కాంగ్రెస్ అధ్యక్షుడి రేసులో శశిథరూర్: గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సోనియా గాంధీ, ట్విస్ట్

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక కోసం ఆ పార్టీ కసరత్తులు వేగవంతం చేసిన క్రమంలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ సోమవారం పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు కాంగ్రెస్ తాత్కాలిక అధినేత్రి సోనియా గాంధీ నుంచి ఆమోదం లభించింది. 2020లో సంస్థాగత పునర్నిర్మాణాన్ని కోరుతూ గాంధీకి లేఖ రాసిన 23 మంది నాయకుల బృందంలో థరూర్ ఉన్న విషయం తెలిసిందే.

కాగా, అంతకుముందు రోజు కాంగ్రెస్ చీఫ్‌ సోనియా గాంధీని ఆమె నివాసంలో కలిశారు శశిథరూర్. సోనియా గాంధీతో తన భేటీలో థరూర్ అంతర్గత ప్రజాస్వామ్యాన్ని మరింత పటిష్టం చేయగలనని చెప్పారని ఏఎన్ఐ పేర్కొంది.

రాహుల్‌గాంధీని మళ్లీ పార్టీ అధ్యక్షుడిగా చేయాలంటూ కాంగ్రెస్‌లో ప్రచారం పెరుగుతున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. దాదాపు అర డజను రాష్ట్ర యూనిట్లు రాహుల్‌ను ఉన్నత పదవికి ఎదగాలని కోరాయి. అయితే రాహుల్‌కు ఈ పదవి దక్కుతుందా లేదా అన్నది ఇంకా అనిశ్చితి, ఉత్కంఠ నెలకొంది.

ఎన్నికల నామినేషన్ల దాఖలు ప్రక్రియ సెప్టెంబర్ 24 నుంచి 30 వరకు జరగనుంది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 8, అవసరమైతే ఎన్నికలను అక్టోబర్ 17న నిర్వహిస్తారు. ఫలితాలు అక్టోబర్ 19న వెలువడనున్నాయి.

అంతకుముందు రోజు, కాంగ్రెస్‌లో “నిర్మాణాత్మక సంస్కరణలు” కోరుతూ యువ పార్టీ సభ్యుల బృందం చేసిన పిటిషన్‌ను థరూర్ ఆమోదించారు.
థరూర్ ట్విట్టర్‌లో పంచుకున్న పిటిషన్ సంస్కరణలను కోరింది. ఏఐసీసీ అధ్యక్ష అభ్యర్థులు ఎన్నికైతే ఉదయపూర్ డిక్లరేషన్‌ను పూర్తిగా అమలు చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.

“పార్టీలో నిర్మాణాత్మక సంస్కరణలు కోరుతూ కాంగ్రెస్ యువ సభ్యుల బృందం పంపిన ఈ పిటిషన్‌ను నేను స్వాగతిస్తున్నాను. ఇది ఇప్పటివరకు 650 సంతకాలను సేకరించింది. దానిని ఆమోదించడం, దానిని దాటి వెళ్ళడం నాకు సంతోషంగా ఉంది” అని థరూర్ ట్వీట్ చేశారు.

కాంగ్రెస్ ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారం.. కొత్త వ్యక్తులకు అవకాశం ఇవ్వడానికి ఏ వ్యక్తి ఐదేళ్లకు మించి ఒక పార్టీ పదవిలో ఉండకూడదు’. ఇంకా, కాంగ్రెస్ పార్టీ ‘1 వ్యక్తి, 1 పోస్ట్’, ‘1 కుటుంబం, 1 టికెట్’ నిబంధనలను రైడర్‌లతో అమలు చేస్తుంది. 5 సంవత్సరాల పార్టీ పని తర్వాత మాత్రమే రెండవ కుటుంబ సభ్యునికి టిక్కెట్టును అమలు చేస్తుంది.