టీఆర్ఎస్ నేతలను జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ వద్ద కట్టేయండి.!విరుచుకుపడ్డ బండి సంజయ్.!

హైదరాబాద్ : టిఆర్ఎస్ నేతలను పట్టుకొచ్చి జవహర్ నగర్ డంపింగ్ యార్డు వద్ద కట్టేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేసారు. అప్పుడే ఈ ప్రాంతంలోని లక్షలాది మంది ప్రజలు పడుతున్న బాధలు వారికి తెలిసొస్తాయన్నారు. సమస్యను పరిష్కరించడం చేతగాదు కానీ, భూకబ్జాలు, కమీషన్ల పేరుతో టీఆర్ఎస్ నేతలు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. సీఎం చంద్రశేఖర్ రావుకు ఏ మాత్రం మానవత్వం ఉన్నా జవహర్ నగర్ డంపింగ్ యార్డు వద్దకొచ్చి ప్రజల బాధలు తెలుసుకోవాలని సూచించారు.

బిజెపి అధికారంలోకి వచ్చిన వెంటనే డంపింగ్ యార్డ్ సమస్యను తేలుస్తామని బండి సంజయ్ కుమార్ హామీ ఇచ్చారు. పోస్టింగుల కోసం కొంతమంది కలెక్టర్లు, కొంతమంది పోలీసు అధికారులు భజన పరులుగా మారిపోయారన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అవమానపరిచిన చంద్రశేఖర్ రావును అభినవ అంబేద్కర్ అంటూ పొగుడుతున్న కలెక్టర్ కు కొంతైనా సిగ్గు లేదన్నారు బండి సంజయ్. టిఆర్ఎస్ ప్రభుత్వం వెంటిలేటర్ పై ఉందని, ఉఫ్ అంటే ఊడిపోయే ప్రభుత్వమని పేర్కొన్నారు.

మేడ్చల్ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్ సోమవారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు యాప్రాల్ నుండి దమ్మాయిగూడ నడిచారు. ఈ సందర్భంగా దమ్మాయిగూడ చౌరస్తా వద్ద ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. చంద్రశేఖర్ రావు మేడ్చల్ డిపోను మార్టిగేజ్ చేసి అమ్ముకున్నాడని, తెలంగాణలోనే అన్ని ఆర్టీసీ డిపోలను మార్టిగేజ్ చేసి షాపింగ్ మాల్ లను చేస్తున్నాడని బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు చేసారు. ఆర్టీసీ కార్మికుల పొట్టగొట్టి, చిప్ప చేతికి ఇచ్చిండని, డంపింగ్ యార్డ్ ని ఎలా భరిస్తున్నారని, డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారానికి బీజేపి కట్టుబడి ఉందన్నారు బండి సంజయ్.

టిఆర్ఎస్ వాళ్లను పట్టుకొచ్చి కట్టేసి డంపింగ్ యార్డ్ దగ్గర పెట్టాలన్నారు బండి సంజయ్. 600 ఎకరాలను కబ్జా చేసుకోమంటే,వెంటనే టిఆర్ఎస్ వాళ్లు వచ్చి ఆ డంపింగ్ యార్డ్ ను కూడా కబ్జా చేసేసుకుంటారని ఎద్దేవా చేసారు. బిజెపికి అధికారం ఇస్తే ఆ డంపింగ్ యార్డ్ సమస్యను వెంటనే పరిష్కరిస్తామన్నారు బండి సంజయ్. కొంతమంది కలెక్టర్లకు, కొంతమంది పోలీసు ఉన్నతాధికారులకు సిగ్గుండాలని, అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అవమానపరిచిన చంద్రశేఖర్ రావును అభినవ అంబేద్కర్ అంటూ పొగుడుతున్న కలెక్టర్ కు కొంతైనా సిగ్గుండాలన్నారు బండి సంజయ్.

తెలంగాణ రాష్ట్రంలో పేదల సమస్యలను గాలికి వదిలేసి, జాతీయ రాజకీయాలంటూ చంద్రశేఖర్ రావు దేశం పట్టుకుని తిరుగుతున్నాడని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈడీ దాడులు అంటే బిడ్డ పేరు, సిబిఐ అంటే కొడుకు పేరు వస్తోందని అన్నారు. పేదోళ్ల కోసమే సంవత్సరం నుంచి పాదయాత్ర చేస్తున్నాని, ప్రజా సంగ్రామ యాత్ర కు విశేష స్పందన వస్తుంటే బిజెపి అంటేనే చంద్రశేఖర్ రావు గజగజా వణుకుతున్నాడన్నారు బండి సంజయ్. పోయినసారి ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకునే ప్రయత్నం చేశారని, ఒక్కసారి బిజెపికి అవకాశం ఇవ్వాలని బండి సంజయ్ కుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేసారు.