సీజేఐ న్యాయం చేస్తారనే నమ్మకం ఉంది – పయ్యావుల కేశవ్..!!

రాజధాని వ్యవహారం పై టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు చేసారు. రాష్ట్ర ప్రభుత్వం రాజధాని పైన హైకోర్టు ఇచ్చిన తీర్పు పై సుప్రీంలో స్పెషల్ లీవ్ పిటీషన్ దాఖలు చేసింది. దీని పైన స్పందించిన పయ్యావుల రాజధానిపై నిర్ణయం చేసే అధికారం రాష్ట్రానికి లేదని హైకోర్టు తీర్పూ వచ్చిందన్నారు. ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్ఎల్పీ తేలకుండా ఎన్నికలు వరకు వాయిదాలు వేసేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అనుమానం వ్యక్తం చేసారు. కొత్త సీజేఐకు ఏపీ వ్యవహారాల పట్ల.. సీఎం జగన్ పట్ల అవగాహన ఉందని వ్యాఖ్యానించారు.

సీజేఐ లలిత్ గతంలో జగన్ తరపున వివిధ కేసుల్లో అడ్వకేటుగా ఉండడం వల్ల ఏపీ విషయంలో పూర్తి అవగాహన ఉందని వివరించారు. ఏపీ విషయంలో పూర్తి అవగాహన ఉన్న న్యాయమూర్తి ప్రస్తుతం సీజేఐగా ఉండడం వల్ల రాజధాని విషయంలో న్యాయం జరుగుతుందని నమ్ముతున్నామని చెప్పుకొచ్చారు. ఏపీ విషయంలో పూర్తి అవగాహన ఉన్న సీజేఐ రాజధాని విషయంలో న్యాయం జరిగేలా చొరవ చూపుతారని ఆశిస్తున్నట్లు పయ్యావుల కేశవ్ ఆశాభావం వ్యక్తం చేసారు.

తాజాగా అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి వివరించిన రాష్ట్ర ఆర్దిక పరిస్థితి పైన పయ్యావుల స్పందించారు. టీడీపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీ గెంటేసి ఆర్థిక పరిస్థితిపై సీఎం జగన్ ఏదేదో లెక్కలు చెప్పారని ఎద్దేవా చేసారు. ప్రభుత్వానికి అధినేతగా ఉంటూ తానే సభలో అబద్దాలు చెప్పిన ఏకైక సీఎంగా జగన్ చరిత్రలో మిగిలిపోతారని కేశవ్ దుయ్యబట్టారు.

అధికారులిచ్చిన తప్పుడు లెక్కలని సీఎం చెప్పలేదని.. ఉద్దేశ్యపూర్వకంగానే సీఎం అబద్దాలు చెప్పారని ఆరోపించారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం పెట్టాలని గతంలో డిమాండ్ చేశామని.. ఇప్పుడూ అడుగుతున్నామని చెప్పుకొచ్చారు. ఆర్థిక పరిస్థితి బాగుంటే ఉద్యోగుల జీతాలు ఆలస్యం ఎందుకవుతున్నాయని కేశవ్ ప్రశ్నించారు.

రిటైర్మెంట్ బెనిఫిట్స్ విషయంలో రిటైర్డ్ ఉద్యోగులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని నిలదీసారు. ఉద్యోగులు చనిపోతే కర్మకాండలకిచ్చే నిధులను కూడా మళ్లించలేదా అంటూ ప్రశ్నలు కురిపించారు. ఆర్థిక వ్యవస్థ సరిగా లేని కారణంగానే బిల్లులు చెల్లించలేక మందుల సరఫరా, చిన్న పిల్లలకిచ్చే చిక్కీలు.. పాలను కూడా ఆపేసిందని విమర్శించారు.

నిరుపేదల ఇళ్ల నిర్మాణం పేరుతో వచ్చిన నిధులను మళ్లించింది నిజం కాదా అంటూ కేశవ్ ప్రశ్నించారు. పేదలకు ఇళ్లు రాకున్నా.. వారు మాత్రం ఈఎంఐలు కట్టాల్సిన పరిస్థితి వచ్చిందని విమర్శించారు. ప్రకృతి విపత్తుల నిర్వహాణ నిధులను మళ్లించారని ధ్వజమెత్తారు. కొన్ని పథకాల అమలుకు డబ్బుల్లేవని కోర్టుల్లో ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది నిజం కాదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ఈ విషయాల మీద సభలో చర్చ పెట్టాలి.. ప్రతిపక్షానికి సమయం కేటాయించాలని కేశవ్ డిమాండ్ చేసారు. స్పీకర్ ఫస్ట్ సర్వెంట్ ఆఫ్ ద హౌస్ అనే విషయాన్ని తమ్మినేని గుర్తించాలంటూ పయ్యావుల సూచించారు. పుల్ దెమ్ అవుట్ అంటూ తమ్మినేని ఎలా అంటారని ప్రశ్నించారు.