రూ.2.50 లక్షలు.. ఇదీ బాలిక ప్రాణానికి వెల, పెద్దల పంచాయతీ, చివరకు ఇలా

గ్రామాలలో ఉండే ఆర్ఎంపీ, పీఎంపీ ప్రథమ చికిత్స చేయాలి. కానీ సెలైన్ ఎక్కించడం చేస్తారు. కొందరికీ ఇబ్బందులు తప్పడం లేదు. అనారోగ్యబారిన పడుతున్నారు. కొన్నిసార్లు మృత్యువు ఒడికి చేరుకుంటారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఇలాంటి ఘటనే జరిగింది. ఓ బాలిక అనారోగ్య బారిన పడింది. స్థానిక ఆర్ఎంపీ చేసిన ట్రీట్‌మెంట్ ప్రాణాలను తీసింది. ఆ తర్వాత పెద్ద మనుషుల వద్ద ఒప్పందం జరిగింది. రూ.2.50 లక్షలకు ఆ బాలిక ప్రాణానికి వెలకట్టారు.

సిద్దిపేట జిల్లా దుబ్బాకకు చెందిన చీర్లంచ పోశెట్టి, రమ్య దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అయితే పెద్ద కూతురు అనుష్క ఏడేళ్ల క్రితం చనిపోయింది. నాలుగు నెలల క్రితం పోశేట్టి చనిపోయాడు. తల్లి రమ్య, కూతురు అక్షయ ఓ ఇంట్లో కడు పేదరికంలో ఉన్నారు. అక్షయ వారం రోజులుగా జ్వరంతో బాధపడుతుండటంతో పీఎంపీ వైద్యుడు దామోదర్‌ రెడ్డి వద్దకు చికిత్స కోసం తల్లి తీసుకెళ్లింది. నీరసంగా ఉందని చెప్పి మోతాదుకు మించి ఐరెన్‌ సుక్రోజ్‌ సూదిమందును ఐవీ గ్లూకోజ్‌‌లో కలిపి ఎక్కించాడు.

4 రోజుల క్రితం బాలిక గుండెపోటుతో చనిపోయింది. మోతాదుకు మించి సూదిమందు ఇవ్వడంతో బాలికకు గుండెపోటు వచ్చిందని జిల్లా ఉప వైద్యాధికారి శ్రీనివాస్‌, పీవోఎన్‌హెచ్‌ఎం రజిని, తిమ్మాపూర్‌ వైద్యురాలు భార్గవి ప్రాథమికంగా నిర్ధారించారు. తల్లి రమ్య మాత్రం తమ కూతురు వైద్యం వికటించి మరణించలేదని వాంగ్మూలం ఇచ్చింది.

మృతురాలి కుటుంబసభ్యు లు, బంధువులు పీఎంపీ దామోదర్‌రెడ్డిని నిలదీశారు. మధ్యవర్తుల ద్వారా బాలిక ప్రాణానికి రూ.2.50 లక్షలకు వెల కట్టినట్టు తెలిసింది. విషయం బయటకు తెలిస్తే ఆ డబ్బు ఇవ్వబోమని తల్లి రమ్యకు షరతు విధించారట. దీంతో ఆమె వాంగూల్మం ఇచ్చినట్లు తెలిసింది.

పీఎంపీ దామోదర్‌రెడ్డి బాలికకు వైద్యం చేసిన విధానాన్ని జిల్లా వైద్యాధికారుల ఎదుట లిఖితపూర్వకంగా అంగీకరించాడు. మరోవైపు ఐరెన్‌ సుక్రోజ్‌ సూదిమందును నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో వాడాలని.. అసలు ఇందులో ఐవీ గ్లూకోజ్‌ను వాడకూడదని వైద్యాధికారులు చెబుతున్నారు. దుబ్బాకలో నిబంధనలకు విరుద్ధంగా చికిత్స అందిస్తున్నారని నిర్ధారించి రత్నాకర్‌ నర్సింగ్‌ హోం, దాని పక్కన ఓ క్లినిక్‌ను అధికారులు సీజ్‌ చేశారు.