వై నాట్ 175: కుప్పంతోనే ఆరంభం – చంద్రబాబు ఇలాకాలో జగన్ హోరు..!!

చిత్తూరు: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడి సొంత నియోజకవర్గం కుప్పంలో పాగా వేయడానికి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. పార్టీ ఆవిర్భావం నుంచీ టీడీపీకి కంచుకోటగా ఉంటూ వస్తోన్న ఈ స్థానంలో విజయం సాధించడానికి కసరత్తు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే కుప్పం నియోజకవర్గ స్థాయి కార్యకర్తలతో సమావేశం అయ్యారు. ఇక కుప్పంలో పర్యటించనున్నారు.

2024 ఎన్నికల్లో కుప్పం పార్టీ ఇన్‌ఛార్జ్, ఎమ్మెల్సీ కేఆర్‌జే భరత్ విజయం సాధిస్తే- ఆయనకు మంత్రి పదవి సైతం ఇస్తానని వైఎస్ జగన్ కుప్పం పార్టీ కార్యకర్తలకు మాటిచ్చారు. భరత్‌ను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గం పరిధిని క్లీన్ స్వీప్ చేసిన చరిత్ర- ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో పునరావృతం చేయాల్సి ఉంటుందనీ అన్నారు. గ్రామ పంచాయతీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను సొంతం చేసుకున్నామని, అసెంబ్లీ స్థానాన్ని ఎందుకు గెలవలేమనీ చెప్పారు.

అదే సమయంలో కుప్పం నియోజకవర్గం అభివృద్ధిపై వైఎస్ జగన్ ప్రత్యేక దృష్టి సారించారు. దీనికి అనుగుణంగా నిర్ణయాలను తీసుకుంటోన్నారు. వాటిని తక్షణమే కార్యాచరణలోకి తీసుకొస్తోన్నారు.

కుప్పం మున్సిపాలిటీ అభివృద్ధి కోసం 66 కోట్ల రూపాయలను ప్రత్యేక నిధులను ప్రభుత్వం విడుదల చేశారు. కుప్పం మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి పనులను వేగవంతం చేయడానికి ఈ నిధులను కేటాయించారు. ఇదివరకు గ్రామ పంచాయతీగా ఉన్న కుప్పానికి మున్సిపాలిటీ హోదా ఇచ్చింది జగన్ ప్రభుత్వమే.

ఇక కుప్పం పర్యటనకు వైఎస్ జగన్ పూనుకున్నారు. ఈ నెల 22వ తేదీన ఆ నియోజకవర్గాన్ని సందర్శించనున్నారు. మూడో విడత వైఎస్ఆర్ చేయూత కార్యక్రమాన్ని చంద్రబాబు గడ్డ మీదే ప్రారంభించనున్నారు జగన్. గడప గడపకు ఎమ్మెల్యే కార్యక్రమంలో స్వయంగా పాల్గొననున్నారు. సంక్షేమ పథకాల అమలు తీరు, అభివృద్ధి పనులను సమీక్షించనున్నారు. 66 కోట్ల రూపాయల వ్యయంతో తలపెట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. మరి కొన్నింటిని ప్రారంభించనున్నారు.

రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలను కూడా క్లీన్ స్వీప్ చేయాలనేది వైఎస్ జగన్ లక్ష్యం. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో ఆయన స్పష్టం చేశారు. ఆ లక్ష్యానికి తొలి అడుగు కుప్పం నుంచే ఆరంభం కావాలని భావిస్తోన్నారు. దీనికి అనుగుణంగా తన భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలను రూపొందించుకుంటోన్నారు. జిల్లాల పర్యటనను కుప్పం నుంచే ఆరంభించాలని జగన్ నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. ఎలాంటి రాజకీయపరమైన కార్యక్రమాలనైనా కుప్పం నుంచే మొదలు పెట్టేలా పావులు కదుపుతున్నారని తెలుస్తోంది.