హైదరాబాద్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు: అప్పుడేం జరిగింది – ఆ తరువాత ఏమైంది?

అమరావతి: రాష్ట్ర రాజకీయాలన్నీ ప్రస్తుతం మూడు రాజధానుల అంశం చుట్టే తిరుగుతున్నాయి. అమరావతి ప్రాంత రైతులు మలి దశ మహా పాదయాత్రను చేపట్టారు. అమరావతి నుంచి శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి వరకు పాదయాత్ర చేస్తోన్నారు. ఇదిలా కొనసాగుతుండగానే- ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి- మూడు రాజధానులపై తన వైఖరేమిటనేది కుండబద్దలు కొట్టారు. అసెంబ్లీ సాక్షిగా వాటి ప్రయోజనాలను వెల్లడించారు.

ఈ పరిస్థితులపై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వీ విజయసాయి రెడ్డి స్పందించారు. మూడు రాజధానులపై కీలక వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానుల వ్యవస్థ అనేది రాష్ట్రానికి గేమ్ ఛేంజర్‌గా మారుతుందని స్పష్టం చేశారు. 2020లో ఓ ఇంగ్లీష్ డెయిలీ కోసం తాను రాసిన ఆర్టికల్‌ను ఇప్పుడు మళ్లీ తెర మీదికి తీసుకొచ్చారు. ఆ ఆర్టికల్ లింక్‌ను తన అధికారిక మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌పై పోస్ట్ చేశారు.

అమరావతి ప్రాంత రైతుల పాదయాత్ర కొనసాగుతున్న వేళ.. ఈ ఆర్టికల్‌ను ఆయన షేర్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రాష్ట్ర సమతుల్యాభివృద్ధి, రాజధాని నగరాల రద్దీని తగ్గించడం, భౌగోళికంగా సమానమైన సంపద పంపిణీని నిర్ధారించడానికి బహుళ రాజధానుల వ్యవస్థ కొత్తేమీ కాదని అన్నారు. కోస్తా, రాయలసీమ వివిధ స్థాయిల్లో అభివృద్ధితో విభిన్న సంస్కృతులను కలిగి ఉన్నాయని, విశాఖపట్నం రెండు మిలియన్ల కంటే ఎక్కువ జనాభాతో, మౌలిక సదుపాయాలతో సమృద్ధిగా ఉందని పేర్కొన్నారు.

నాలుగు జిల్లాలతో కూడిన రాయలసీమ పారిశ్రామిక హబ్‌గా ఆవిర్భవించడానికి అద్భుతమైన అవకాశాలున్నాయని సాయిరెడ్డి పేర్కొన్నారు. ఖనిజ సంపదతో సమృద్ధిగా ఉందని, బెంగళూరు వంటి మహానగరాలతో అనుసంధానమై ఉందని చెప్పారు. చెన్నై-బెంగళూరు పారిశ్రామిక కారిడార్.. చిత్తూరు-అనంతపురం జిల్లాల గుండా వెళ్తోండటం వల్ల ఈ ప్రాంతం సమగ్రాభివృద్ధి చెందుతుందని చెప్పారు.

కర్నూలును న్యాయ రాజధానిగా మార్చడం ద్వారా రాయలసీమ ప్రజల చిరకాల ఆకాంక్షలను తీర్చినట్టవుతుందని సాయిరెడ్డి అన్నారు.అమరావతి విషయానికొస్తే- కృష్ణా, గోదావరి, పెన్నా ద్వారా సమృద్ధిగా నీరు అందుతోందని, ఇది సహజ వృద్ధి కేంద్రమని స్పష్టం చేశారు. చట్టసభల రాజధానిని అమరావతిలోనే కొనసాగిస్తోన్నామని, టీడీపీ చేస్తున్న అసత్య ప్రచారానికి భిన్నంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు.

తమ ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ అధికార వికేంద్రీకరణ వ్యవస్థ అనేది ఒక విప్లవాత్మక భావన చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి రాజధాని హైదరాబాద్‌లో అభివృద్ధిని కేంద్రీకృతం చేయడం వల్ల విభజన తరువాత అనేక కష్ట, నష్టాలను ఎదర్కొంటోన్నామని సాయిరెడ్డి అన్నారు. ఆ పరిస్థితి మళ్లీ తలెత్తకుండా ఉండటానికే మూడు రాజధానులను తమ ప్రభుత్వం తెర మీదికి తీసుకొచ్చిందని వివరించారు. హైదరాబాద్‌ను అన్ని ప్రాంతాల ప్రజలందరూ దశాబ్దాల కాలం పాటు అభివృద్ధి చేశారని, విభజన తరువాత నష్టపోవాల్సి వచ్చిందని చెప్పారు.

రాష్ట్రానికి ఇప్పుడు కొత్త రాజధాని అవసరం ఉందని, దాన్ని నిర్మించాలంటే అధిక వ్యయం, సమయం పడుతుందని పేర్కొన్నారు. అందుకే ఇప్పుడు అందుబాటులో ఉన్న నగరాలను రాజధానులుగా మార్చుకోవడం వల్ల ఆ ఇబ్బందులు ఉండవని చెప్పారు. అమరావతి ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుందని, అదే సమయంలో ఇతర నగరాలు కూడా అదే బాటలో నడుస్తాయని, సమతుల్యాభివృద్ధికి కొత్త నిర్వచనాన్ని ఇచ్చినట్టవుతుందని సాయిరెడ్డి అన్నారు. ఇది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దార్శనికతకు నిదర్శనమని పేర్కొన్నారు.

రాష్ట్ర రాజకీయాలు, పరిపాలన ఆరితేరిన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు మూడు రాజధానులను వ్యతిరేకించడం దురదృష్టకరమని సాయిరెడ్డి చెప్పారు. చంద్రబాబు అభివృద్ధి నమూనా ఎప్పుడూ కేంద్రీకృతమై ఉంటుందని, దాన్ని ఆయన మరోసారి నిరూపించుకున్నారని అన్నారు. ఉమ్మడి ఏపీలో తన హయాంలో చంద్రబాబు హైదరాబాద్‌తో, ప్రత్యేకంగా సైబరాబాద్‌‌ను అభివృద్ధి చేయడానికే నిమగ్నమై ఉన్నారని చెప్పారు.

ఉమ్మడి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలను నిర్లక్ష్యం చేయడం వల్ల చంద్రబాబుకు ‘హైదరాబాద్ ముఖ్యమంత్రి’ అనే పేరు వచ్చిందని విజయసాయి రెడ్డి అన్నారు. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ ఓటమికి ఇదీ ఒక కారణంగా అంచనా వేశారు. రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన తరువాత కూడా చంద్రబాబు కేంద్రీకృత అభివృద్ధికే కట్టుబడి ఉన్నారని, అమరావతిలోనే అన్ని వనరులను తీసుకుని రావాలనే ఆలోచనతో పరిపాలించారని చెప్పారు.