ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన చీతాలివి, 70 ఏళ్ల తర్వాత భారత్‌లో అడుగుపెట్టాయి.

భారత్‌లో 1952లో అంతరించిపోయాయని ప్రకటించిన తర్వాత దేశంలో తిరిగి చీతాలు సంచరించనున్నాయి.

ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు సందర్భంగా నమీబియా నుంచి తీసుకొచ్చిన 8 చీతాలను శనివారం మధ్యప్రదేశ్‌లో ఉన్న కునో నేషనల్ పార్క్‌లో ప్రవేశపెట్టారు.

ఈ పులులు భారత్ లో అడుగు పెట్టిన తర్వాత నెల రోజుల పాటు ఈ నేషనల్ పార్క్‌లో ఏర్పాటు చేసిన ఎన్‌క్లోజర్‌లో క్వారంటైన్‌ చేస్తారు.

ఆ తర్వాత వాటిని జాతీయ పార్కులో విడిచిపెడతారు.

ఈ జాతి చీతాలు గతంలో ఇతర సింహాలు, పులులతో కలిసి భారత్‌లో సంచరించేవి. కానీ, 70 ఏళ్ల క్రితం ఇవి అంతరించిపోయాయి.

గంటకు 113 కిలోమీటర్ల వేగంతో పరుగుపెట్టగలిగే ఈ చీతాలు ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన జంతువులు.

ఇంత పెద్ద జంతువులను ఒక ఖండం నుంచి మరొక ఖండానికి తరలించి తిరిగి అడవిలోకి ప్రవేశపెట్టడం ప్రపంచంలో ఇదే మొదటిసారి.

దక్షిణ ఆఫ్రికా, నమీబియా నుంచి కనీసం 20 చీతాలు భారత్‌కు రానున్నాయి. ప్రపంచంలో ఉన్న 7000 చీతాల్లో మూడొంతులు ఈ దేశాల్లోనే ఉన్నాయి.

ఇందులో తొలి విడతగా 8 భారత్ కు వచ్చాయి. ఇందులో 5 ఆడ పులులు, మూడు మగ పులులు ఉన్నాయి. ఇవి 2 – 6ఏళ్ల వయసు మధ్య వయసు కలవి.

ఇవి నమీబియాలోని విండ్‌హూక్ నుంచి శనివారం గ్వాలియర్ చేరుకున్నాయి.

వీటితో పాటు వన్య ప్రాణ నిపుణులు, పశువైద్య నిపుణులు, ముగ్గురు బయాలజిస్టులు బోయింగ్ 747 విమానంలో వచ్చారు.

గ్వాలియర్ నుంచి ఈ పులులను హెలికాఫ్టర్‌లో మధ్యప్రదేశ్‌లోని కునో జాతీయ పార్కుకు తరలించారు. ప్రధానమంత్రి మోదీ వీటిని నేషనల్ పార్కులోకి విడుదల చేశారు.

289 చదరపు మైళ్ళ ప్రాంతం విస్తీర్ణంతో కూడిన కునో జాతీయ పార్కులో ఈ పులులకు ఆహారంగా జింకలు, అడవి పందులు కూడా ఉంటాయి.

చీతాలను అడవిలోకి వదిలిపెట్టే ముందు వాటిని క్వారంటైన్‌లో ఉంచేందుకు విద్యుదీకరించిన కంచెలను ఏర్పాటు చేశారు.

వీటిని పర్యవేక్షించేందుకు, వాటి కదలికలను నియంత్రించేందుకు వాలంటీర్ల బృందాన్ని నియమించారు. ఇవి సంచరించే ప్రాంతాన్ని తెలుసుకునేందుకు ప్రతీ చీతాకు శాటిలైట్ రేడియో కాలర్లను అమర్చారు.

భారతదేశంలో చీతాలు మాయమవ్వడానికి వేట, జీవావరణ నష్టం, ఆహార కరువు కారణమయ్యాయి.

వలస పాలన సమయంలో గొర్రెల, పశువుల కాపర్లు కనీసం 200 చీతాలను చంపినట్లు అధ్యయనాలు చెబుతున్నాయి.

కొన్నిటిని గ్రామాల్లోకి ప్రవేశించి పశుసంపదను నాశనం చేస్తుండటంతో వేటాడి కూడా చంపేశారు. భారతదేశం స్వతంత్రం సాధించిన తర్వాత ఇక్కడ అంతరించిపోయిన పెద్ద జంతువు చీతా మాత్రమే.

వీటిని తిరిగి దేశంలో ప్రవేశపెట్టాలని భారత్ దశాబ్ధాలుగా ప్రయత్నిస్తోంది. 1970లలో ఇరాన్ రాజు దేశం వదిలిపెట్టి వెళ్లిపోవడంతో ఇరాన్ నుంచి చీతాలను తీసుకుని రావాలని చేసిన ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి.

ఈ చీతాలు తిరిగి భారత్‌ కు తీసుకురావడం ద్వారా స్థానిక ఆర్ధిక వ్యవస్థలను బలోపేతం చేసి పెద్ద పులుల అభివృద్ధికి సహకరించే జీవావరణాలను పునరుద్ధరించే అవకాశం కలుగుతుందని ఈ ప్రాజెక్టును సమర్ధించే వారంటున్నారు.

కానీ, వీటిని తిరిగి ప్రవేశపెట్టడం వల్ల కొంత ముప్పు కూడా ఉందని కొందరు అంటున్నారు.

చీతాలు చాలా సున్నితమైన జంతువులు. వీటికి పోరాట స్వభావం తక్కువగా ఉంటుంది.

దీంతో, వేటాడే ఇతర జంతువులకు ఇవి ఆహారంగా మారతాయి. కునో జాతీయ పార్కులో ఉన్న పెద్ద పులులు చీతాలను చంపేయవచ్చు.

ఈ చీతాలు సరిహద్దులు దాటి వెళ్ళినప్పుడు వేట లేదా ఇతర జంతువుల బారిన పడి చనిపోవచ్చు.

కానీ, ఈ భయాలకు ఆధారాలు లేవని అధికారులు అంటున్నారు.

ఇవి ఏ వాతావరణానికైనా వేగంగా అలవాటు పడతాయని చెబుతున్నారు.

ఆవాసానికి, వేటకు, మనిషి- జంతువుల మధ్య ఘర్షణకు సంబంధించిన అన్ని అంశాలను నిశితంగా పరిశీలించిన తర్వాతే కునో జాతీయ పార్కును ఎంపిక చేసినట్లు అధికారులు చెప్పారు.

ప్రపంచంలోనే మొదటి సారి భారతదేశంలో మొఘల్ చక్రవర్తి జహంగీర్ పరిపాలనా కాలంలో (1556 – 1605)లో చీతాలను పెంపుడు జంతువుగా పెంచారు.

ఆయన తండ్రి అక్బర్ పాలనా కాలంలో సుమారు 10,000 చీతాలు ఉన్నట్లు నమోదు చేశారు. ఆయన 1556 – 1605 వరకు పాలించారు.

19వ శతాబ్ది నాటికి చీతాలు వందల సంఖ్యలోకి చేరినట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ చీతా భారతదేశంలో ఆఖరుసారి 70ఏళ్ల క్రితం కనిపించింది.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)