సర్జికల్ సైక్లాజికల్ గేమ్ మొదలు పెట్టాం : కీలక పరిణామాలు – సోము వీర్రాజు..!!

బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేసారు. 2024 అధికారం దక్కించుకోవటం లక్ష్యంగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. మూడు రాజధానుల వివాదం పైన స్పందించారు. రాజధాని అనేది సైలెంట్ ఫ్యూచర్ గా పేర్కొన్నారు. మూడు రాజధానులు అంటే బే పార్క్, వాల్తేర్ క్లబ్ కాదని వ్యాఖ్యానించారు. రాజధాని కోసం రైతులను రోడ్డెక్కిస్తారా అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో పార్టీలు సైక్లాజికల్ గేమ్ నడుస్తోందని వీర్రాజు చెప్పుకొచ్చారు. బీజేపీ ఏపీలో సర్జికల్ సైక్లాజికల్ గేమ్ స్టార్ట్ చేసిందని చెప్పారు.

7వేల కోట్లు ఖర్చు పెడితే రాజధాని ఏమైందని రెండు పార్టీలను ప్రశ్నిస్తున్నామన్నారు. రాష్ట్రంలో వైసీపీ .. టీడీపీ డ్రామా పార్టీలుగా మారాయని విమర్శించారు. రెండు పార్టీలు ఇప్పటి వరకు ఎనిమిదేళ్లు పాలించి రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టాయని ఆరోపించారు. రాష్ట్రంలో దిశ, దశ లేని రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.

రాష్ట్రంలో రూలింగ్ కంటే ట్రేడింగ్ జరుగుతోందని వ్యాఖ్యానించారు. వైసీపీ, టీడీపీ లు బీజేపీ తో దోబూచులాడుతున్నాయన్నారు. త్వరలో ఈ రెండు పార్టీలు కనుమరుగు అవ్వడం ఖాయమంటూ… ఆ పని బీజేపీ చేస్తుందని చెప్పుకొచ్చారు. విశాఖ నుంచే పోరుయాత్ర ప్రారంభిస్తున్నట్లు వివరించారు.

రాష్ట్రంలో ఐదు వేల సభలు పెడుతున్నామని చెప్పిన వీర్రాజు.. రాష్ట్రంలో 2కోట్ల 75లక్షల మంది వివిధ రూపాల్లో కేంద్ర ప్రభుత్వం ద్వారా బీజేపీకి సంబంధం ఏర్పడిందని వివరించారు. మిగిలిన పార్టీకి ఈ స్థాయిలో ప్రజల్లో ఆదరణ లేదని, అందుకే తమతో పొత్తు కోరుకుంటున్నాయని విశ్లేషించారు.

త్వరలో రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయని వీర్రాజు కొద్ది కాలంగా చెబుతూ వస్తున్నారు. ఏపీలో బీజేపీతో పొత్తు కోసం ఇతర పార్టీలు ప్రయత్నిస్తున్నాయని చెప్పుకొచ్చారు. దీంతో..ఇప్పుడు బీజేపీ ఏపీలో నియోజకవర్గాల వారీగా నిర్వహించనున్న సభలకు ఎలాంటి స్పందన వస్తుందనేది చూడాలి.