చిన్నారికి చెప్పు తొడిగిన రాహుల్ గాంధీ

కాంగ్రెస్‌ చేపట్టిన భారత్‌ జోడో యాత్రకు విశేష స్పందన వ్య‌క్త‌మ‌వుతోంది. పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ అధ్యక్షతన చేప‌ట్టిన యాత్ర 11వ రోజుకు చేరుకుంది. కేళలోని హరిపద్‌లో యాత్ర ప్రారంభమ‌వ‌గా రాహుల్ గాంధీ ప్రజలకు అభివాదం చేసుకుంటూ న‌డ‌క సాగించారు. యాత్రలో ఒక ఆసక్తికర స‌న్నివేశం చోటుచేసుకుంది. తన ముందు నడుస్తున్న ఓ బాలిక చెప్పు ఊడిపోయి ఇబ్బంది పడుతుండ‌టంతో రాహుల్‌.. స్వయంగా ఆ బాలిక‌ను ఆపి స్వ‌యంగా చెప్పు తొడిగారు.

ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియోను భార‌త్ జోడో అధికారిక ట్విట‌ర్ ఖాతాలో షేర్ చేశారు. ప్రేమ‌, నిరాడంబ‌ర‌త దేశ‌న్ని స‌మైక్యంగా ఉంచ‌డానికి అవ‌స‌ర‌మ‌వుతాయంటూ కాంగ్రెస్ పార్టీ మ‌హిళా విభాగం తాత్కాలిక అధ్య‌క్షురాలు డిసౌజా కామెంట్ చేశారు. ఈ వీడియోపై అనేక‌మంది కామెంట్లు చేస్తున్నారు. మంచి మ‌న‌సున్న మ‌నిషి రాహుల్ గాంధీ అంటూ ఒక‌రు, మాన‌వ‌త్వం క‌లిగిన గొప్ప నేత రాహుల్ గాంధీ అంటూ మ‌రొక‌రు..

ఇలా ఆ వీడియోకు మంచి స్పంద‌న వ‌స్తోంది. యాత్రలో పార్టీ సీనియర్‌ నేతలు కేసీ వేణుగోపాల్‌, కె.మురళీధరన్‌, కొడికున్నిల్‌, రమేశ్‌ చెన్నితల, సురేశ్‌ తదితరులున్నారు. కుట్టనాడ్‌లోని రైతులతో రాహుల్‌ గాంధీ సమావేశమవుతారని పార్టీ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ ట్విటర్‌లో వెల్లడించారు. ఒట్టప్పనాలోని శ్రీ కురుట్టు భగవతి ఆలయం వద్ద భోజన విరామం తీసుకొని ఆ తర్వాత రైతులతో భేటీలో పాల్గొంటారని తెలిపారు.