క్వీన్ ఎలిజబెత్ 2: కింగ్ చార్లెస్ 3 ఎదుర్కోబోయే సవాళ్లు ఏమిటి?

క్వీన్ ఎలిజబెత్ 2 మరణించిన 48 గంటల లోపే కింగ్ చార్లెస్ 3 బ్రిటన్‌కు కొత్త రాజు అయ్యారు. కొన్ని బదిలీలు కాగితంపై సజావుగా సాగిపోతాయి. కానీ, వాస్తవంలో అంత సులువుగా జరగవు.

బ్రిటన్, రాజ కుటుంబం అనేక సవాళ్లు ఎదుర్కుంటున్న సమయంలో కింగ్ చార్లెస్ 3 సింహాసనం అధిష్టించారు. కొత్త రాజు ముందు పెను సవాళ్లు ఉన్నాయని, వాటిని ఆయన ఎలా పరిష్కరిస్తారన్న దానిపై ఆయన పాలన, రాజరికం భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని నిపుణులు అంటున్నారు.

దేశంలో ఇంధన సంక్షోభం మొదలుకొని, తన తల్లి 70 ఏళ్ల సుదీర్ఘ పాలన తరువాత రాచరికంపై ప్రజల అభిప్రాయాలు మారుతున్న పరిస్థితుల వరకు ఎన్నో సవాళ్లు. కింగ్ చార్లెస్‌కు ఇది పరీక్షా సమయం.

కొత్త రాజు ఎదుర్కోబోయే కొన్ని ముఖ్యమైన సవాళ్లేమిటో చూద్దాం.

బ్రిటన్‌లోని లక్షలాది కుటుంబాలు ఇంధన సమస్యలు ఎదుర్కుంటున్నాయి. యుక్రెయిన్ యుద్ధం కారణంగా ఇంధన ధరలు అమాంతరం పెరిగిపోవడంతో కొరత ఏర్పడింది.

ఇలాంటి సమయంలో రాజకుటుంబం ఆర్థిక వ్యవహారాలను ఇంతకుముందు కంటే మరింత నిశితంగా పరిశీలిస్తారు.

వాస్తవానికి, యుక్రెయిన్ యుద్ధానికి ముందే రాజరికపు ఆడంబరాలను, వేడుకలను (తన పట్టాభిషేకం లాంటివి) తగ్గించాలని అప్పటి ప్రిన్స్ ఆఫ్ వేల్స్ (ఇప్పడు రాజు) భావించినట్టు బ్రిటిష్ ప్రెస్‌లో కొన్ని పుకార్లు వచ్చాయి.

1953లో క్వీన్ ఎలిబజెత్ 2 పట్టాభిషేకం కంటే, కొత్త రాజు పట్టాభిషేకం భిన్నంగా ఉంటుందని డైలీ టెలిగ్రాఫ్ వార్తాపత్రిక సెప్టెంబర్ 13న అంచనా వేసింది. 1953లో రాణి ఎలిజబెత్ పట్టాభిషేకం టీవీలో ప్రసారమైంది. రాజరికపు వేడుకలు టీవీలో రావడం అదే తొలిసారి.

కింగ్ చార్లెస్ 3 పట్టాభిషేకం “తక్కువ ఖర్చుతో”, ముఖ్యంగా బ్రిటిష్ సమాజంలోని వైవిధ్యాన్ని ప్రతిబింబించేలా బహుళ సంస్కృతిని కలుపుకుని రాయల్ సోర్సులను ఉటంకిస్తూ డైలీ టెలిగ్రాఫ్ పేర్కొంది.

రాచరికం పరిధిని తగ్గించాలనే తన కోరికను కింగ్ చార్లెస్ గతంలో ప్రస్తావించారు. అంటే కింగ్, క్వీన్ కన్సోర్ట్ కామిలా, ప్రిన్స్ విలియం, ఆయన భార్య కేథరీన్‌తో కూడిన ఒక చిన్న ప్రధాన సమూహం వర్కింగ్ రాయల్స్‌గా ఉంటారన్నది ఆయన ఉద్దేశం కావచ్చు.

“చాలా అంశాలు, ముఖ్యంగా పట్టాభిషేకం ఆడంబరాలు తగ్గే అవకాశాలు చాలా ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో తాము చూస్తున్నామని, తమకు తెలుసని రాజరికం నిరూపించుకోవాలి” అని రాయల్ హిస్టారియన్ కెల్లీ స్వాబ్ బీబీసీతో అన్నారు.

రాజ కుటుంబం ఆర్థిక వ్యవహారాలు సంక్లిష్టమైన అంశం. ఇది, తరచుగా రాచరిక వ్యతిరేక వాదనలలో పొడజూపుతుంటుంది. నిధులు ప్రధానంగా పన్ను చెల్లింపుదారుల నుంచి వస్తాయన్నది రాజరికానికి వ్యతిరేకించే వారి వాదన. దీనినే సావరిన్ గ్రాంట్ అని పిలుస్తారు.

2021-2022 సంవత్సరానికి ఈ గ్రాంటును 99.8 మిలియన్ డాలర్లు(సుమారు రూ.796 కోట్లు)గా సెట్ చేశారు. అంటే బ్రిటన్‌లో ఒక్కో వ్యక్తికి 1.49 డాలర్లు అన్నమాట. కానీ ఇందులో రాజకుటుంబ సభ్యులకు సంబంధించిన ముఖ్యమైన భద్రతా ఖర్చులు ఉండవు.

గత 30 ఏళ్లల్లో ఎన్నడూ లేనంతగా ప్రజల్లో రాచరికానికి మద్దతు తగ్గిపోయిందని బ్రిటిష్ సోషల్ ఆటిట్యూడ్స్ సర్వే చెబుతోంది. బ్రిటిష్ జనాభాలో రాజకుటుంబం పట్ల ఉన్న అభిప్రాయాలను క్రమం తప్పకుండా కొలిచే సర్వే ఇది.

2021లో వెలువడిన సర్వే తాజా సంచికలో, బ్రిటిష్ జనాభాలో కేవలం 55 శాతం మాత్రమే రాచరికం ఉండడం “చాలా ముఖ్యం” అని భావిస్తున్నారని తేలింది. గత దశాబ్దాలలో రాచరికానికి మద్దతు 60 – 70 శాతాల మధ్య ఊగిసలాడేది.

ఈ ఏడాది మేలో జరిపిన ఒక సర్వేలో, ప్రజల అభిమాన రాజకుటుంబీకుల్లో మొదట క్వీన్ ఎలిజబెత్ 2, తరువాత కింగ్ చార్లెస్ పెద్ద కొడుకు ప్రిన్స్ విలియం ఉండగా, మూడవ స్థానంలో కింగ్ చార్లెస్ ఉన్నారు.

అయితే, క్వీన్ ఎలిజబెత్ 2 మరణం తరువాత నిర్వహించిన పోల్స్‌లో కింగ్ చార్లెస్‌కు మద్దతు పెరిగినట్టు కనిపించింది.

“నేటి యువతరానికి రాచరికం పట్ల ఆసక్తి కలిగించడం కింగ్ చార్లెస్ 3 ముందున్న సవాళ్లల్లో ఒకటి” అని రాయల్ చరిత్రకారుడు రిచర్డ్ ఫిట్జ్‌విలియమ్స్ అన్నారు.

బ్రిటిష్ సోషల్ ఆటిట్యూడ్స్ సర్వేలో కూడా ఇదే విషయం వెల్లడైంది. 18-34 ఏళ్ల వయసువారిలో కేవలం 14 శాతం మాత్రమే రాచరికం ముఖ్యమని భావిస్తున్నారు. 55 ఏళ్లు పైబడిన వారిలో 44 శాతం రాచరికం ప్రాముఖ్యాన్ని అంగీకరిస్తున్నారు. కాబట్టి యువతరానికి రాచరికం పట్ల ఆకర్షణ పెంచడం కింగ్ చార్లెస్‌కు సవాలే.

మేలో జరిపిన యూగవ్ (YouGov) పోల్ ప్రకారం, 27 శాతం ప్రజలు రాచరికాన్ని పూర్తిగా రద్దు చేయాలని కోరుకున్నారు. ఇదివరకు 15 శాతం ప్రజలు రాచరికాన్ని రద్దు చేయాలని కోరుకున్నట్లు పలు సర్వేలలో తేలింది. ఇప్పుడు 27 శాతం అంటే, రాచరికానికి వ్యతిరేకత బాగా పెరిగనట్టే లెక్క. ముఖ్యంగా యువతలో వ్యతిరేకత పెరుగుతోందని వెల్లడైంది.

“1952 నుంచి పరిస్థితులు చాలా మారిపోయాయి. రాచరికానికి వ్యతిరేకంగా నిరసనల వెల్లువ పెరిగింది. రాజ కుటుంబం ఆర్థిక వ్యవహారాల పరిశీలన మరింత పెరిగింది. కింగ్ చార్లెస్ 3 దీన్ని దృష్టిలో ఉంచుకోవాలి” అని కెల్లీ స్వాబ్ అన్నారు.

కింగ్ చార్లెస్ 3 యూకే స్టేట్ హెడ్. కానీ బ్రిటిష్ రాచరిక రాజ్యాంగ ప్రకారం, సార్వభౌమాధికారం అనేది ప్రతీకాత్మకం, సంప్రదాయం. అంటే రాజకుటుంబ సభ్యులు రాజకీయంగా తటస్థంగా ఉంటారని భావిస్తారు.

‘ఫిర్యాదులు చేయవద్దు, వివరణలు ఇవ్వద్దు’ అనేది క్వీన్ ఎలిజబెత్ 2 పాటించిన నియమం. దీనివల్లే ఆమె ఎంతో సంయమనంతో వ్యవహరించినట్టు చాలామందికి కనిపించారు.

అయితే, కింగ్ చార్లెస్ గతంలో తనకు సంబంధించిన అనేక అంశాలపై చాలాసార్లు మాట్లాడారు. సాయుధ దళాల ఆర్థిక వ్యవహారాల నుంచి హెర్బల్ మెడిసిన వరకు అనేక సమస్యలపై ఆందోళన వ్యక్తం చేస్తూ చార్లెస్ ప్రభుత్వ మంత్రులకు పదుల సంఖ్యలో లేఖలు రాసినట్లు 2015లో వెల్లడైంది.

మరి, ఇప్పుడు ఆయన వైఖరి మారుతుందా?

“ఆయన శైలి మారాలి. ప్రచారం చేసే రాజును ప్రజలు కోరుకోరు” అని ప్రముఖ బ్రిటన్ రాజ్యాంగ నిపుణుడు ప్రొఫెసర్ వెర్నాన్ బోగ్డనోర్ అన్నారు.

కొత్త రాజు సెప్టెంబర్ 12న పార్లమెంటు సభ్యులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, సర్దుబాటు విధానం ఉంటుందనే సంకేతాలు ఇచ్చారు. అలాగే, ఇకపై కొన్ని అంశాలపై దృష్టి పెట్టబోననీ సూచించారు.

బ్రిటిష్ ప్రజాస్వామ్యానికి పార్లమెంటు “ఊపిరి తీసుకునే, సజీవ ఉపకరణం” అని కింగ్ చార్లెస్ 3 అన్నారు.

రాణి ఎలిజబెత్ 2 చనిపోయాక, కింగ్ చార్లెస్ 3 కామన్వెల్త్ హెడ్ అయ్యారు. కామన్వెల్త్‌లో 56 దేశాలు ఉన్నాయి. వీటిలో చాలా దేశాలు గతంలో బ్రిటిష్ వలస రాజ్య పాలన కింద ఉన్నవే.

అలాగే, కింగ్ చార్లెస్ 3 ఆస్ట్రేలియా, కెనడా, జమైకా న్యూజీలాండ్‌ సహా మరో 14 దేశాలకు అధిపతి కూడా.

అయితే, గత కొన్నేళ్లల్లో కామన్వెల్త్ దేశాల్లో తమ దేశాలకు, బ్రిటిష్ సింహాసనానికి ఉన్న సంబంధంపై ఒక చర్చ ప్రారంభమైంది. ఇందులో భాగంగానే, 2021 చివర్లో బార్బడోస్ గణతంత్ర దేశంగా ప్రకటించుకుంది. అంటే ఆ దేశంపై బ్రిటన్ రాణి అధికారాలకూ, శతాబ్దాలుగా ఆ దేశంపై బ్రిటన్ ప్రభావానికి ముగింపు పలికినట్టు లెక్క.

2022 ప్రారంభంలో ప్రిన్స్ విలియం (ప్రస్తుతం ప్రిన్స్ ఆఫ్ వేల్స్) కరీబియన్ పర్యటన వలసవాద వ్యతిరేక నిరసనలను రేకెత్తించింది. బానిసత్వానికి పరిహారం చెల్లించాలనే డిమాండ్ వినిపించింది. జమైకన్ ప్రధాన మంత్రి ఆండ్రూ హోల్నెస్, తమ దేశం బ్రిటిష్ గొడుగు నుంచి బయటికొచ్చి “ముందుకు సాగుతుంది” అని ప్రిన్స్ విలియంతో బహిరంగంగా చెప్పారు.

కామన్వెల్త్ దేశాలతో సరికొత్త సంబంధాలను ఏర్పరచుకోవడం అనేది కొత్త రాజు ముందున్న పెద్ద సవాలు అని బీబీసీ రాయల్ కరస్పాండెంట్ సీన్ కాఫ్లన్ అభిప్రాయపడ్డారు.

73 ఏళ్ల కింగ్ చార్లెస్ బ్రిటిష్ సింహాసనాన్ని అధిష్టించిన అతిపెద్ద వయస్కుడు. రోజువారీ పాలనలో ఆయన ఎంతవరకు రాజ్యభారాన్ని మోయగలరన్నది ప్రశ్న.

కింగ్ చార్లెస్ 3 కొడుకు, ఆయన తదనంతరం కాబోయే రాజు ప్రిన్స్ విలియం కొంత భారాన్ని పంచుకుంటారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా విదేశీ ప్రయాణాల వంటివి. క్వీన్ ఎలిజబెత్ 2 కూడా 80 ఏళ్లు దాటాక విదేశీ ప్రయాణాలు మానేశారు.

“చార్లెస్ వృద్ధ రాజు. మొత్తం భారం ఆయన మోయలేరు. ప్రిన్స్ విలియం ఎక్కువగా భాగం పంచుకుంటారని నేను భావిస్తున్నా” అన్నారు కెల్లీ స్వాబ్.

క్వీన్ ఎలిజబెత్ 2 ప్రజల్లో ప్రసిద్ధి పొందిన రాణి. ఆవిడ చనిపోయిన తరువాత ఆ దేశం నలుమూలల నుంచి వ్యక్తమయిన విచారం చూస్తే ఈ విషయం అర్థమవుతుంది.

అదే కొత్త రాజుకు పెద్ద సవాలు. అంత పాపులారిటీ ఉన్న రాణి తరువాత సింహాసనం అధిష్టించడం కొత్త రాజుకు సవాలే గానీ అధిగమించలేనిది కాదని రాయల్ హిస్టారియన్ ఎవలిన్ బ్రూటన్ అభిప్రాయపడ్డారు.

1901లో విక్టోరియా రాణి చనిపోయిన తరువాత రాజైన ఎడ్వర్డ్ 7ను గుర్తు చేశారామె.

“విక్టోరియా శకానికి, ప్రస్తుత కాలానికి చాలా పోలికలు కనిపిస్తున్నాయి. ఎడ్వర్డ్ 7, చార్లెస్ 3 కూడా బ్రిటన్‌లో సాంఘిక మార్పులు వస్తున్న సమయంలో రాజులయ్యారు. ఇద్దరూ వారి తల్లులంత పాపులర్ కాదు” అని బ్రూటన్ అన్నారు.

ఎడ్వర్డ్ 7 కేవలం తొమ్మిదేళ్లు (1901-1910) మాత్రమే రాజుగా ఉన్నారు. కానీ, ఆయన్ను ప్రజలు ఎంతో ప్రేమగా గుర్తుచేసుకుంటారు. ఎందుకంటే, 1904లో బ్రిటన్, ఫ్రాన్స్‌ల మధ్య కుదిరిన ప్రతిష్టాత్మక ఒప్పందాల సీరీస్ ‘ఎంటెంటె కార్డియేల్‌’కు పునాది వేసిన దౌత్య సంబంధాలను నెరపిన రాజు ఆయన.

“ఎడ్వర్డ్ 7 ఎంతో బాగా పాలన చేశారు. కింగ్ చార్లెస్ 3 కూడా ముఖ్యమైన రాజుగా గుర్తింపు పొందలేకపోవచ్చని చెప్పడానికి ఆధారాలేమీ లేవు. ఆయనకు తన తల్లి క్వీన్ ఎలిజబెత్ 2 గొప్ప రోల్ మొడల్. రాజ్యపాలనకు సిద్ధం కావడానికి కావలసినంత సమయం కూడా ఆయనకు దక్కింది” అన్నారు బ్రూటన్.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)