చిరంజీవి నిఖార్సు – పవన్ వెన్నుపోటు పొడిచారు : ఆ రోజు జరిగిందేంటి – పేర్ని నాని ఫైర్..!!

మాజీ మంత్రి పేర్ని నాని మరోసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన ఫైర్ అయ్యారు. జనసేన పార్టీ కార్యాలయంలో లీగల్ సెల్ సమావేశంలో పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేసారు. సీఎం జగన్.. వైసీపీ ప్రభుత్వ తీరు పైన ఆరోపణలకు దిగారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 45 – 67 సీట్లు మాత్రమే వస్తాయని తేలిందని చెప్పుకొచ్చారు. దీని పైన పేర్ని నాని సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. రాజకీయ అక్టోపస్ పోయిందన్నారు. ఇప్పుడు పవన్ చిలక జోస్యం మొదలైందని ఎద్దేవా చేసారు.

ఎన్నికల్లో జనసేన ఎన్ని సీట్లకు పోటీ చేస్తారో తెలియలేదా..చిలక జోస్యంలో కేవలం వైసీపీకి వచ్చే సీట్లే తెలిశాయా అంటూ ప్రశ్నించారు. అదే సమయంలో ప్రజారాజ్యం క్లోజ్ చేయటం వలన తాము కోరుకున్న మార్పు సాధ్యపడలేదని..దీని కారణంగానే జనసేన ప్రారంభించాల్సి వచ్చిందని పవన్ చెప్పుకొచ్చారు. దీని పైన స్పందించిన పేర్ని నాని ప్రజారాజ్యం అధినేతగా వ్యవహరించిన చిరంజీవి నిఖార్సైన రాజకీయ నాయకుడిగా అభివర్ణించారు. పవన్ కళ్యాణ్ వారాంతపు రాజకీయ నాయకుడని విమర్శించారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి చాలా తప్పు చేసినట్లు పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. చిరంజీవి చెడిపోయినట్లు…తాను పత్తిత్తు అయినట్లు పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారని విశ్లేషించారు.

చిరంజీవి నిఖార్సయిన -నిక్కచ్చి రాజకీయ నాయకుడుగా..తాను గెలిచి తన పార్టీకి 18 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నారని చెప్పుకొచ్చారు. యువరాజ్యం అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ ఏం చేశారని నిలదీసారు. కనీసం రాజీనామా అయినా చేశారా అని ప్రశ్నించారు. పవన్ ఒక మనిషిగా ఎదగటానికి చిరంజీవి కారణమని పేర్ని నాని పేర్కొన్నారు. ఒక రాజకీయ నాయకుడిగా ఇప్పుడు పవన్ జబ్బలు చరుచుకోవటానికి చిరంజీవి కారణం కాదా అని నిలదీసారు. అటువంటి చిరంజీవిని వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. చిరంజీవి రాజకీయంగా తప్పు చేసారంటూ పవన్ చెబుతున్నారని.. పీఆర్పీ ఓడగానే పవన్ ఎక్కడా కనిపించలేదన్నారు. పవన్ వలన లాభ పడించి చంద్రబాబు..లోకేశ్ మాత్రమేనని చెప్పుకొచ్చారు. చంద్రబాబును పవన్ నయవంచకుడు అన్నారని..అటువంటి వ్యక్తికి ఎలా మద్దతిచ్చావని నాని ప్రశ్నించారు.

పదేళ్ళ పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండేటట్లు కేంద్రం చట్టం చేసిందని, ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్‌గా దొరికి పోయి అది అర్ధరాత్రి పారిపోయి వచ్చింది మీ బాస్ కాదా అని పేర్ని నాని దుయ్యబట్టారు. హైదరాబాద్‌లో ఆస్తులు వదిలేసి వచ్చిన చంద్రబాబును ఎందుకు అడరంటూ పవన్ ను ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ ఎక్స్‌పైరీ డేట్ గురించి మాట్లాడుతున్నారని చెబుతూ..ప్రతి వస్తువుకు, వ్యక్తికి ఎక్స్‌పైరీ డేట్ లానే పని తీరు ఇండెక్స్ కూడా ఉంటుందన్నారు. పవన్ కళ్యాణ్ వలన వారిద్దరికీ మినహా ప్రజలకు ఏం లాభమని అడిగారు. ప్రజారాజ్యాన్ని కొనసాగించాలని మీ అన్నను కలిసి ఒక్కసారైనా మాట్లాడారా చెప్పాలన్నారు. పవన్ ను వీకెండ్ పొలిటీషియన్ గా పేర్ని నాని అభివర్ణించారు.