కుమ్ములాటలు.. ర్యాలీలు.. ఫైనల్ గా అభ్యర్థి ఎవరంటే..?

రాబోయే ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు ప‌నిచేస్తున్నారు. క‌చ్చితంగా గెలిచి తీరాల్సిన ఎన్నిక‌లు కావ‌డంతో ఎప్ప‌టిక‌ప్పుడు.. ఎక్క‌డిక‌క్క‌డ అభ్య‌ర్థుల‌ను కూడా ముందుగానే ఖ‌రారు చేసుకుంటూ వ‌స్తున్నారు. ఎన్నిక‌ల చివ‌రి వ‌ర‌కు అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేయ‌ని బాబు అందుకు విరుద్ధంగా ఏడాదిన్న‌ర ముందుగానే ప్ర‌క‌టిస్తున్నారు. సీట్లు ఖరారైన‌వారంతా ప‌నిచేయాల‌ని, గెలిచి తీరాలంటూ ల‌క్ష్యాన్ని నిర్ధేశిస్తున్నారు.

చంద్రబాబు కూడా వరుసగా జిల్లాల ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నారు. కొన్ని కొన్ని సంద‌ర్భాల్లో ప‌నిచేయ‌ని నేత‌ల‌పై సీరియ‌స్ అవుతున్నారు. తాను ఎంత క‌ష్ట‌ప‌డి ప‌నిచేస్తున్నా మీరు స‌రిగా ప‌నిచేయ‌డంలేదంటూ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌ఛార్జిల‌పై అసంతృప్తిని వ్య‌క్తం చేస్తున్నారు. ఆయన ఈసారి రాయ‌ల‌సీమ‌పై ఎక్కువ‌గా దృష్టిసారించారు. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ కుప్పంలో చంద్ర‌బాబును ఓడిస్తానంటూ ప్ర‌త్య‌ర్థుల‌పై మాన‌సికంగా పైచేయి సాధించేందుకు ప్ర‌య‌త్నిస్తుండ‌గా అందుకు రివ‌ర్స్ లో చంద్రబాబు రాయ‌ల‌సీమ‌లో టీడీపీ జెండాను రెప‌రెప‌లాడించేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల‌కు అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేశారు. బ‌న‌గాన‌ప‌ల్లె నియోజ‌క‌వ‌ర్గం నుంచి బీసీ జ‌నార్ద‌న్‌రెడ్డి, మైదుకూరు నుంచి పుట్టా సుధాక‌ర్ యాద‌వ్‌, డోన్ నుంచి సుబ్బారెడ్డి, పులివెందుల నుంచి బీటెక్ రవికి ఖరారయ్యాయి. తాజాగా ప్రొద్దుటూరు నుంచి ప్ర‌వీణ్‌కుమార్ రెడ్డికి సీటు ఇచ్చిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. సీటు త‌న‌కే ఫిక్స్ అయిందంటూ ప్రొద్దుటూరులో పార్టీ శ్రేణుల‌తో భారీ ర్యాలీ నిర్వ‌హించారు. అనంత‌రం కేక్ క‌ట్‌చేసి ఆనందోత్సాహాలతో ఆయన అనుచరులు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.

అయితే ఈ వార్త‌ను టీడీపీ క‌డ‌ప పార్ల‌మెంటు అధ్యక్షుడు మ‌ల్లెల లింగారెడ్డి ఖండిస్తున్నారు. ఆయన ప్రొద్దుటూరులో మీడియాతో మాట్లాడారు. చంద్ర‌బాబు ఇంకా ఎవ‌రికీ సీటు ఇవ్వ‌లేద‌ని, ప్ర‌వీణ్ మాత్రం హ‌డావిడి చేస్తున్నార‌ని, ర్యాలీలు చేసి, కేక్ క‌ట్‌చేసినంత సులువుగా సీటు రాదని వ్యాఖ్యానించారు. అన్నివిధాలా ప్రొద్దుటూరు నుంచి పోటీచేసే అర్హత తనకే ఉందని, సీటు ఇస్తార‌నే న‌మ్మ‌కం వ్యక్తం చేస్తున్నారు. ప్రవీణ్ చేస్తున్న ప్రచారాన్ని ఖండించారు. మ‌ల్లెల లింగారెడ్డి 2009లో ప్రొద్దుటూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం సాధించారు.

2014లో వ‌ర‌ద‌రాజుల‌రెడ్డికి సీటిచ్చారు. 2019లో మ‌ళ్లీ టికెట్ సాధించిన లింగారెడ్డి ఓట‌మిపాల‌య్యారు. ఇక్క‌డ వ‌రుస‌గా రెండు ఎన్నిక‌ల్లో వైసీపీ గెలిచింది. ప్ర‌స్తుతం ప్ర‌వీణ్‌కుమార్‌రెడ్డి ఇన్‌ఛార్జిగా ఉన్నారు. తిరిగి పోటీచేయ‌డానికి లింగారెడ్డి ప్ర‌య‌త్నాలు చేసుకుంటున్నారు. మరోవైపు ప్ర‌వీణ్‌కుమార్‌కు కేటాయించారంటూ ప్రచారం నడుస్తోంది. ఇందులో వాస్తవమెంతో అధినేతే తేల్చిచెప్పాల్సి ఉంది. అప్పటివరకు చంద్రబాబు ఎంత తిరిగినా, ఎంత కష్టపడినా తమ్ముళ్లు ఇలాగే కుమ్ములాడుకుంటూ ఉంటారు. అభ్యర్థి ఎవరనేది ఇప్పుడే తేల్చేస్తే ఎవరిపని వారు చేసుకుంటారని, అసంతృప్తి ఉన్నా సర్దుబాటు చేయవచ్చని, అలా కాకుండా చివరి వరకు తాత్సారం చేస్తే అసలుకే మోసం వస్తుందని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు.