కోమటిరెడ్డికి హ్యాండిచ్చిన నాయకులు..!

కేంద్ర ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలో తెలంగాణ విమోచ‌న దినోత్స‌వాన్ని హైద‌రాబాద్‌లో ఘ‌నంగా నిర్వ‌హించారు. స‌ర్దార్ ప‌టేల్‌తో తెలంగాణ‌కు విమోచ‌నం వ‌స్తే, న‌రేంద్ర‌మోడీ నిర్ణ‌యంవ‌ల్లే ప్ర‌జ‌లు ఉత్స‌వాలు చేసుకోగ‌లుగుతున్నార‌ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. అనంత‌రం ఆయ‌న పార్టీ నాయ‌కుల‌తో ప్ర‌త్యేక స‌మావేశాన్ని నిర్వ‌హించారు. మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక‌కు సంబంధించి పూర్తిస్థాయిలో చ‌ర్చించారు. ఈ సంద‌ర్భంగా నియోజ‌క‌వ‌ర్గంలో గంద‌ర‌గోళ వాతావ‌ర‌ణం నెల‌కొందంటూ అమిత్ షా పార్టీ నాయ‌కుల‌పై సీరియ‌స్ అయిన‌ట్లు తెలుస్తోంది.

మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి పార్టీకి, శాసనసభ స‌భ్య‌త్వానికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఆయ‌న చేరేట‌ప్పుడు త‌న‌తోపాటు నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న ద్వితీయ శ్రేణి నాయ‌కులంతా స‌హ‌క‌రిస్తామ‌న్నార‌ని, పార్టీలో చేరతామన్నారనే భరోసాను అమిత్ షాకు ఇచ్చారు. వెంట‌నే ఆయ‌న‌కు టికెట్ ప్ర‌క‌టించారు. తీరా ఇప్పుడు గ్రౌండ్ లెవ‌ల్‌కు వెళితే ఆయన‌కు స‌హ‌క‌రిస్తామ‌ని చెప్పిన నాయ‌కుల్లో ఒకరిద్దరు మినహా ఇతరులంతా బీజేపీలో చేర‌డానికి నిరాక‌రిస్తున్నారని, వారంతా కాంగ్రెస్ పార్టీలోనే కొన‌సాగుతామని చెప్పినట్లు సమాచారం. దీంతో రాజ‌గోపాల్‌రెడ్డి ఏం చేయాలో పాలుపోని స్థితికి చేరారు.

ఉప ఎన్నిక షెడ్యూల్ ప్ర‌క‌టిస్తే కోమ‌టిరెడ్డి నామినేష‌న్ వేస్తారు.. గెలుపు బీజేపీదే అనుకుంటున్న తరుణంలో వలసలన్నీ ఆగిపోవడంతో అమిత్ షా రాష్ట్ర నాయకత్వంపై సీరియస్ అయ్యారని, పార్టీలోకి వలసలను ప్రోత్సహించే విషయంమీదే ప్ర‌ధానంగా చ‌ర్చ జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్ మ‌ధ్య త్రిముఖ పోరు జ‌రిగితే బీజేపీ గెలుపు క‌ష్ట‌మ‌ని, అలా కాకుండా టీఆర్ఎస్‌, బీజేపీ మ‌ధ్యే ముఖాముఖి పోరు జ‌రిగితే బీజేపీ గెలుపు ఖాయ‌మ‌ని, హుజూరాబాద్‌లో కూడా ఇదే జ‌రిగింద‌ని చ‌ర్చ జ‌రిగింది.

మునుగోడులో కూడా గెలుపు అనుమాన‌ంలో పడటంతోపాటు వ‌ల‌స‌లను ప్రోత్స‌హించ‌డంలో పూర్తిగా విఫ‌ల‌మ‌య్యారంటూ నేత‌ల‌పై షా మండిప‌డ్డారు. ప్ర‌తి గ్రామంలో త్రిస‌భ్య క‌మిటీని వేసి వ‌ల‌స‌ల‌ను ప్రోత్స‌హించాల‌ని ఆదేశించారు. షెడ్యూల్ ప్ర‌క‌టించేలోగా ఇత‌ర పార్టీల‌కు చెందిన నాయ‌కుల‌ను బీజేపీలోకి చేర్పించే కార్యక్రమం ముమ్మరమవ్వాలని సూచనలు, సలహాలు ఇచ్చారు. మళ్లీ తక్కువ వ్యవధిలోనే మరోసారి సమావేశం నిర్వహిస్తానని, అప్పటికి పరిస్థితులన్నీ చక్కబడాలని స్పష్టం చేశారు.