చీరాల నుంచి టీడీపీ అభ్యర్థిగా పురంధేశ్వరి కుమారుడు హితేష్?

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడికి ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు తోడ‌ల్లుడు. కొన్నాళ్ల క్రితం వ‌ర‌కు ఈ నేత‌ల మ‌ధ్య రాజ‌కీయ వైరుధ్యాలున్న‌ప్ప‌టికీ అవి స‌మ‌సిపోయాయంటూ వార్త‌లు వ‌చ్చాయి. రాష్ట్ర విభజన అనంతరం ఆయన సతీమణి పురంధేశ్వరి బీజేపీలోకి వెళ్లగా వెంకటేశ్వరరావు రాజకీయాలకు దూరం జరిగారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పర్చూరు నుంచి పోటీచేసి ఓటమిపాలయ్యారు.

ఎన్నిక‌ల‌కు ఏడాదిన్న‌ర‌కు పైగా స‌మ‌యం ఉన్న‌ప్ప‌టికీ గ‌తానికి భిన్నంగా చంద్రబాబు అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే సిట్టింగ్‌లంద‌రికీ సీట్ల‌ని ప్ర‌క‌టించారు. ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లా ప‌ర్చూరు నుంచి ఏలూరి సాంబ‌శివ‌రావు గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించారు. ఆ ఎన్నిక‌ల్లోనే ప‌ర్చూరు నుంచి ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు-పురంధేశ్వరి కుమారుడు హితేష్ పోటీచేస్తాడ‌ని అంద‌రూ భావించారు. కానీ పౌర‌స‌త్వం గడువు ముగియకపోవడంతో వెంకటేశ్వరరావు వైసీపీ తరఫున బరిలోకి దిగి ఓటమిపాలయ్యారు. ఆ త‌ర్వాత ఆయ‌న రాజ‌కీయాల‌కు దూర‌మ‌య్యారు.

ఇటీవ‌లి ప‌రిణామాల్లో ద‌గ్గుబాటి చంద్ర‌బాబుకు ద‌గ్గ‌ర‌వుతున్నారని, త‌న కుమారుడు హితేష్‌ను తెలుగుదేశం పార్టీలోకి తెచ్చి చీరాల సీటు తీసుకుంటారంటూ వార్త‌లు వ‌స్తున్నాయి. సిట్టింగ్‌లంద‌రికీ సీట్ల‌న‌డంవ‌ల్ల ప‌ర్చూరు ఏలూరి సాంబ‌శివ‌రావుకు ఓకే అయ్యింది. దీంతో హితేష్ ను చీరాలో నిల‌బెడ‌తారని తాజాగా వార్త‌లు వ‌స్తున్నాయి. వాస్తవానికి చీరాల నియోజకవర్గాన్ని పొత్తు కుదిరితే జనసేనకు ఇవ్వాలనే ఆలోచన పార్టీ చేస్తోంది. అంతేకాకుండా వైసీపీ తరఫున మళ్లీ పోటీచేయడానికి ఆమంచి కృష్ణమోహన్, కరణం బలరాం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. సీటిస్తే పోటీచేస్తానంటూ కరణం బలరాం తనయుడు వెంకటేష్ తాజాగా ప్రకటించారు.

వీరిద్దరూ అక్కడ బలమైన అభ్యర్థులు. వారిని గట్టిగా ఢీకొట్టాలంటే హితేష్ సరైన అభ్యర్థి అవుతాడని పార్టీ భావిస్తోంది. దగ్గుబాటి కుటుంబానికి పర్చూరుతోపాటు చీరాల నియోజకవర్గ పరిధిలో కూడా అనుచరులుండటం, బంధువర్గం ఉండటంతో ఇక్కడి నుంచి గెలిపించుకోవచ్చని భావిస్తున్నారు. అయితే ఇందులో ఎంత నిజ‌ముందో తెలియాలంటే రాజకీయ పరిణామాల్లో భారీ మార్పులు చోటుచేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి అటువంటి వాతావరణం ఏదీ లేదు కాబట్టి అధికారికంగా ప్రకటన వచ్చేవరకు వేచిచూడక తప్పదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.