రాష్ట్రవ్యాప్తంగా

రాజ‌కీయాల్లో అధికారం చేజిక్కించుకోవ‌డ‌మంటే అంత సాధార‌ణ‌మైన విష‌య‌మేం కాదు. ఆయా పార్టీల మ్యానిఫెస్టోలు, వాటిల్లో అమ‌ల‌య్యేవి ఎన్ని ఉంటాయి? అమలు చేయలేనివి ఎన్ని ఉంటాయి? తదిత‌ర విష‌యాల‌ను ప్ర‌జ‌లు ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటారు. అస‌లు ముందు వారిద‌గ్గ‌ర‌కు చేరాలంటే ఏదో ఒక ఫార్ములా రాజ‌కీయ పార్టీల‌కు అవ‌స‌రం. దాన్ని పునాదిగా చేసుకొని పార్టీలు ప్ర‌జ‌ల చెంత‌కు చేర‌తాయి. ప్ర‌స్తుతం తెలుగుదేశం పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ”పాలకొల్లు ఫార్ములా”ను అమలు చేయాలని నిర్ణయించింది.

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా పాల‌కొల్లు నియోజ‌క‌వ‌ర్గం తాలూకు చూడండి.. పాల‌కొల్లులో ప‌నిచేసిన‌ట్లు ప‌నిచేయండి.. పాల‌కొల్లు ఎమ్మెల్యే మోడ‌ల్‌ను మీరు కూడా ఫాలో అవ్వండి.. పాల‌కొల్లులో ఎలా చేశారో రామానాయుడిని అడిగి తెలుసుకోండి.. పాల‌కొల్లులో ఎలా అమ‌లు ప‌రిచారో.. అక్క‌డ ఆయ‌న ఎలా ప‌నిచేస్తున్నారో అడ‌గండి.. ధాని వివరాం కావాలంటే పాలకొల్లులో చూడండి.. ఇదీ ప్ర‌స్తుతం ఇన్‌ఛార్జిలంద‌రికీ చంద్ర‌బాబునాయుడు చెబుతున్న మాట‌.

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం పాలకొల్లు నుంచి వ‌రుస‌గా రెండుసార్లు నిమ్మ‌ల రామానాయుడు ఘ‌న‌విజ‌యం సాధించారు. 2019 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ హ‌వాలో కూడా ఆయ‌న గెలుపొదారు. ప్ర‌తిప‌క్షంలో ఉన్నా ప్ర‌జ‌ల‌కు చేరువయ్యే కార్యక్రమాలే ఆయన నిర్వహిస్తున్నారు. నిత్యం సైకిలెక్కి ఇంటింటికీ తిరుగుతుంటారు. నియోజ‌క‌వ‌ర్గంలో ఉంటే ఆమాత్రం ప్ర‌తిరోజు సైకిల్ ఎక్కి ముందురోజు ఎక్క‌డినుంచైతే ఆపోరో అక్క‌డి నుంచి ప్రారంభిస్తారు. దీనిద్వారా ఆయ‌న ప్ర‌జ‌ల‌కు బాగా చేరువ‌య్యారు. సాధ్య‌మైనంత‌వ‌ర‌కు ఆర్థికంగా కూడా అక్క‌డి ప్ర‌జ‌ల‌కు ఆయ‌న చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. ఇత‌ర ఎమ్మెల్యేలు, నాయ‌కుల్లా కాకుండా ఆయ‌న చేసే ఒక‌టి రెండు విమ‌ర్శ‌లు కూడా ప్ర‌భుత్వాన్ని చురుక్కుమ‌నేలా త‌గులుతాయి. దీంతోపాటు పార్టీ కార్య‌క్ర‌మాల‌ను విభిన్న రీతుల్లో ముందుకు తీసుకువెళుతున్నారు

నియోజ‌క‌వ‌ర్గంలో రామానాయుడు వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. మ‌రో పార్టీ పావులు క‌ద‌ప‌డానికి అవ‌కాశం ఇవ్వ‌డంలేదు. తన ప్రత్యర్థులెవరూ బ‌లం పుంజుకోవడానికి అవకాశం ఇవ్వడంలేదు. నియోజకవర్గం మొత్తంమీద ఆయన పూర్తిస్థాయిలో పట్టు సాధించారు. చంద్ర‌బాబు సొంతంగా నిర్వ‌హించుకున్న స‌ర్వేలో ప‌క్కాగా గెలిచే నియోజ‌క‌వ‌ర్గాల్లో పాలకొల్లు ముందు వ‌రుస‌లో ఉంది. అంతేకాకుండా నిమ్మ‌ల‌కు తిరుగులేద‌ని, ఈ ఫార్ములాను 100 నియోజ‌క‌వ‌ర్గాల్లో అమ‌లుచేస్తే క‌చ్చితంగా పార్టీ పుంజుకుంటుందని ఆ సర్వే సూచించింది. దీనికి సంబంధించిన విధివిధానాలను సిద్ధం చేసి పార్టీ నేతలందరిచేత రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయించబోతున్నారు.