క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియలు: 125 సినిమా థియేటర్లల్లో ప్రత్యక్ష ప్రసారం

లండన్: బ్రిటన్ మహారాణి క్వీన్ ఎలిజబెత్ 2 పార్థివ దేహానికి ఇవ్వాళ అంత్యక్రియలను నిర్వహించనున్నారు. అధికారిక లాంఛనాలతో వాటిని నిర్వహించనుంది బ్రిటన్ ప్రభుత్వం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సహా వివిధ దేశాధినేతలు, ప్రధానమంత్రులు ఈ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఎలిజబెత్ పార్థివ దేహానికి నివాళి అర్పించారు. కింగ్ ఛార్లెస్‌ను ద్రౌపది ముర్ము మర్యాదపూరకంగా కలిశారు.

అంతిమయాత్రలో భాగంగా ఎలిజబెత్ పార్థివదేహాన్ని మొదట వెస్ట్‌మినిస్టర్ అబేకు తీసుకెళ్తారు. అక్కడ వేలాది మంది ప్రజల సమక్షంలో కొన్ని మతపరమైన కార్యక్రమాలను చేపడతారు. అనంతరం విండ్సర్ క్యాజిల్‌లో పార్థివ దేహాన్ని ఖననం చేస్తారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు పరిమితంగా దీనికి హాజరు కానున్నారు. 1965లో విన్‌స్టర్ చర్చిల్ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో జరిగాయి. ఆ తరువాత మళ్లీ ఆ స్థాయిలో ఈ కార్యక్రమం చోటు చేసుకోవడం ఇదే తొలిసారి.

ఈ నెల 8వ తేదీన క్వీన్ ఎలిజబెత్ 2 కన్నుమూసిన విషయం తెలిసిందే. స్కాట్లాండ్‌లోని బల్మోరల్ క్యాజిల్‌లో ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమె పార్థివ దేహాన్ని అక్కడి నుంచి లండన్‌కు తీసుకొచ్చారు. 11 రోజుల పాటు సంస్మరణ కార్యక్రమాలను నిర్వహించింది లండన్ ప్రభుత్వం. ఇవ్వాళ అంత్యక్రియలను నిర్వహించనుంది.

లండన్‌ నడిబొడ్డున ఉన్న వెస్ట్‌మినిస్టర్ హాల్‌లో చేపట్టిన క్వీన్ లైయింగ్-ఇన్-స్టేట్ కార్యక్రమం ఈ తెల్లవారు జామున ముగిసింది. అంతిమయాత్ర, అంత్యక్రియల కార్యక్రమాలను బ్రిటన్‌వ్యాప్తంగా 125 సినిమా థియేటర్లల్లో ప్రత్యక్ష ప్రసారం చేయడానికి బ్రిటన్ ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. పార్కులు, ప్రముఖ కూడళ్లు, క్యాథడ్రెల్స్‌లల్లో కూడా ఇది లైవ్ టెలికాస్ట్ కానుంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ప్రజలు దీన్ని తిలకిస్తారనే అంచనాలు ఉన్నాయి.

అంతిమయాత్ర వెళ్లే మార్గంలో రాయల్ నేవీ, రాయల్ మెరైన్స్ సిబ్బంది ఇరువైపులా నిల్చుని నివాళి అర్పిస్తారు. పార్లమెంట్ స్క్వేర్ మీదుగా ఈ యాత్ర సాగుతుంది. అక్కడ బ్రిటన్ నేవీ, ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ అధికారులు గార్డ్ ఆఫ్ హానర్ ఇస్తారు. స్కాటిష్, ఐరిష్ రెజిమెంట్స్ ముందుండి యాత్రను నడిపిస్తాయి. 200 మంది రాయల్ మెరైన్స్, రాయల్ ఎయిర్ ఫోర్స్ మ్యుజీషియన్స్ సంతాప సంగీతాన్ని వినిపిస్తారు.