టీడీపీ పై సీఎం జగన్ చేతికి మరో అస్త్రం – డేటా చౌర్యంపై నివేదిక సిద్దం : కీలక నిర్ణయం..!!

వైసీపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. టీడీపీ హయాంలో ఫోన్ ట్యాపింగ్, పౌరుల డేటా చోరీ జరిగిందని నిర్దారణకు వచ్చినట్లు తెలుస్తోంది. దీని పైన రేపు అసెంబ్లీలో కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. గత ప్రభుత్వ హాయంలో పౌరుల వ్యక్తిగత డేటా చోరీ జరిగిందంటూ నాడు విపక్షంలో ఉన్న వైసీపీ తీవ్ర ఆరోపణలు చేసింది. తమకు ఓటు వేయని వారిని గుర్తించి వారికి ఓటు లేకుండా చేయటమే దీని వెనుక ఉద్దేశమని ఆరోపించింది. ప్రభుత్వం వద్ద ఉండాల్సిన సమచారం…ప్రైవేటు వ్యక్తుల వద్దకు చేర్చారని విమర్శించారు. ఇదే అంశం పైన కొద్ది నెలల క్రితం అసెంబ్లీ వేదికగా చర్చ సాగింది.

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తమ వద్దకు పెగాసస్ అమ్ముతామని వచ్చారని, తాను తిరస్కరించగా ..అప్పటి ఏపీ సీఎం కొనుగోలు చేసారంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు వైసీపీకి అస్త్రంగా మారాయి. వీటి ఆధారంగా అసెంబ్లీలో చర్చకు నిర్ణయించింది. అదే సమయంలో టీడీపీ నేతలు తమ ప్రభుత్వ హయాంలో ఎటువంటి స్పై వేర్ కొనుగోలు చేయలేదని చెప్పారు. అసెంబ్లీలో చర్చ సమయంలో టీడీపీ ప్రభుత్వంలో నిఘా చీఫ్ ఉన్న అధికారి.. టీడీపీలోని ముఖ్య నేతల సన్నిహితులు కలిసి ఇదంతా చేసారని సభలో వైసీపీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. దీని పైన నాటి నిఘా చీఫ్ ఏబీ వెంకటేశ్వర రావు స్పందించారు అసలు ఎటువంటి స్పై వేర్ కొనుగోలు చేయలేదని చెప్పుకొచ్చారు. అప్పటికే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత డీజీపీగా నియమితులైన గౌతం సవాంగ్ ఇదే విషయాన్ని స్పష్టం చేసారని గుర్తు చేసారు.

ఇక, అదే రోజు సభలో వైసీపీ సభ్యుల సూచన మేరకు టీడీపీ హయాంలో ఫోన్ ట్యాపింగ్, డేటా చౌర్యం సభా సంఘం వేసి విచారణ చేయాలని నిర్ణయిస్తూ స్పీకర్ ప్రకటించారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన ఆధ్వర్యంలో కమిటీ వేసారు. ఈ కమిటీలో సభ్యులుగా పార్థసారధి, అబ్బయ్య చౌదరి,మొండితోక జగన్మోహన్ రావు,జక్కంపూడి రాజా ఉన్నారు. పలుమార్లు సమావేశమైన ఈ కమిటీ ఐటీ శాఖ అధికారులతో పాటుగా హోం శాఖ అఫీషియల్స్ తోనూ భేటీ అయ్యారు. పలు దఫాలుగా చర్చించి.. ఈ రోజున అసెంబ్లీ ప్రాంగణంలో మరోసారి సమావేశం నిర్వహించారు. అందులో గోప్యంగా ఉండాల్సిన సమాచారంతో పాటు పోన్ ట్యాపింగ్ జరిగినట్టు నిర్ధారణకు వచ్చిన హౌస్ కమిటీ నిర్దారణకు వచ్చినట్లు తెలుస్తోంది.

ఇదే అంశాన్ని సభ ముందు ఉంచేందుకు 85 పేజీలతో ఒక నివేదిక సిద్దం చేసారు. మంగళవారం సభ ముందు తమ నివేదికను సమర్పించనున్నారు. గోప్యంగా ఉంచాల్సిన సమాచారం బయటకు వెళ్లటం.. ఫోన్ ట్యాపింగ్ పైన ఆధారాలు సేకరించారని చెబుతున్నారు. దీంతో..ఈ నివేదికలో సభా సంఘం తేల్చిన అంశాలు..ఎవరిని ఇందుకు బాధ్యులను చేస్తూ సిఫార్సు చేసారనేది ఇప్పుడు ఉత్కంఠకు కారణమవుతోంది. టీడీపీ హయాంలో డేటా చౌర్యం జరిగినట్లుగా కమిటీ నిర్దారణకు వచ్చిందని సమాచారం. దీంతో..ఈ కమిటీ సభ ముందుకు తీసుకొచ్చే నివేదిక పైన రాజకీయంగా ఉత్కంఠ మొదలైంది.