26 నుంచి విశాఖ శారదాపీఠంలో శరన్నవరాత్రి మహోత్సవములు

  • ఆహ్వాన పత్రికను విడుదల చేసిన స్వరూపానందేంద్ర, టీఎస్సార్
  • నిత్యం మహిళల చేతులమీదుగా కుంకుమార్చనలు
  • 2వ తేదీన సామూహిక అక్షరాభ్యాసములు

శ్రీ శారదా స్వరూప రాజశ్యామలా అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవములు ఈనెల 26వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఉత్సవముల ఆహ్వాన పత్రికను పీఠం ప్రాంగణంలో శనివారం స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి, మాజీ ఎంపీ టీ సుబ్బరామిరెడ్డి విడుదల చేసారు. 26వ తేదీ నుంచి ప్రారంభమయ్యే శరన్నవరాత్రి మహోత్సవములు వచ్చే నెల 5వ తేదీ వరకు కొనసాగుతాయి. ఉత్సవాల్లో భాగంగా ప్రతి నిత్యం సాయంత్ర సమయంలొ మహిళలచే కుంకుమార్చనలు నిర్వహిస్తారు. ఈ పూజల్లో పాల్గొనే వారికి మంత్రించిన శ్రీ యంత్రాలను అందజేయనున్నట్లు పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి తెలిపారు. అలాగే 2వ తేదీన మూలా నక్షత్రం సందర్భంగా సరస్వతీ పూజ, సామూహిక అక్షరాభ్యాసములు నిర్వహించనున్నామని వివరించారు. అక్షరాభ్యాసాల్లో పాల్గొనే బాల బాలికలకు శారదామాత పాదాల చెంత పూజలందుకున్న పుస్తకాలను, పెన్నులను అందిస్తామని తెలిపారు. ఈ పూజల్లో పాల్గొనదలచిన భక్తులు ముందుగానే తమ పేర్లను నమోదు చేసుకోవాలని, ఇతర వివరముల కోసం 94403 93333 నెంబరుకు సంప్రదించాలని సూచించారు. శరన్నవరాత్రి మహోత్సవాల్లో ప్రతి రోజూ ఉదయం శ్రీ శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారి నిజరూప దర్శనముంటుంది. అలంకరణ లేకుండా నిజరూపంలో దర్శనమిస్తున్న రాజశ్యామల అమ్మవారికి స్వరూపానందేంద్ర స్వామి చేతులమీదుగా విశేష అభిషేకం జరుగుతుంది. అలాగే సాయంత్రం శ్రీ శారదా స్వరూప రాజశ్యామల, చంద్రమౌళీశ్వరులకు పీఠార్చన ఉంటుంది. అనంతరం సాంస్కృతిక ఆరాధన జరుగుతుంది. అమ్మవారు నిత్యం విశేష అలంకరణ మధ్య విభిన్న అవతారాల్లో దర్శనమిస్తారు. తొలిరోజు శారదా దేవి, రెండో రోజు మహేశ్వరి, మూడో రోజు వైష్ణవి, నాలుగో రోజు అన్నపూర్ణ, ఐదవ రోజు లలితా త్రిపుర సుందరి. ఆరో రోజు మహాలక్ష్మి, ఏడో రోజు మహా సరస్వతి, 8వ రోజు మహాకాళి, 9వ రోజు మహిషాసుర మర్ధిని, విజయదశమి పర్వదినాన విజయదుర్గా అమ్మవారి అవతారాల్లో దర్శనమిస్తారు. నిష్ణాతులైన అలంకార భట్టర్ల చేతులమీదుగా అమ్మవారి అలంకరణలు ఉంటాయని స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి వివరించారు. విజయదశమి పర్వదినాన శమీ వృక్షం వద్ద ఆయుధ పూజ జరుగుతుందని, శరన్నవరాత్రి మహోత్సవాల్లో అందరూ పాల్గొని రాజశ్యామల అమ్మవారి కృపా కటాక్షములు పొందాలని తెలిపారు.