వైసీపీకి వచ్చే సీట్లు ఇవే – బస్సు యాత్ర వాయిదా : జగన్ – షర్మిల మధ్య గొడవ ఇదే – పవన్..!!

ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగా జనసేనాని పవన్ కళ్యాణ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసారు. తనకు సంబంధించిన 300 ఎకరాల కోసం కేసీఆర్ తో సమావేశమైన వేళ ఇచ్చిన కాఫీ..పెసరట్టు కోసం ఏపీకి చెందిన ఆస్తులను తెలంగాణకు ఇచ్చేసారని ఆరోపించారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు సమయంలో నిర్దేశించిన లక్ష్యాలు సాధించలేకపోయామని..ఇప్పుడు జనసేన ద్వారా సాధిస్తామని చెప్పారు. 2014లో టీడీపీకి మద్దతు వెనుక ప్రముఖ వ్యక్తుల సూచనలు ఉన్నాయని చెప్పుకొచ్చారు.

రాజధాని అమరావతి విషయంలో జగన్ మద్దతిచ్చి.. అక్కడే ఇల్లు కట్టుకుంటున్నామని చెప్పి, ఇప్పుడు మాట తప్పటం ఏంటని ప్రశ్నించారు. తాను ఓడిపోయిన వెంటనే కుమిలిపోతానని చాలా మంది అనుకున్నారని, కానీ..రాజకీయంగా అవసరమైతే మరోసారి దెబ్బ తిన్నా ముందుకే వెళ్తానని చెప్పారు.

జగన్ – ఆయన సోదరి మధ్య ఆస్తులకు సంబంధించి వివాదాలు నడిచాయని.. మీడియా సంస్థలు ..సిమెంట్ కంపెనీలు.. ఇడుపుల పాయ – బెంగుళూరు ప్యాలెస్ కు సంబంధించిన పంపకాల్లో వచ్చిన తేడాలే కారణమని ఆరోపించారు. కానీ, రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సొమ్ము మాత్ర ఇష్టానుసారం మళ్లించినా ఎవరూ ప్రశ్నించటం లేదన్నారు. 2019 ఎన్నికల్లో ప్రజలు ఏ ఆలోచనలోనే వైసీపీకి ఓట్లు వేశారని వ్యాఖ్యానించారు. 151 సీట్లు వచ్చినంత మాత్రాన మహానుభావులు కాలేరని పవన్ చెప్పుకొచ్చారు.

కనీసం 10 మంది ఎమ్మెల్యేలు జనసేనకు ఉంటే..ఇప్పుడు స్పీకర్ వెళ్లిపోమనగానే వెళ్లిపోతున్న వారి లాగా ఉండేది కాదన్నారు. అక్టోబర్ లో దసరా నుంచి ప్రారంభించాలని భావించిన రాష్ట్ర వ్యాప్త బస్సు యాత్రను వాయిదా వేస్తున్నట్లు పవన్ ప్రకటించారు. సమస్యలపైన మరింత అధ్యయనం చేసిన తరువాతనే యాత్ర చేయాలని నిర్ణయించామన్నారు.

ప్రతీ నియోజకవర్గం పైన తానే స్వయంగా సమీక్ష చేస్తానని..విజయవాడ పశ్చిమం నుంచి ప్రారంభిస్తామని పవన్ వెల్లడించారు. తనకు అందుతున్న సర్వేల ప్రకారం వైసీపీకి అత్యధికంగా 45- 67 సీట్లు వరకు దక్కే అవకాశం ఉందని చెప్పారు. 2014 ఎన్నికల్లో వైసీపీ సాధించిన సీట్లు కూడా ఇవే. జనసేనకు ప్రజల్లో ఆదరణ పెరిగినట్లు సర్వేల్లో వెల్లడైందన్నారు.

ఎన్నికల్లో జనసేన అభ్యర్ధులను పోటీ చేయనీయకుండా అడ్డుకుంటున్న వైసీపీ పైన న్యాయ పోరాటానికి జనసేన లీగల్ సెల్ సిద్దంగా ఉండాలని సూచించారు. ఎంత చెప్పినా వైసీపీ నేతల్లో మార్పు రావటం లేదన్నారు. ప్రశ్నిస్తే కేసులు..బూతులతో టార్గెట్ చేయటం అలవాటుగా మారిందని ఫైర్ అయ్యారు. ఇక తప్పని పరిస్థితుల్లో రోడ్లపైకి వస్తామని హెచ్చరించారు.

గెరిల్లా తరహా పోరాటాలు ఉంటాయన్నారు. అంటే యుద్దాలు..కాదని ప్రశ్నించటమే ఉంటుందని స్పష్టం చేసారు. నియోజకవర్గాల సమీక్ష వచ్చే నెల ప్రారంభించి..పార్టీ పరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు తీసుకుంటామన్నారు. గెలిచే అవకాశం ఉన్నవారికే ఈ సారి టికెట్లు ఇస్తామని పవన్ స్పస్టం చేసారు. ఒక్క సారి ప్రజలు తమ వైపు చూడాలని పవన్ కోరారు.