కేసీఆర్ అభినవ అంబేద్కర్, కొనియాడిన కలెక్టర్ శరత్

వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సంగారెడ్డి కలెక్టరేట్లో జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు నిర్వహించారు. వైభవంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. సీఎం కేసీఆర్‌ను అభినవ అంబేద్కర్గా కలెక్టర్ డా.శరత్ పొగిడారు. గిరిజనులకు 1౦ శాతం రిజర్వేషన్లు కల్పిస్తానని సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

పేద దళిత, గిరిజన వర్గాలకు కేసిఆర్ ఆశాదీపంగా మారారని కొనియాడారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ను చూడలేదని, కేసీఆర్ రూపంలో ఆయనను ఇప్పుడు చూస్తున్నామని తెలిపారు. అంబేద్కర్ స్ఫూర్తితో సీఎం కేసీఆర్ అట్టడుగు వర్ణాల అభ్యున్నతికి పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు.

గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించడం సంతోషంగా ఉందన్నారు. దేశ చరిత్రలో ఇది సంచలన నిర్ణయం అని, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. భూమి లేని గిరిజనులకు “గిరిజన బంధు” అంటూ సీఎం సంచలన నిర్ణయం తీసుకున్నారని శరత్ ప్రశంసించారు.

రాష్ట్రంలోని గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్‌ కల్పించేందుకు వారంలోగా జీవో విడుదల చేస్తాం అని పేర్కొన్న సంగతి తెలిసిందే. గిరిజన రిజర్వేషన్లపై కేంద్రాన్ని అడిగి అడిగి విసిగిపోయాం అని కేసీఆర్ అన్నారు. కేంద్రం చేయకపోతే గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లను రాష్ట్రమే అమలు చేసుకుంటుందని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. రాష్ట్రంలో పోడు భూముల పంపిణీకి ఇప్పటికే ఒక కమిటీ వేశామని వెల్లడించారు. ఆ కమిటీ నివేదిక మేరకు పోడు భూములను పంచుతామని స్పష్టం చేశారు. ఆ తర్వాత భూమి, భుక్తి లేని గిరిజన బిడ్డలకు దళితబంధు తరహాలో గిరిజనబంధు అమలు చేస్తామని, రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తాస్తామని కేసీఆర్ ప్రకటించారు. దీంతో సీఎం కేసీఆర్‌ను కలెక్టర్ కొనియాడారు.