తేల్చిచెప్పారు. ఇక బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు వ్యాఖ్యలపై వేములవాడ టిఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ రివర్స్ ఎటాక్ చేశారు.

దర్శనం కోసం వచ్చి రాజకీయాలు మాట్లాడడం ఎందుకని ప్రశ్నించిన వేములవాడ టిఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ , రఘునందన్ రావు మాటలు వింటుంటే బాధగా ఉందని వ్యాఖ్యలు చేశారు. మంత్రి కేటీఆర్ చాలాసార్లు కుటుంబ సమేతంగా రాజరాజేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నారు అని పేర్కొన్న చెన్నమనేని రమేష్ దేశంలో దేవుడిని ఎప్పుడు దర్శనం చేసుకోవాలి? ఎలాంటి బట్టలు వేసుకోవాలి అనేది పౌరుల హక్కు అంటూ తేల్చి చెప్పారు. ఇక వేములవాడ ఆలయానికి సంబంధించిన పనుల పై మాట్లాడిన చెన్నమనేని రమేష్ గుడి చెరువులో 365 రోజులు నీళ్లు ఉంటున్నాయని అన్నారు. బద్ది పోచమ్మ ఆలయం విస్తరణ కోసం నిధులు వెచ్చించామని చెన్నమనేని రమేష్ తెలిపారు.

ఇక కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక రూపాయి అయినా రాజన్న ఆలయానికి వెచ్చించారా అని ప్రశ్న వేసిన చెన్నమనేని రమేష్ ప్రభుత్వ సంస్థలను అమ్ముతూ కేంద్రం కాలం వెల్లడిస్తోంది అని మండిపడ్డారు. అసలు తెలంగాణ రాష్ట్రానికి మీరేమి ఇచ్చారు అంటూ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ ప్రశ్నించారు. కేవలం బిజెపి నాయకులు తెలంగాణ ప్రజల మనసుల్లో విద్వేషాలు రాగల్చాలని ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించుకొని మాట్లాడాలని రఘునందన్ రావు కు హితవు పలికారు.

రఘునందన్ రావు ఓట్ల కోసం మాట్లాడమంటే నవ్వొస్తోంది అని, నాలుగు సార్లు బీజేపీ అభ్యర్థిని చిత్తుగా ఓడించానని చెన్నమనేని రమేష్ తెలిపారు. ఇక తన పౌరసత్వంపై రఘునందన్ రావు చేసిన వ్యాఖ్యలకు తాను సమాధానం ఇవ్వనని, కోర్టు పరిధిలో ఉన్నందున మాట్లాడలేనని చెన్నమనేని రమేష్ స్పష్టం చేశారు. దేవాలయాలలో రాజకీయాలు చేసే అలవాటు బిజెపి నాయకులకు ఉండొచ్చు కానీ తమకు అటువంటి రాజకీయాలు చేసే అలవాటు లేదని చెన్నమనేని రమేష్ తేల్చిచెప్పారు. రఘునందన్ రావు నిజాయితీ ఉంటే కెటిఆర్ పై, తనపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని చెన్నమనేని రమేష్ డిమాండ్ చేశారు.

ఇదిలా ఉంటే నిన్న వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించిన దుబ్బాక బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు వేములవాడ ఆలయ అభివృద్ధి పై, సీఎం కేసీఆర్ ప్రభుత్వ పాలనపై నిప్పులు చెరిగారు. చెన్నమనేని రమేష్ పౌరసత్వాన్ని ప్రశ్నించి, వేములవాడలో ఉప ఎన్నికలు రావడం ఖాయమని తేల్చి చెప్పారు. మునుగోడు ఉప ఎన్నికల్లో విజయం సాధిస్తామని, ఇక వేములవాడలోనూ ఉప ఎన్నికల్లో విజయం సాధిస్తామని రఘునందన్ రావు ధీమా వ్యక్తం చేశారు. మంత్రి కేటీఆర్ నాస్తికుడని, వేములవాడ ఆలయ అభివృద్ధి పై దృష్టి సారించడం లేదని బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ కౌంటర్ ఇచ్చారు.

Latest Posts

Don't Miss