తేజస్వి యాదవ్ బెయిల్ రద్దు చేయండి, ఢిల్లీ హైకోర్టును కోరిన సీబీఐ

ఐఆర్సీటీసీ స్కాంలో బీహర్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ బెయిల్ రద్దు చేయాలని సీబీఐ ఢిల్లీ హైకోర్టును కోరింది. ఇటీవల మీడియా సమావేశంలో అధికారులను బెదిరించేలా తేజస్ యాదవ్ మాట్లాడారని కోర్టుకు సీబీఐ తెలిపింది. తేజస్వికి ప్రత్యేక న్యాయమూర్తి గీతాంజలి గోయెల్ నోటీసులు పంపారు.

హోటల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ కు సంబంధించిన 12 మంది వ్యక్తులు, రెండు కంపెనీలపై సీబీఐ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. 2006లో రాంచీ, పూరీలో ఐఆర్సీటీసీ హోటల్స్ కాంట్రాక్ట్‌లో అవకతవకలు జరిగాయని సీబీఐ ఆరోపిస్తోంది. 2018 ఆగస్టులో తేజస్వి యాదవ్, ఆయన తల్లి రబ్రీదేవిలకు బెయిల్ మంజూరు చేసింది. ఇదే కేసులో ఈడీ కూడా మనీలాండరింగ్ ఆరోపణలతో ఛార్జిషీట్ నమోదు చేసింది.

ఐఆర్‌సీటీసీ కుంభకోణంపై గతేడాది జూలై 5న సీబీఐ కేసు నమోదు చేసింది. రాంచీ, పూరీలోని ఐఆర్‌సీటీసీ హోటళ్లను రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు లాలూప్రసాద్ యాదవ్ ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టి అక్రమాలకు పాల్పడ్డారని సీబీఐ ఆరోపించింది. ఐఆర్‌సీటీసీ నిర్వహించే రెండు హోటళ్లను సుజాతా హోటల్స్ అనే ప్రైవేట్ సంస్థకు కట్టబెడుతూ ప్రతిఫలంగా పాట్నాలో బినామీ కంపెనీ పేరుతో మూడు ఎకరాల అత్యంత విలువైన స్థలాన్ని పొందారని లాలూ కుటుంబంపై ఆరోపణలు ఉన్నాయి. ఆ రెండు హోటళ్లను క్విడ్ ప్రోకో కింద ఆ సంస్థకు అప్పగించినట్లు.. టెండర్ దక్కగానే ఆ స్థలం లాలూ కుటుంబ సభ్యుల చేతుల్లోకి వెళ్లినట్లు సీబీఐ అభియోగాలు మోపింది.