చైనాపై ఎదురుదాడికి సిద్ధం: తేల్చేసిన బైడెన్: రెండోసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీపైనా క్లారిటీ

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో 2024లో నిర్వహించబోయే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడంపై జో బైడెన్ క్లారిటీ ఇచ్చారు. బైడెన్ 60 మినిట్స్ పేరుతో నిర్వహించిన ఇంటర్వ్యూలో పలు విషయాలపై మాట్లాడారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం సహా పలు జాతీయ, అంతర్జాతీయ అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. తైవాన్‌పై చైనా యుద్ధానికి దిగితే అమెరికా ఎలాంటి పాత్రను పోషిస్తుందనే విషయంపైనా స్పష్టత ఇచ్చారు.

సీబీఎస్ నిర్వహించిన ఇంటర్వ్యూ ఇది. క్వీన్ ఎలిజబెత్ 2 అంత్యక్రియల్లో పాల్గొనడానికి జో బైడెన్ లండన్‌కు బయలుదేరి వెళ్లిన కొద్దిసేపటికే ఆ మీడియా హౌస్ దీన్ని టెలికాస్ట్ చేసింది. 2024 నాటి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని తాను భావిస్తున్నానని జో బైడెన్ పేర్కొన్నారు. దీనిపై ఇంకా తుది నిర్ణయాన్ని తీసుకోలేదని స్పష్టం చేశారు. పోటీ చేయాలనేది తన అభిప్రాయం మాత్రమేనని వ్యాఖ్యానించారు.

2020 నవంబర్‌లో నిర్వహించిన ఎన్నికల్లో జో బైడెన్ అధ్యక్షుడిగా ఎన్నికైన విషయం తెలిసిందే. డెమొక్రాట్ల తరఫున పోటీ చేసిన ఆయన రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ను ఓడించారు. అధ్యక్షుడిగా జో బైడెన్, ఉపాధ్యక్షురాలిగా భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ ఎన్నికయ్యారు. అమెరికా అధ్యక్ష పదవికి నాలుగేళ్లకోసారి ఎన్నికలను నిర్వహిస్తారు. వరుసగా రెండుసార్లు మాత్రమే పోటీ చేసే అవకాశం ఆ దేశాధ్యక్షుడికి ఉంది. రెండోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనే ఆలోచనలో జో బైడెన్ ఉన్నారు.

వయస్సు మీద పడినప్పటికీ.. ఎనర్జీ లెవెల్స్ తగ్గలేదని, మానసిక తాను చాలా దృఢంగా ఉన్నానని జో బైడెన్ చెప్పారు. ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌తో కలిసి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నానని, దీనిపై తుది నిర్ణయాన్ని తీసుకోవడానికి ఇంకా సమయం ఉందని చెప్పారు. ప్రస్తుతం తన వయస్సు 81 సంవత్సరాలని, ఇంకో దఫా కూడా అధ్యక్షుడిగా బాధ్యతలను నిర్వర్తించడానికి వయస్సు సహకరిస్తుందని అన్నారు.

పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతటి వైరం ఉన్న చైనా-తైవాన్ మధ్య యుద్ధం జరిగితే అమెరికా ఎలా స్పందిస్తుందనే విషయంపై జో బైడెన్ తేల్చేశారు. తైవాన్‌కు అండగా ఉంటామని పేర్కొన్నారు. తైవాన్‌ను ఆక్రమించుకోవడానికి చైనా ప్రయత్నాలు చేస్తే- యుఎస్ దళాలు అడ్డుపడతాయని స్పష్టం చేశారు. వన్ చైనా విధానాన్ని తాము వ్యతిరేకించట్లేదు గానీ.. దీన్ని ఆధారంగా చేసుకుని యుద్ధానికి దిగితే చైనాను అడ్డుకుని తీరుతామని అన్నారు.

తైవాన్ పట్ల తాము అనుసరిస్తోన్న విధానంలో ఎలాంటి మార్పు రాలేదని జో బైడెన్ స్పష్టం చేశారు. చైనా.. తైవాన్‌పై దండెత్తితే పరిస్థితి రాదనే తాను భావిస్తున్నానని బైడెన్ వ్యాఖ్యానించారు. అమెరికా హౌస్ స్పీకర్ న్యాన్సీ పెలోసీ పర్యటన తరువాత చైనా-తైవాన్ మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడిన విషయం తెలిసిందే. పెలోసీ తైవాన్ పర్యటనలో ఉన్న సమయంలోనే చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ బలగాలు పెద్ద ఎత్తున తమ ఆయుధాలను తైవాన్ చుట్టూ మోహరింపజేశాయి.