గుడివాడలో కొడాలి నాని విజయం కోసం పనిచేస్తోంది వారే..

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు లోకేష్ పై మంత్రి కొడాలి నాని తీవ్ర పదజాలంతో విరుచుకుపడుతుంటారు. గతంలోకన్నా ఈ మూడు సంవత్సరాల్లోనే ఆయన పదునైన విమర్శలు చేశారు. ఎలాగైనా రాబోయే ఎన్నికల్లో నానిని ఓడించాలనే పట్టుదలను టీడీపీ శ్రేణులు వ్యక్తపరుస్తున్నాయి. గుడివాడ నుంచి వైసీపీ తరఫున వ‌రుస‌గా 2014, 2019 ఎన్నిక‌ల్లో రెండుసార్లు విజ‌యం సాధించిన కొడాలి నాని తెలుగుదేశం పార్టీకి కొర‌క‌రాని కొయ్య‌గా మారారు. పార్టీ వ్యవస్థాపకులైన ఎన్టీఆర్ సొంత నియోజకవర్గంలో గత రెండు ఎన్నికల నుంచి వరుసగా ఓటమిపాలు కావడానికి ఆ పార్టీ నేతలే కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

తెలుగుదేశం పార్టీ గుడివాడలో బ‌ల‌మైన అభ్య‌ర్థిని నిల‌బెట్ట‌లేక‌పోతోందంటున్నారు. టీడీపీ మ‌హిళా నేత‌ల‌పై కొడాలి నాని నోరు పారేసుకున్న కార‌ణంగా ఉమ్మ‌డి కృష్ణా జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయ‌కులంతా ఏక‌మ‌య్యారు. మాజీ మంత్రి దేవినేని ఉమా మ‌హేశ్వ‌ర‌రావు అయితే ఓడిస్తామంటూ తొడ‌లు గొట్టారు. ఎవరికి వారే.. యమునాతీరే అన్నట్లుగా ఉండే ఉమ్మడి కృష్ణా టీడీపీ నాయకులు అలా ఐకమత్యంగా ఉండటం మంచి పరిణామమేకానీ తాత్కాలికమేనంటున్నారు తెలుగు తమ్ముళ్లు. జిల్లాలో పార్టీ నేత‌ల మ‌ధ్య విభేదాలు రావ‌డానికి, అవి పెరిగి పెద్ద‌వ‌వ‌డానికి ఒక మాజీ మంత్రి కారణమని ఇప్పటికీ ఆ జిల్లా నాయకులు, కార్యకర్తలు ఆరోపిస్తుంటారు.

మినీ మహానాడు కూడా నిర్వహించలేకపోతున్నారని, దీనికి కూడా మీరు సమన్వయం చేసుకోలేకపోతున్నారా? అంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేయడంతో వారంతా కలిసికట్టుగా మీడియాతో మాట్లాడారని, చంద్రబాబు కోసం కంటితుడుపు చర్యలా వ్యవహరించారనే విమర్శలు కూడా వస్తున్నాయి. గుడివాడలోని తెలుగుదేశం పార్టీ నాయకులు పలువురు ఎన్నికల సమాయానికి ఆయనకు లోపాయికారీగా సహకరిస్తున్నారని, ఆయన చెప్పిందే వేదంగా వింటున్నారంటూ వార్తలు వచ్చాయి. 2019 ఎన్నికల సమయంలో ఏం జరిగిందో.. 2014 ఎన్నికల సమయంలోనే అదే జరిగిందంటున్నారు.

ఎన్నిక జరగడానికి సరిగ్గా రెండురోజుల ముందుగా ఈ నాయకులంతా నానికి సరెండర్ అవుతున్నారని, చివరి నిముషంలో అక్కడ బరిలోకి దిగిన అభ్యర్థికి చేయిస్తున్నారంటున్నారు. టీడీపీ నాయకుల్లో ఉన్న ఈ అనైక్యతే నానికి వరుసగా విజయాలు కట్టబెడుతోందని, లోపం ఎక్కడుందో అర్థమవుతున్నప్పటికీ రెండు ఎన్నికల్లోను సరిదిద్దుకునే ప్రయత్నమే చేయలేదని పార్టీ శ్రేణులే విమర్శిస్తాయి. నాయకుల మధ్య ఉన్న అనైక్యతే నానికి ఆయుధంగా మారిందనేది నిర్వివాదాంశం. ఇప్పటికైనా పార్టీలో ఉన్న కోవర్టులను గుర్తించి ఏరివేయకపోతే రాబోయే ఎన్నికల్లో కూడా షరా మాములుగానే కొడాలి నానికి విజయం దక్కుతుందని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. అధినేత ఏం చేస్తారో చూడాలి.!!