రంగంలో దిగిన రాజా సింగ్ భార్య..!!

హైదరాబాద్: సస్పెన్షన్‌కు గురైన గోషామహల్‌ భారతీయ జనతా పార్టీ శాసన సభ్యుడు టీ రాజా సింగ్‌ ప్రస్తుతం విచారణను ఎదుర్కొంటోన్నారు. చర్లపల్లి సెంట్రల్ జైలులో ఉంటోన్నారు. మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో హైదరాబాద్ నగర పోలీసులు ఆయనపై ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) చట్టం కింద కేసు నమోదు చేశారు. పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేశారు. కేసు నమోదైన తరువాత రాజా సింగ్‌ను బీజేపీ అధిష్ఠానం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.

మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఉదంతంలో తొలుత అరెస్టయిన రాజా సింగ్‌కు బెయిల్ లభించినప్పటికీ- అనంతరం పోలీసులు పీడీ యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు. తన భర్తపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేయడాన్ని రాజా సింగ్ భార్య టీ ఉష బాయి తప్పుపడుతున్నారు. ఈ విషయంపై ఆమె ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో సవాల్ చేశారు. కొద్ది రోజుల కిందటే పిటీషన్ దాఖలు చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 226 కింద ఈ పిటిషన్‌ దాఖలైంది.

ఇప్పుడు తాజాగా ఉష బాయి గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను కలిశారు. వినతిపత్రాన్ని అందజేశారు. మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అనంతరం తలెత్తిన పరిణామాల గురించి వివరించారు. పోలీసులు తన భర్తను అరెస్ట్ చేసే సమయంలో యథేచ్ఛగా ఉల్లంఘనలకు పాల్పడ్డారని అన్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు జారీ చేసిన సూత్రాలు, మార్గదర్శకాలను పాటించలేదని చెప్పారు. పీడీ యాక్ట్‌ కింద తన భర్తపై కేసు నమోదు చేస్తోన్న సమయంలో హైదరాబాద్ పోలీసులు నిబంధనలను ఉల్లంఘించినట్లు ఆరోపించారు.

తన భర్తను పీడీ యాక్ట్ కింద అదుపులోకి తీసుకోవడానికి సిఫారసు చేసిన సంబంధిత పత్రాలు హిందీలో లేవని ఉష పేర్కొన్నారు. నిర్బంధానికి గురైన వ్యక్తి మాతృభాషలో పీడీ యాక్ట్ ఉత్తర్వులను ప్రచురించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు, హైకోర్టు మార్గదర్శకాలు గుర్తు చేస్తోన్నాయని అన్నారు. అడ్వైజరీ కమిటీ ముందు లిఖితపూరక సమాధానం ఇవ్వడానికి హైదరాబాద్ పోలీసులు తనకు అవకాశం ఇవ్వలేదని ఆమె ఆరోపించారు.

తన భర్తను గూండాగా పోలీసులు అభివర్ణించడం పట్ల ఉష బాయి అభ్యంతరం తెలిపారు. భవిష్యత్తులో ప్రమాదకరమైన కార్యకలాపాలకు పాల్పడకుండా రాజా సింగ్‌ను పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేశామంటూ పోలీసులు చెప్పారని, చట్టవిరుద్ధమని ఆమె తన పిటీషన్‌లో పొందుపరిచారు. తన భర్తపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం రాష్ట్ర పోలీసు అధికారుల అసమర్థతకు కూడా అద్దం పట్టిందని ఆరోపించారు. శాంతిభద్రతలను నిర్వహించడంలో పోలీసు యంత్రాంగం మొత్తం విఫలమైనట్లు తాను భావిస్తున్నానని ఉషా బాయి అన్నారు.