ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మాస్ట‌ర్ స్కెచ్‌!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌లు షెడ్యూల్ ప్ర‌కారం 2024 ఏప్రిల్‌లో జ‌రుగుతాయి. కానీ రాష్ట్రంలోని రాజ‌కీయ వాతావ‌రణాన్ని ప‌రిశీలిస్తే ఇప్పుడా, ఈ క్ష‌ణ‌మా అన్న‌ట్లుగా ఉంది. అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతోపాటు ప్ర‌తిప‌క్షంలో ఉన్న తెలుగుదేశం, జ‌న‌సేన కూడా ఎన్నిక‌లు ఎప్పుడు వ‌చ్చినా ఎదుర్కోవ‌డానికి స‌మాయ‌త్త‌మ‌వుతున్నాయి. అందుకు త‌గ్గ వ్యూహాల‌ను ఖ‌రారు చేసుకుంటున్నాయి.

రెండోసారి అధికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌నే నమ్మకంతో ఆ పార్టీనేతలున్నారు. దీంతో 175 నియోజ‌క‌వ‌ర్గాల్లోను సీట్ల కోసం పోటీ పెరుగుతోంది. ముగ్గురు అభ్యర్థులు పోటీపడే స్థానాలు కూడా ఉన్నాయి. ఇంత పోటీలో అస‌మ్మ‌తి ఉంటే పార్టీకి న‌ష్టం క‌లుగుతంద‌నే భావ‌న‌లో జ‌గ‌న్ ఉన్నారు. 2019 ఎన్నిక‌ల సమ‌యంలో అభ్య‌ర్థిని ఎంపిక చేయ‌డానికి జ‌గ‌న్ చాలా క‌స‌ర‌త్తు చేశారు. కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇద్ద‌రిని, మ‌రికొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ముగ్గురిని బాధ్యులుగా పెట్టారు. చివ‌రి నిముషంలో సీటివ్వ‌డానికి ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ స‌ల‌హాను ఉప‌యోగించుకున్నారు.

పోటీ ఎక్కువ‌గా ఉన్న‌చోట నాణ్య‌త మెరుగుప‌డుతుందని భావిస్తారు. స‌రిగ్గా జ‌గ‌న్ కూడా అదే సూత్రాన్ని ఉప‌యోగించుకొంటున్నారు. అభ్య‌ర్థిని ఎంపిక చేయ‌డానికి దీన్నే కొల‌బ‌ద్ద‌గా భావిస్తున్నారు. అధికారంలో ఉన్న ఎమ్మెల్యేల‌ప‌ట్ల వ్య‌తిరేక‌త ఉంటుంది కాబ‌ట్టి దాన్ని అధిగ‌మించ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

అధికార పార్టీగా స‌హ‌జంగా ఉండే వ్య‌తిరేక‌త‌ను అనుకూలంగా మార్చుకోవాల‌నుకుంటున్నారు. ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యేతోపాటు అబ్జ‌ర్వ‌ర్ ఉండేలా చూస్తున్నారు. కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో అడిష‌న‌ల్ ఇన్‌ఛార్జిలు కూడా ఉంటున్నారు. ఒక్కో నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యేతోపాటు ఇన్‌ఛార్జి, అబ్జర్వర్ కలిపి ముగ్గురు నేతలంటున్నారు. ఇక్కడే జగన్ ఒక మెలిక పెట్టారు.

వీళ్లల్లో ఎవరికి సీటిస్తారనేది ఇప్పుడే చెప్పడంలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా సీటిస్తారని భావించడానికి కూడా వీల్లేదు. పనితీరు ఆధారంగానే బీఫారం దక్కుతుందని ఆయన చెప్పేశారు. నియోజకవర్గంలో సర్వే నిర్వహించి రిలో ఏ నాయకుడి పేరు బాగుందని వస్తే వారికే ఇస్తానన్నారు. దీంతో ఒకరకంగా ఇద్దరు నేతల మధ్య పోటీ పెట్టారు. ప్రజలు వీరిలో ఎవరివైపు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారో వారికే సీటిస్తానన్నారు. వీరిలో ఎవరైతే ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి వారితో మమేకమవుతారో వారికే సీటు రాబోతోంది. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే అయినా సరే.. ఇన్ ఛార్జితో, అబ్జర్వర్ తో పోటీపడాల్సిందే.!!